“ఏటికేతం పట్టి వెయి పుట్లు పండించి ఎన్నడూ మెతుకెరగరన్నా.. నేను గంజిలో మెతుకెరగరన్నా… కాల్జేయి కడుక్కోని కట్టమీద కూసుంటే కాకి దన్ని పాయెరన్నా… కాకి పిల్ల దన్ని పాయెరన్నా.’ ప్రస్తుతం తెలంగాణలో రైతుల పరిస్థితికి ఈ రెండు గేయరూప వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో చుక్క నీరు లేని చెరువులు, జీవకళ లేని నదులతో అరిగోస పడుతుంటే దశాబ్దకాలం పాటు ఉద్యమం చేసి రాష్ట్రం తెచ్చుకున్నాం. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో కేసీఆర్ ముందుచూపుతో ఎక్కడచూసినా జలసిరులు, రైతుల కళ్లల్లో ఆనందం కనిపించింది. చెరువులు, వాగులు, వంకలు, నదులు అని తేడా లేకుండా ప్రతిచోట నీళ్లుండేవి. కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వ అసమర్థత కారణంగా… ఏ కట్ట మీద చూసినా ఇసుక కోసం లారీల వరుసలు కనిపిస్తున్నాయి. రైతులు నీళ్ల కోసం ప్రాధేయపడుతుంటే ఇదే అదునుగా కాంగ్రెస్ నాయకులు ఇసుక మైనింగ్‌లకు అనుమతుల కోసం హైదరాబాద్‌లో తిష్ఠ వేసి మరీ చెరువులను, నదులను చెర పట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఒక్క రైతు కూడా సాగునీటి కోసం ఆందోళన చేసింది లేదు. రోడెక్కింది లేదు. కానీ, ఒకే ఒక్క ఏడాదిలో పరిస్థితులు తలకిందులైనాయి. మళ్లీ బోరింగ్ మెషిన్లు తెలంగాణ పల్లెల్లో చప్పుడు చేస్తున్నాయి. అప్పుల కోసం రైతులు మళ్లీ బంగారం కుదువ పెట్టే పరిస్థితులు దాపురించాయి. ట్యాంకర్లతో నీళ్లు రప్పించుకొని పొలాలకు పారించే దౌర్భాగ్య పరిస్థితులను తీసుకువచ్చిన రేవంత్‌రెడ్డిని తిట్టని రైతు లేడు. వారి గోస తీర్చకపోగా వాళ్లను ఒక పార్టీకి చెందిన వాళ్లనే ముద్రేసి రైతుల ఉసురు పోసుకుంటున్నారు. రైతులనే కాదు, మహిళా జర్నలిస్టులను అరెస్టు చేయిస్తున్నాడు.
తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడేవాళ్లను రేవంత్‌రెడ్డికి ఇప్పుడే కాదు, ఉద్యమకాలం నుంచే శత్రువులుగా చూసే అలవాటుంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణను వ్యతిరేకించి చంద్రబాబు చెప్పుచేతల్లో పనిచేసిన ఆయన ఇప్పుడు అదే దారిలో వెళ్తున్నాడు. అప్పట్లో తెలంగాణ ప్రాంతాన్ని అణచివేసి, ఇక్కడి నిధులు నియామకాలు కొల్లగొట్టిన చంద్రబాబు ఇప్పుడు తన శిష్యుడిని రంగంలోకి దించారు.
తాను తెలంగాణకు చేసిన విధ్వంసాన్ని కొనసాగించాలని రేవంత్‌కు సూచనలు ఇచ్చిన చంద్రబాబు ఏ నాటికైనా ప్రత్యేక రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నామనుకునే విధంగా తెలంగాణను కష్టాల్లో చూడాలని అనుకుంటున్నారు. ఆయన జాడల్లోనే తెలంగాణ అస్తిత్వాన్ని మరుగుపర్చేలా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. లక్షలాది రైతుల ప్రయోజనకరమైన కాళేశ్వరం లాంటి ఒక పెద్ద ప్రాజెక్టుకు కేవలం తన అహంకారం కోసం రిపేర్లు చేయించటం లేదు. తెలంగాణ తల్లి విగ్రహ మార్పుతో కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసిండు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు విలువనివ్వని రేవంత్‌రెడ్డి ఏనాటికైనా సమైక్య రాష్ట్రంలోని నాయకుల సంకలో ఉంటాడే తప్ప.. తెలంగాణ గల్లీల్లో కాదు.
ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేలా, రైతుల గోసలను తీర్చేలా చర్యలు తీసుకోవాలి. రాజకీయ లబ్ధి కోసం కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్న కోట్ల మంది రైతుల ప్రయోజనాల కోసం ఆలోచించాలి. ఏడాది పాలనలోనే ఇంత వ్యతిరేకత ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రితో ఇంకా మూడున్నరేండ్ల పాలనలో తెలంగాణ రైతులు ఎన్ని కష్టాలు పడాలో…
– రసమయి బాలకిషన్, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే