140 ఏండ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, ఇప్పడు తెలంగాణల అరువు తెచ్చుకున్న రేవంత్‌రెడ్డి చేతిలో బందీ అయిపోయినట్టు కనిపిస్తున్నది. దేశం కోసం త్యాగాలు చేశామని చెప్పుకొనే నెహ్రూ, గాంధీ కుటుంబం ఇవాళ రాబంధు ఇచ్చే ముష్టికి బానిసలు అయ్యారని అనిపిస్తున్నది. నడుస్తున్న పరిస్థితులే ఇందుకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. ‘నేనే రాజు, నేనే మంత్రి! ఇంకా పదేండ్లు నా చుట్టే రాజకీయం తిరగాలి. నేనే 2034 దాకా ముఖ్యమంత్రిగా ఉంటా. ఆ తర్వాత రాహుల్‌గాంధీని ప్రధాన మంత్రిని చేస్తా, జాతీయ రాజకీయాల్లో నేనే చక్రం తిప్పుతా!’ అంటూ ఒక అరువు నాయకుడు వెకిలిగా, అహంకారంతో, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా విర్రవీగుతూ అరుస్తుంటే.. ప్రజాస్వామ్య పరిరక్షకులం అని చెప్పుకొనే గాంధీలు ఎందుకు నోళ్లు మూసుకున్నట్టు?
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో జాతీయ పార్టీనా? లేక ఒక వ్యక్తి ఆధీనంలో నడిచే ప్రైవేట్ పొలిటికల్ ఫ్రాంచైజీగా మారిపోయిందా? అనే ప్రశ్న రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహార శైలి, ఆయన తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు, పార్టీలో ఉన్న సీనియర్లను తొక్కుతున్న తీరు, ఢిల్లీ పెద్దలకు పంపుతున్న రాజకీయ సంకేతాలు చూస్తుంటే ఈ అనుమానాలకు బలం చేకూరుతున్నది. తెలంగాణ కాంగ్రెస్ ఏకస్వామ్య ఆధిపత్య వ్యవస్థగా మారిపోయిందని ఒరిజినల్ కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ప్రజాబలం ఉన్న నేతలు ఎదగకూడదు, మరో పవర్ సెంటర్, ప్రశ్నించే నాయకత్వమే ఉండకూడదు అనే ధోరణిలో రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఒకరి తర్వాత ఒకరిని టార్గెట్ చేసి రాజకీయదాడి చేస్తున్నారు.
రేవంత్‌రెడ్డి చెప్పుకొన్నట్టుగానే తొక్కుకుంటూ పోతున్నారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పార్టీలో తీవ్ర అవమానాల మధ్య బయటకు వెళ్లాల్సి వచ్చింది. బీసీ నాయకత్వాన్ని అవమానిస్తున్నారని, కావాలనే పక్కనబెట్టారని ఆయన రాజీనామా లేఖలోనే రాశారు. టీపీసీసీ మరో మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం, అంతర్గత రాజకీయ ఒత్తిళ్లతో బలహీనపరిచే కుట్రలు జరిగాయి. ఏఐసీసీ నాయకత్వంలో పనిచేసిన నదీమ్ జావేద్ లాంటి నేతలతో కూడా రేవంత్‌రెడ్డికి తీవ్ర విభేదాలు వచ్చాయి. ఆయనపై తప్పుడు ఆరోపణలు చేసి, తెలంగాణ నుంచి అవమానకరంగా వెనక్కి పంపించేశారనే వార్తలు విన్నాం.
తెలంగాణ కాంగ్రెస్‌లో పెరుగుతున్న ఈ ముఠా తగాదాలను అదుపు చేయడానికి ఏఐసీసీ పదేపదే జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని జాతీయ మీడియా కూడా కోడై కూసింది. కేంద్రమంత్రిగా పని చేసిన నాయకుడు సర్వే సత్యనారాయణను తీవ్రంగా అవమానించారు. ఇక చిన్నారెడ్డి అయితే ‘నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా’ అని బాధపడే దుస్థితి కల్పించారు. ఒక టీవీ చానల్‌తో కుమ్మక్కై ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కను అప్రతిష్టపాలు చేశారు. ప్రస్తుతం ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్‌ను తన చెప్పుచేతుల్లో ఉంచుకొని, మీడియా సంస్థల ద్వారా అదిరించి, బెదిరించి, ఆవిడ పాత్రను కేవలం చిన్న పనులకే పరిమితం చేశారనే విమర్శలు ఉన్నాయి.
నలభై ఏండ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం, కాంగ్రెస్‌కు నమ్మకమైన పిల్లర్‌గా ఉన్న మాజీమంత్రి టి.జీవన్‌రెడ్డిని రేవంత్‌రెడ్డి ఎంతగానో అవమానించారు. కాంగ్రెస్‌లో ఇమడలేక, ప్రజల పక్షాన గొంతు వినిపించేందుకు ఆయన బీఆర్ఎస్లో చేరారు. జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను రేవంత్‌రెడ్డి తన గ్రూపు రాజకీయాల కోసం కాంగ్రెస్‌లోకి లాగడం, జీవన్‌రెడ్డిని కనీసం సంప్రదించకపోవడం ఒరిజినల్ కాంగ్రెస్ నేతలను ఎంత చులకనగా చూస్తున్నారో నిరూపించింది.
