తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేండ్లకు కాంగ్రెస్ పార్టీ ‘మార్పు’ పేరిట ప్రజలను ఏమార్చి అధికారాన్ని చేజిక్కించుకున్నది. ఏడాది అయితే కానీ కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందనే విషయం ప్రజలకు తెలియలేదు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అన్నీ విఫల ప్రయోగాలే. తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ పాల్గొన్న చరిత్ర ఆయనకు లేకపోగా, ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన చరిత్ర తనది. ఇక పాలనా విషయానికి వస్తే కనీసం మంత్రిగా చేసిన అనుభవం కూడా లేదు. ఉద్యమంలో తెలంగాణ వ్యతిరేకులతో అంటకాగిన ఆయనకు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఏ మాత్రం తెలియవనేది నూటికి నూరుపాళ్లు నిజం. అందుకే, ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడ్డది. అందులో భాగమే తెలంగాణ అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణాన్ని, చార్మినార్ను తొలగించే ప్రయత్నం చేయడం.
2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి తొలి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేసింది. బోనాలు, బతుకమ్మ వంటి తెలంగాణ పండుగలకు ప్రాముఖ్యం ఇచ్చింది. అంతేకాదు, తెలంగాణ వంటలు సైతం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తెలంగాణ కట్టూ బొట్టు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. హైదరాబాద్ అంటే మొదటగా గోల్కొండనే గుర్తుకువస్తుంది. అలాంటి గోల్కొండ కోట మీద భారతీయ త్రివర్ణ పతాకం జెండా రెపరెపలాడింది.
ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ కోసం బయల్దేరితే ప్రజలు ఆయన వెన్నంటే నడిచారు. విధిలేక అన్ని రాజకీయ పార్టీలు ‘జై తెలంగాణ’ అని నినదించక తప్పనిసరి పరిస్థితి నెలకొన్నది. ఆ సమయంలోనే ఉద్యమకారులు, రాజకీయవేత్తలు, మేధావులు కలిసి ‘తెలంగాణ తల్లి’ని రూపొందించారు.
అయితే తెలంగాణ తల్లి తలపై కిరీటంతో పాటు ఒక చేతిలో మక్కజొన్న కంకి, మరో చేతిలో బతుకమ్మను ఏర్పాటుచేశారు. ఆ తల్లిని చూస్తే యువతలో రక్తం ఉరకలెత్తింది. ఆ తల్లి రూపం ఒక చైతన్య దీపికగా నాటి పోరాటానికి స్ఫూర్తిగా నిలిచింది. అలాంటి తెలంగాణ తల్లి రూపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడం ప్రజలను ఏమార్చడమే. పైగా కొత్తగా రూపొందించిన తెలంగాణ తల్లి నుంచి తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన బతుకమ్మను వేరు చేయడం నిజంగా సిగ్గుచేటు.
ఏ వ్యక్తి అయినా తమ తల్లిని గొప్పగా చూడాలనే తపిస్తాడు కానీ, హీనంగా చూడాలని కోరుకోడు. తల్లి వైభవంగా కనిపిస్తే ఆ కుటుంబం సుభిక్షంగా వర్ధిల్లుతున్నట్టే లెక్క. అట్లా ఉన్న తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడేసింది. నేటి తెలంగాణ తల్లి పట్టుచీరలో కాకుండా ముతకచీరలో ఉన్నది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన, తెలంగాణకు గర్వకారణమైన పోచంపల్లి, గద్వాల్ పట్టుచీరలు కట్టుకునే అర్హత మన తెలంగాణ తల్లికి లేదా? ఇది చేనేత పరిశ్రమలను, మన నేతన్నలను అవమానపరిచినట్టు కాదా? బతుకమ్మ లేని తెలంగాణ తల్లిని ప్రజలు ఆమోదించలేకపోతున్నారు. అంతేకాదు, ‘జయ జయహే తెలంగాణ’ పాటను ఒక ఆంధ్రా ప్రాంతానికి చెందిన సంగీత దర్శకుడితో, అది కూడా ఒక సినీ పాట తరహా రాష్ట్రగీతంగా ప్రకటించ డం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది లా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహించిన విజయోత్సవాలు చూసిన తర్వాత తెలంగాణ ఆనవాళ్లు క్రమంగా కనపడకుండా పోతాయేమోనన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
రాష్ట్రంలోని ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే విజయోత్సవాల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం సంబురాలు చేసుకోవడమే విడ్డూరం అంటే, వేదికలపై గాయకులతో సినిమా పాటలు పాడించటం ఆంధ్రప్రదేశ్లోని రికార్డు డ్యాన్స్ సంప్రదాయాలను చూసినట్టే ఉన్నది. అంతేకాదు, ఈ సంబురాలు తెలంగాణ సంస్కృతిని అవమానించినట్టుగా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ సమాజం జాగృతమై కాంగ్రెస్ నేతల కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఉద్యమ సారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని వింత పోకడలకు పోతున్న సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ ఆనవాళ్లను కనుమరుగు చేయడానికి ప్రయత్నిస్తున్నారనడంలో సందేహం లేదు. ఆయన పాలన తెలంగాణ అస్తిత్వానికే ప్రమాదం తెచ్చేలా ఉన్నది. తెలంగాణ ప్రజలు అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు మళ్లీ ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం వస్తుందేమో.