‘ఉనికిని కాపాడుకోవాలా? పూర్వవైభవం సంపాదించడానికి దారులు వెతకాలా?’.. భారత పూర్వ పాలకపక్షం కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు పీడిస్తున్న కీలక ప్రశ్నలివే. దక్షిణాదిన గుండెకాయ వంటి ప్రధాన రాష్ట్రం తెలంగాణలో పదేండ్ల విరామం తర్వాత 2023 శీతాకాలంలో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఈ జాతీయపక్షానికి 2024 వేసవి నుంచి అన్నీ ఎన్నికల ఎదురుదెబ్బలే తగిలాయి.
Congress | దశాబ్దం తర్వాత లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ గుర్తింపు పొందింది. ఎట్టకేలకు రాహుల్‌గాంధీ ప్రతిపక్ష నేత అయ్యారు. గత రెండు పార్లమెంటు ఎన్నికల్లో వరుసగా 44, 52 సీట్లకే పరిమితమైన ఆ పార్టీ పదేండ్లలో జాతీయపక్షమా? ప్రాంతీయపక్షమా? అంటే చెప్పలేని స్థితికి చేరుకున్నది. పార్లమెంటు లోపల, బయటా బాధ్యత గల, శక్తిమంతమైన ప్రతిపక్ష పాత్ర పోషించలేక చతికిలపడింది. 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఉన్న రాహుల్‌గాంధీ ఆ పార్టీ బలాన్ని ఆయన కనీసం పది సీట్లు కూడా పెంచలేకపోయారు. అంతేకాదు, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఆరు నెలలకు పైగా ఉండి రాహుల్ గాంధీ సంపాదించి పెట్టినవన్నీ పరాజయాలే.
2023లో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం రాహుల్, కాంగ్రెస్ కలలకు ఊతమిచ్చింది. కర్ణాటక ఎన్నికల్లో మాదిరిగానే ప్రజలను మాయజేసే హామీలతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్పశాతం ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆది నుంచీ ఊహించని రీతిలో ముందుకుసాగుతున్నది. రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కావడంతో పాలకపక్షంగా ఆ పార్టీని కొత్త దారిలో పడేసింది. అంతేకాదు, ఈ రెండు చోట్లా పరిపాలన గాడితప్పింది. జనంలో వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది. కర్ణాటకలో సిద్ధరామయ్య నానా పాట్లు పడుతుండగా, తెలంగాణలో రేవంత్‌రెడ్డి తప్పుడు నిర్ణయాలతో తాను ఇబ్బంది పడుతూ.. పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. సొంత రాజకీయ ప్రయోజనాలే తప్ప పార్టీ, ప్రజల క్షేమం ఆయనకు పట్టడం లేదు.
దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లు దాదాపు రెట్టింపు కావడంతో పాటు హర్యానాలోని పది సీట్లలో సగం స్థానాలు గెలుపొందడంతో రాహుల్‌గాంధీ అండ్ కోకు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు నల్లేరుపై బండిలా కనిపించింది. కానీ, కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవడం పార్టీ అగ్రనేతలు, కార్యకర్తలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇం డియా కూటమి పార్టీలకు అక్కడ ఒకటీ అరా సీట్లు కూడా ఇవ్వకపోవడం, ఆప్‌తో సీట్ల సర్దుబాటు లేకపోవడం హస్తం పార్టీని చావుదెబ్బతీసింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ నేతల్లో కల్పించిన అత్యాశకు హర్యానా ఫలితాలు సగం తెరదింపాయి. ఆ తర్వాత జరిగిన మహారాష్ట్ర ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి జీవితకాల గుణపాఠం నేర్పాయి. మాజీ సీఎంలు ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ల పార్టీలతో కలిసి కూటమిగా బరిలోకి దిగిన కాంగ్రెస్‌కు 12.42 శాతం ఓట్లు, కేవ లం 16 సీట్లు దక్కాయి.
కాంగ్రెస్‌కు చివరి కంచుకోటగా పరిగణించే మహారాష్ట్రలో ఇంత తక్కువ సీట్లు రావడం పార్టీ అహంకారానికి గొప్ప ముగింపు. రాజకీయ వ్యాఖ్యాత శేఖర్ గుప్తా విశ్లేషించినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తన ఉనికిని కాపాడుకోవడానికి, పూర్వ వైభవం సంపాదించడానికి మధ్య ఊహల్లో కొట్టుమిట్టాడుతోంది. ఓ వైపు మహారాష్ట్రలో ఘోర పరాజయం, మరోవై పు వయనాడ్ ఉప ఎన్నికలో ప్రియాంక గెలుపు కాంగ్రెస్‌కు ఊరటో, కొత్త మలుపునకు సంకేత మో అర్థం కాని పరిస్థితి. పార్లమెంట్‌కు తొలిసారి ఎన్నికయ్యాక అన్న రాహుల్ వెన్నంటి ఉండటమే ప్రియాంక రాజకీయ కార్యకలాపంగా మారింది.
ఈ సంక్షోభ సమయంలో బెళగావిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం పార్టీకి చూపించే దారిపై కూడా ఎవరికీ పెద్దగా ఆశలు లేవు. మొత్తం మీద లోక్‌సభలో కాంగ్రెస్‌కు ప్రతిపక్షనేత పదవి దక్కిన 2024 సంవత్సరం ఆ పార్టీకి తీవ్ర ఆశాభంగాన్నే మిగిల్చింది. కర్ణాటక, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాల పాలన చూస్తే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావడం సరికదా, కనీసం ఉనికిని కాపాడుకోవడం కూడా చాలా కష్టమనిపిస్తున్నది. అందుకే, కాంగ్రెస్ నాయకత్వం వద్దు మొర్రో అని ఇండియా కూట మి భాగస్వామ్యపక్షాలు గత కొన్ని వారాలుగా బాహాటంగా చెప్తున్నాయి. పరాజయానికి సంకేతంగా మారిన రాహుల్‌గాంధీ స్థానంలో పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురా లు మమతా బెనర్జీని తీసుకొస్తేనే ఇండియా కూటమికి మేలనే అభిప్రాయం బలపడుతున్నది. చివరికి కాంగ్రెస్‌కు 140 ఏండ్లు నిండే 2025 సంవత్సరమే దాని భవితవ్యాన్ని తేల్చివేసే పరీక్షా సమయం.
– నాంచారయ్య మెరుగుమాల