పార్టీలు మారే ఎమ్మెల్యేలకు పింఛన్ రద్దు చేస్తూ హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్ సర్కార్ అసాధారణమైన చట్టం తెచ్చింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద సభ్యత్వం కోల్పోయినవారికే ఇది వర్తిస్తుంది. అయితే ఏదో సదాశయంతో తెచ్చిన చట్టం కాదిది. కేవలం పార్టీని కాపాడుకునేందుకు దీన్ని తెచ్చారని చెప్పవచ్చు. గత ఫిబ్రవరిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో పార్టీ విప్‌ను ధిక్కరించినందుకు ఆరుగురు ఎమ్మెల్యేలు సభ్యత్వం కోల్పోయారు. అదే నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు. దీంతో ఫిరాయింపుల భయం పట్టుకున్న కాంగ్రెస్ సర్కార్ పైన తెలిపిన చట్టాన్ని ప్రవేశపెట్టింది. పింఛన్ పోతుందన్న భయంతోనైనా ఫిరాయింపులు ఆగుతాయనేది వారి ఆశ కావచ్చు. అయితే, పార్టీలు మారడంపై కాంగ్రెస్‌లో ఏకరూప విధానమేదీ లేదు. ఫిరాయింపుల చట్టానికి మరింత పదును పెడతామని ‘కాంగ్రెస్ పాంచ్‌న్యాయ్’ పేరిట విడుదల చేసిన మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. పార్టీ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ గోవాలో తమ శాసనసభ్యులతో పార్టీ మారబోమని ప్రమాణం చేయించి టాంటాం వేసుకున్నారు.
తెలంగాణలో ఆ పార్టీ అనుసరిస్తున్న విధానం మరోలా ఉన్నది. ‘విపక్ష శాసనసభ్యుల కొనుగోలు’కు వారి ఇండ్ల చుట్టూ కాంగ్రెస్ పెద్దలు చక్కర్లు కొట్టడం తెలిసిందే. కొందరిని చేర్చుకున్నారు కూడా. అయితే, వ్యవహారం స్పీకర్ ముందుకు, ఆ తర్వాత కోర్టుకు వెళ్లింది. అక్కడ ఏం నిర్ణయం జరుగుతుందనేది వేరే విషయం. కానీ, కాంగ్రెస్ పార్టీ నైతికత ఏమిటో ప్రజలకు బట్టబయలై పోయింది. ఫిరాయింపుదార్లను రాళ్లతో కొట్టి చంపాలన్న సీఎం రేవంత్‌రెడ్డి అరకొరగా ఉన్న బలాన్ని పెంచుకునేందుకు ఆ ఫిరాయింపులనే ఆశ్రయించడం కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. కర్ణాటకలో బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కోట్ల రూపాయలు ఆశ చూపుతున్నదని సీఎం సిద్ధరామయ్య గగ్గోలు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఫిరాయింపు ఎత్తుగడలను ప్రతిఘటిస్తున్నట్టుగా ఫోజు పెట్టే కాంగ్రెస్ తెలంగాణ విషయానికి వచ్చేసరికి పూర్తి భిన్నమైన వైఖరిని అవలంబిస్తున్నది.
అడ్డగోలుగా ఫిరాయింపులు ప్రోత్సహించి ఆయారామ్ గయారామ్ సంస్కృతిని పెంచి పోషించిన కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఫిరాయింపుల నిరోధక చట్టం రావడం, నీరుగారిపోవడం చారిత్రిక వైచిత్రి. 1957-67 మధ్యకాలంలో ఫిరాయింపుల వల్ల అత్యధికంగా లబ్ధి పొందింది కాంగ్రెస్సే. ఆ కాలవ్యవధిలో 98 మంది కాంగ్రెస్‌ను వీడితే, 419 మంది వచ్చిచేరడం గమనార్హం. 1967లో బీహార్‌లో గయాలాల్ అనే శాసనసభ్యుడు ఒకేరోజు మూడు పార్టీలు మారడం ఫిరాయింపుల సంస్కృతికి పరాకాష్ఠగా చెప్తారు. 1967, 1971 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర చట్టసభలకు ఎన్నికైన ప్రతినిధుల్లో 50 శాతం మంది పార్టీ మారారు. తదనంతర కాలంలో ఫిరాయింపులపై కాంగ్రెస్ వైఖరి మారింది. 1984లో ఇందిర మరణానంతరం ప్రధాని పదవి చేపట్టిన రాజీవ్‌గాంధీ ఆ ఏడాది చివరలో జరిగిన ఎన్నికల్లో 400 పైచిలుకు స్థానాలు సంపాదించి రికార్డు నెలకొల్పారు. అయితే ఆ విజయం ఫిరాయింపుల వల్ల ఎక్కడ వీగిపోతుందోననే భయం వల్లనో లేక ఫిరాయింపుల మీద ప్రజల్లో వ్యక్తమవుతున్న ఏవగింపు వల్లనో గానీ ఆయన 1985లో ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చారు. కానీ అది ఎన్నడూ చిత్తశుద్ధితో అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు అదే కాంగ్రెస్ తన సొంత అవసరాల కోసం చట్టానికి తూట్లు పొడుస్తుండటం పార్టీ రెండు నాల్కల ధోరణిని ఎత్తిచూపుతున్నది. పైగా, రాష్ర్టానికో విధానం అనుసరిస్తూ అవకాశవాద రాజకీయాలు చేయడం మరీ విడ్డూరం.