దీనిపై పార్టీ జనరల్ సెక్రటరీ కత్తి వెంకటస్వామి లాంటి నేతలు బహిరంగంగానే రేవంత్ వైఖరిని తప్పుబట్టారు. కానీ, రాహుల్‌గాంధీ ఎందుకు నోరు విప్పడం లేదు? రేవంత్ పంపుతున్న మూటల కోసమేనా? మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన సీనియర్‌నేత హనుమంతరావు రెండున్నరేండ్లు ఢిల్లీలో పైరవీ చేసుకుంటే ఓ సలహాదారు పదవి విదిల్చారు. ఇక ఇప్పుడు సైకిల్ కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్ టార్గెట్ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తున్నది. ఒక మీడియా చానెల్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ‘డిజాస్టర్ లీడర్” అని టార్గెట్ చేయడం వెనుక రేవంత్‌రెడ్డి ఉన్నారని కాంగ్రెస్‌లో బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. ఎంపీ మల్లు రవి లాంటి నేతలు We Stand with Mahesh Kumar అంటూ సోషల్ మీడియా వేదికగా తిరుగుబాటు చేయాల్సి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నేతలది ఇదే దుస్థితి.
ఇంకా తీవ్రమైన అనుమానాలు రేకెత్తిస్తున్న అంశం ఏందంటే, రేవంత్‌రెడ్డి, బీజేపీల మధ్య కనిపిస్తున్న సాఫ్ట్ పొలిటికల్ అండర్ స్టాండింగ్. ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌లో నిర్వహించిన సభావేదికపై మాట్లాడుతూ తనతో చేతులు కలపాలని రేవంత్‌రెడ్డిని కోరారు. ఆ సమయంలో రేవంత్ చేతులెత్తి మహద్భాగ్యం అన్నట్టుగా కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించారు. కానీ, ఆ తర్వాత కనీసం మోదీ వ్యాఖ్యలను ఖండించలేదు. ఒక కన్నుతో రాహుల్‌గాంధీని చూస్తూ, మరో కన్నుతో మోదీకి సైగ చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ను ముంచేసి, భవిష్యత్తులో బీజేపీలో చేరి తెలంగాణ సువేందు అధికారి (బెంగాల్ కొత్త సీఎం) కాబోతున్నాడని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.
తాను 2034 వరకు ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పడం, అదే టైంలో రాహుల్ గాంధీని 2034లో ప్రధానిని చేస్తాను అని అనడం వెనుక పెద్ద పొలిటికల్ స్కెచ్ ఉన్నది. ఆ వ్యాఖ్యల అంతరార్థం ఏంది? 2029లో కూడా మోదీనే గెలుస్తారని రేవంత్‌రెడ్డి చెప్తున్నారా? కేంద్రంలో 2029లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని అంటున్నారా? అనే ప్రశ్నలను ఆయనే తెరపైకి తీసుకొచ్చారు. 2029లో బీజేపీని ఓడిస్తామని కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు చెప్పుకొంటుంటే, ఆ పార్టీకి చెందిన తెలంగాణ సీఎం మాత్రం అది అయ్యే పని కాదని అధిష్ఠానానికి చెప్తున్నారా? ఈ అహంకారపూరిత వ్యాఖ్యలు రాహుల్‌గాంధీకి వెన్నుపోటు కాదా?
మరోవైపు తెలంగాణలో రేవంత్‌రెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసం పేదల ఇండ్లు కూల్చితే, భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కుతే, ఆఖరికి ఆర్టీఐ చట్టాన్ని విస్మరించి విచ్చలవిడి దోపిడీకి పాల్పడుతుంటే, హేట్ స్పీచ్ బిల్లు పేరుతో భావప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తుంటే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఎందుకు చోద్యం చూస్తున్నది? ఏఐసీసీ అధ్యక్షుడు మలికార్జున్ ఖర్గే, ముఖ్యనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? దోపిడీ పాటకు ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు?
కాంగ్రెస్ అధినాయకత్వం ఇంతలా దిగజారడం, వారి భావ దారిద్య్రానికి నిదర్శనం. ఈ పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ నిజంగానే జాతీయ పార్టీనా? లేక మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నట్టుగా రేవంత్‌రెడ్డి కొనుక్కున్న ప్రైవేట్ లిమిటెడ్ పొలిటికల్ ఫ్రాంచైజీనా? అనే ప్రశ్న ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకమైన చర్చగా మారింది. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిజస్వరూపం ప్రజలకు మరోసారి అర్థమైంది. ఇక ఆ పార్టీ తెలంగాణలో నామరూపాలు లేకుండా పోవడం ఖాయం!
(వ్యాసకర్త: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ)
-డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్