2019, సెప్టెంబర్ 17 నుంచి ‘తెలంగాణ ఉద్యమకారుల ఫోరం’ చేసిన కృషి ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉద్యమకారుల అంశాన్ని ప్రస్తావించింది. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అమరుల విషయమై ఇంకా స్పష్టమైన ప్రకటన ఏదీ రాకపోవడం శోచనీయం. అయితే, పేరుకు మాత్రం ‘ప్రజాపాలన’ దరఖాస్తు ఫారంలో ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలను సేకరించింది. దీంతో కేసులు లేని తెలంగాణ ఉద్యమకారులు ఆందోళనకు గురవుతున్నారు. పిల్ల పుట్టకముందే కుల్ల కుట్టినట్టుగా ఉద్యమకారులకు ఏ రకమైనటువంటి సహాయం చేయకుండా నిబంధనలు విధించేసరికి ఉద్యమకారులు ఆవేదన చెందుతున్నారు. కేసులు, జైలుశిక్ష ప్రాతిపదికన ఉద్యమకారులను గుర్తించడం రాజ్యాంగ విరుద్ధమే.
ఉదాహరణకు ఉత్తరాఖండ్‌ను తీసుకున్నట్టయితే, అనేక ఉద్యమాలతో 2000, నవంబర్ 9న రాష్ట్రంగా ఏర్పాటైంది. రాష్ట్రం సిద్ధించిన అనతి కాలంలోనే అప్పటి ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి అందరికీ ఉచిత బస్‌పాస్‌లు, విధానసభ సచివాలయంలోకి ప్రత్యేక ప్రవేశాలను కల్పించింది. ఉద్యమకారులకు జిల్లా మేజిస్ట్రేట్ గుర్తింపు కార్డులు జారీచేసింది. అంతే కాదు, 7 రోజులు, ఆపై జైలు శిక్ష అనుభవించినవారికి, ఉద్యమంలో గాయాలపాలైన వారికి తమ తమ విద్యార్హతలను బట్టి ఎలాంటి పరీక్ష లేకుండానే గ్రూప్-3, గ్రూప్-4 పోస్టుల్లో ఉద్యోగాలు కల్పించింది. వారం రోజుల కన్నా తక్కువ జైలు శిక్ష అనుభవించినవారికి గ్రూప్-4 నుంచి గ్రూప్-1 వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించింది. యాభై ఏండ్లకు పైబడిన ఉద్యమకారుల కుటుంబీకులకూ ఇవే నిబంధనలు వర్తింపజేసింది.
2007లో కరుణేష్ జోషి, 2009లో నారాయణ్‌సింగ్ రానా అనే ఇద్దరు వ్యక్తులు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో ఆ రాష్ట్ర హైకోర్టు ఆ జీవోలు రాజ్యాంగంలోని ఆర్టికల్-309కు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొనడంతో హైకోర్టు సూచనలను పాటించింది. ఈ నిబంధనల ప్రకారం ఉద్యమకారులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధి దాటి గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించింది. తదనంతర జీవోల ద్వారా రిజర్వేషన్లు ఉద్యమకారుల కుటుంబ సభ్యులందరికీ వర్తిస్తాయని చెప్పింది. అయితే, రాష్ట్ర హైకోర్టు ఉద్యోగాలు పొందినవారి డేటాను పరిశీలించి, శాంతియుతంగా ఉద్యమం చేసిన అమాయకులకు, పరపతి లేనివారికి ఉద్యోగాలు ఇవ్వలేదు, రౌడీలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్నది.
అయితే, ప్రభుత్వం ఉత్తరాఖండ్ ఉద్యమకారులు, వారిపై ఆధారపడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ చట్టం 2015 ముసాయిదాను తయారుచేసింది. రాష్ట్ర అసెంబ్లీ 2016లో ఆ బిల్లును పాస్ చేసింది కానీ, గవర్నర్ ఆమోదం పొందలేదు. 2017లో హైకోర్టు డివిజన్ బెంచ్‌లోని ఇద్దరు జడ్జీలు భిన్నాభిప్రాయాలు తెలిపారు. మొత్తంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉద్యమకారులను నిర్ధారించడంలో శాస్త్రీయత, తార్కికత లేకపోవడం కనిపించింది. దీన్నిబట్టి మన తెలంగాణ ప్రభుత్వం కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఆర్టికల్-14, 16 లకు భంగం కలగకుండా ఆర్టికల్-309 ప్రకారం ఉద్యమకారులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించాలి. అంతేకాదు బహిరంగ నోటిఫికేషన్ జారీచేసి, నిర్ణీత గడువులోగా ఉద్యమకారులని భావించే వారందరి నుంచి సెల్ఫ్ అటెస్టెడ్ అఫిడవిట్‌తో ఉన్న దరఖాస్తును స్వీకరించాలి. అలా స్వీకరించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సమగ్రంగా విచారణ జరపాలి. తప్పుడు అఫిడవిట్లు సమర్పించిన దరఖాస్తు దారులను కఠినంగా శిక్షించాలి. తద్వారా తేలిన నిజమైన ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు జారీచేయాలి. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని నిజమైన ఉద్యమకారులకు సరైన న్యాయం చేస్తుందని ఆశిద్దాం.
(వ్యాసకర్త: కో-ఆర్డినేటర్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం)
– మోకాటి రాంబాబు, 77990 80866