ఫేక్ మెసేజ్‌లు, ఫేక్ కాల్స్, ఫేక్ నోటిఫికేషన్స్‌తో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతుంటారు. ఎవరినైనా మోసం చేయవచ్చు కానీ రైతులను మోసం చేయడం అంత ఈజీ కాదని తేలిపోయింది. ‘పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన’ కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం సగం ధరకే ట్రాక్టర్లు ఇస్తునట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అది ఫేక్ అని.. రైతులు మోసపోవద్దని వ్యవసాయ శాఖ హెచ్చరించింది. తమ గురించి ఏనాడూ పట్టించుకోని మోదీ సర్కార్ సగం ధరకు ట్రాక్టర్లు ఇస్తుందంటే ఎలా నమ్ముతాం.. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాలా అని రైతులు ఎదురు ప్రశ్నిస్తున్నారట!
బీఆర్ఎస్ది కుటుంబ పాలన అని విమర్శించే కాంగ్రెస్ నాయకులు, తమ వరకు వచ్చేసరికి మాత్రం ఒక్కో నాయకుడు ఎమ్మెల్యే టికెట్ల కోసం రెండు, మూడేసి దరఖాస్తులు చేసుకున్నారు. ఒక టికెట్ తనకు, ఇంకో టికెట్ కొడుక్కి, మరో టికెట్ కూతురికి లేక భార్యకు ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా డబుల్ ధమాకా ఫ్యామిలీ ప్యాక్ టికెట్ల కోసం దరఖాస్తు చేసిన 25 మంది నాయకుల్లో మాజీ మంత్రులు, టీపీసీసీ బాధ్యులు, సీనియర్ నాయకులు ఉన్నారు. కానీ బయటేమో కుటుంబ పాలన అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పేది కూడా వీరే.
బండి సంజయ్ వచ్చారు…ఇక మస్తు కామెడీ అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెగ సంబరపడుతున్నారు! బీజేపీ తెలంగాణ అధ్యక్షునిగా తప్పించి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించాక ఇటీవల ఆయన జాతీయ నాయకుని హోదాలో విజయవాడకు వెళ్లారు. అన్య మతస్తుడ్ని టీటీడీ చైర్మన్‌గా నియమిస్తారా? అంటూ భూమన కరుణాకర్ రెడ్డిపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఆయన వ్యాఖ్యల్ని ఎవరూ సీరియస్‌గా తీసుకొని స్పందించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం బండన్న వచ్చిండు.. ఇక తమకు మస్తు కామెడీ అంటూ ట్రోలింగ్లు పెరిగాయి!
ఆస్తుల క్రయ విక్రయాలపై బాండ్ రాసుకోవడం గురించి విన్నాం కానీ, ఏ ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలన్న దానిపై ఒప్పందం చేసుకొని బాండ్ రాసుకుంటారన్నది మాత్రం కొత్త విషయమే. జనగామ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 2018లో పొన్నాల లక్ష్మయ్య , 2023లో కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పోటీ చేసేలా 2018లోనే ఒప్పందం చేసుకున్నట్టు తాజాగా బయటపడింది. గత ఎన్నికలలో తనకు అవకాశం ఇస్తే, వచ్చే ఎన్నికల్లో టికెట్ మీదే అని హామీ ఇచ్చిన పొన్నాల, ఈసారి తిరిగి ఎలా దరఖాస్తు చేసుకుంటారని కొమ్మూరి ప్రశ్నిస్తున్నారు. ఒప్పందాన్ని ఉల్లంఘించిన పొన్నాలపై చర్య తీసుకోవాలని టీపీసీసీకి కొమ్మూరి ఫిర్యాదు చేయడం కొసమెరుపు.
– వెల్జాల