అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కులగణన పేరుతో బీసీలను వంచించాలని చూస్తున్నది. బీసీలను అణచివేయడం, వారిని నాయకత్వంలోకి రాకుండా అడ్డుకోవడం, అవమానించడం, రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వకుండా చిన్నచూపు చూడటం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందనేది వాస్తవం. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను నమ్మించి హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిరాగానే కులగణన పేరుతో పాలనను పక్కనపెట్టి కాలయాపన చేస్తున్నది. బీసీల జనాభాను తగ్గించి చరిత్ర క్షమించని తప్పుచేసింది.
బీఆర్ఎస్ అనేక మంది బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించింది. వామపక్ష నేతగా, ప్రజా నాయకుడిగా అనేక పోరాటాలు చేసిన నోముల నర్సింహయ్య కు నాగార్జునసాగర్ నుంచి ఎమ్మెల్యేగా బీఆర్ఎ స్ అవకాశం కల్పించింది. ఆయన మరణానంతరం వచ్చిన ఉప ఎన్నికలో కుమారుడు నోముల భగత్‌కుమార్‌కు బీఆర్ఎస్ అవకాశం కల్పించింది. ఒక బీసీ నేత మరణిస్తే ఏకగ్రీవానికి మద్దతు ప్రకటించాల్సిన కాంగ్రెస్.. అభ్యర్థిని నిలిపి బీసీలకు తాము వ్యతిరేకమని చాటుకున్నది.
ఒకప్పుడు నామినేటెడ్ పదవులు బీసీలకు అందని ద్రాక్షగా ఉండేవి. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సముచిత నిర్ణయాలు తీసుకున్నది. పార్లమెంటు మొదలు పంచాయతీల దాకా బీసీ లు రాజకీయంగా ఎదగాలని వారికోసం ప్రత్యేక రిజర్వేషన్లను తీసుకొచ్చింది. ఫలితంగా ఎంతో మంది బీసీలు ప్రభుత్వంలో భాగస్వాములయ్యారు. 2014 తర్వాత బూర నర్సయ్యగౌడ్, బీబీ పాటిల్‌ను లోక్‌సభకు పంపింది. వెనుకబడిన వర్గాలనుంచి వచ్చిన కె.కేశవరావు, డి శ్రీనివాస్, బండ ప్రకాశ్, బడుగుల లింగయ్య యాద వ్, ఒద్దిరాజు రవిచంద్ర వంటి నేతలను రాజ్యసభకు పంపి బీసీల పట్ల తమ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నది.ఇవేకాకుండా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేషన్, నామినేటెడ్ పదవుల్లో బీసీలను నియమించింది. బొంతు రామ్మోహన్ వంటి విద్యార్థి నేతకు హైదరాబాద్ మేయర్ పీఠాన్ని అప్పగించింది. ఇలా అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తూ వారి పక్షాన నిలబడి, పోరాడింది.
ఏడు దశాబ్దాలుగా దేశ పాలనలో ఉన్న కాం గ్రెస్, బీజేపీలు బీసీల సంక్షేమాన్ని విస్మరించాయి. స్వతంత్ర భారతంలో ఇప్పటివరకు బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖలేని దౌర్భాగ్య స్థితి లో మన ప్రభుత్వాలున్నాయి. ఒక్క బీఆర్ఎస్ మాత్రమే బీసీల సంక్షేమం కోసం పాటుపడింది. కాబట్టే, నాణ్యమైన, ఉన్నతమైన విద్యను అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ గురుకులాలను స్థాపించి మహత్మాజ్యోతిరావు పూలే స్ఫూర్తిని కొనసాగించారు. హైదరాబాద్ కేంద్రంగా ఆత్మగౌరవ భవనాలు నిర్మించి బీసీలకు భరోసా కల్పించారు. వృత్తి కులాల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి దేశానికే దిక్సూచిగా కేసీఆర్ నిలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మోసమే నినాదంగా ముందుకు సాగుతున్నది. కులగణనపై చట్టం చేయకుండా తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామనే కుంటిసాకులతో బీసీల్లో గందరగోళం సృష్టించాలని చూస్తున్నది. కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలుచేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు ఉంటే కులగణనపై చట్టం చేయాలి.