రాజకీయ కక్ష సాధింపులతోనే ఏడాది గడిపిన కాంగ్రెస్ పాలకులు, పాలనను గాలికి వదిలేశారు. దీంతో రాష్ట్రంలో అన్నిరంగాలూ సమస్యలతో నీల్గుతున్నాయి. రేవంత్ సర్కారు నిర్లక్ష్యానికి వేములవాడ ఆలయ కోడెల అక్రమ తరలింపు తాజా ఉదాహరణ. దక్షిణకాశీగా పేరుపొందిన వేములవాడ క్షేత్రంలో కొలువైన రాజరాజేశ్వరస్వామిని భక్తులు అభిమానంతో ‘ఎములాడ రాజన్న’గా పిలుచుకుంటారు. పేదల దేవుడైన రాజన్నకు కోడెను కట్టేసే సంప్రదాయం అనాదిగా వస్తున్నది. శివుడి వాహనం నంది కనుక రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో (ముఖ్యంగా రైతులు) కోల్లాగెలను తెచ్చి, రాజన్న సన్నిధిలో కట్టేసి వెళ్తారు. ఇలా కోడెల సంఖ్య ఏటికేడు పెరిగిపోతుండటంతో ఆలయాధికారులు వాటిని గుర్తింపు పొందిన గోశాలలకు, రైతులకు అందజేసేవారు.
ఈ విధానం అక్రమార్కులకు ఆయుధంగా మారింది. అంతే వాటిని పక్కదారి పట్టించడం వారికి షరామామూలైంది. తప్పుడు పత్రాలు, తప్పుడు లెక్కలతో కోడెలు పక్కదారి పట్టడం, ఆలయ సిబ్బందే అక్రమార్కులకు సహకరించడం మరీ దారుణం. కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో ఇలాంటి అక్రమాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈ సమస్య నుంచి భక్తులను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం కోడెలను రైతులకే ఇవ్వాలనే నాటకాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. ఇందుకోసం ఓ కమిటీ వేయడం, ఆ కమిటీ నామ మాత్రంగా వ్యవహరించడంతో ఈ నిబంధన నిర్వీర్యమైపోయింది. అయితే ఈ వివాదంలో ఓ మంత్రి పేరు తెరమీదకు రావడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఆ మంత్రి సిఫారసు మేరకే కోడెల కేటాయింపు జరిగినట్టు వార్తలు సైతం వెలుగుచూశాయి.
నిందితులు బినామీ పేర్లతో కోడెలను సేకరించి, ఆ తర్వాత కబేళాకు అమ్మేస్తుండటం దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. ఈ గోల్మాల్పై సదరు మంత్రి సొంత జిల్లా వరంగల్లోని గీసుగొండలో కేసు నమోదు కావ డమే అందుకు నిదర్శనం. ఈ ఘటనలో పోలీసులు ముగ్గురినీ అరెస్టు చేశారు. ఈ నిందితులు నకిలీ గోశాలలను సృష్టించడమే కాకుండా, రైతుల పేరిట పశువులను కబేళాలకు తరలించడం భక్తులను విస్మయ పరుస్తున్న విషయం. ఈ తతంగాన్ని ప్రభుత్వ యంత్రాంగం చూసీచూడనట్టుగా వ్యవహరించడం నిర్లక్ష్యానికి పరాకాష్ఠ. కోడెల సంరక్షణా బాధ్యతలను చూసుకోవాల్సిన ప్రభుత్వం, అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడమే కాకుండా తాజా ఘటనలపై ప్రశ్నిస్తే జవాబులు చెప్పలేక నీళ్లు నములుతుండటం గమనార్హం.
అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకునే ఉద్దేశం వారిలో ఏ కోశా నా కనిపించడం లేదు. విషయం బయటపడటంతో ఈ వ్యవహారాన్ని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలూ చేస్తున్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు జవాబు చెప్పకుండా సదరు మంత్రి తప్పించుకోచూడటం, విషయాన్ని బయటపెట్టిన సమాచార సాధనాలపై పోలీసులకు ఫిర్యాదు చేయడం విచిత్రం. ఏదేమైనప్పటికీ కోడెల తరలింపు వెనుక ఉన్న నిజానిజాలు బయటకురావాల్సి ఉన్నది. ప్రభుత్వం నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపించి బాధ్యులను వెంటనే శిక్షించాలి. తద్వారా భక్తుల విశ్వాసాల పట్ల తమకు ఏపాటి గౌరవం ఉన్నదో చాటుకోవాలి.