కులగణనకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఇది రాహుల్‌గాంధీ సాధించిన విజయమని కాంగ్రెస్ నాయకులు సంబురపడుతున్నారు. కానీ, ప్రధాని ఎత్తుగడలను పరిశీలిస్తే అసలు విషయం బోధపడుతుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కులగణనపైనే ప్రధానంగా ప్రచారం సాగింది. కులగణన జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా.. కులం పేరుతో విడదీయడానికి ప్రయత్నిస్తున్నారని, విడిపోతే చెడిపోతామని కులగణనకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ బలంగా గళం వినిపించారు. తీరా చూస్తే మహారాష్ట్రలో బీజేపీ కూటమి భారీ విజయం సాధించింది.
బీజేపీ మొదటినుంచి కులగణనను వ్యతిరేకిస్తూ వచ్చింది. ‘హిందువులం బంధువులం’ అనే ఆర్ఎస్ఎస్ నినాదం పైకి వినిపించకపోయినా.. కాంగ్రెస్, ఇతర పక్షాలు కులగణన అంశాన్ని తెరపైకి తెచ్చిన ప్రతీసారి విడిపోతే చెడిపోతామని బీజేపీ చెబుతూ వస్తున్నది. అలాంటి బీజేపీ ప్రభుత్వం హఠాత్తుగా ఈసారి జనాభా లెక్కల్లో కులగణన కూడా చేపట్టనున్నట్టు ప్రకటించడం గమనార్హం. ఈ మేరకు ఏప్రిల్ 30న జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మన దేశంలో తొలుత బీహార్‌లో కులగణన జరిగింది. తర్వాత తెలంగాణ, కర్ణాటకలో నిర్వహించారు. కర్ణాటకతోపాటు తెలంగాణలో కులగణన తప్పులతడకగా ఉందని విమర్శలు వచ్చాయి. తమ కులం జనాభాను తగ్గించారని కొన్ని సామాజికవర్గాలు ఆరోపణలు చేశాయి. అధికార పార్టీ నాయకులు సైతం కులాల లెక్కలు సరిగ్గా లేవని విమర్శించారు. ఆయా రాష్ర్టాల్లో జరిగిన కులగణన రాజకీయంగా ఉపయోగపడవచ్చేమో కానీ, అవి చట్టబద్ధం కావు. జనాభా లెక్కల సేకరణ అంశం కేంద్రం పరిధిలోనిది కావడమే అందుకు కారణం. ఆ విషయం తెలిసినా రాజకీయ కారణాలతో కొన్ని రాష్ర్టాలు కులాల లెక్కలు తీస్తూనే ఉన్నాయి.
కులగణన చేపట్టాలని భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇది రాహుల్ విజయమని కాంగ్రెస్ నాయకుల ప్రచారం. ఇది సమాజ్‌వాదీ పార్టీ విజయమనేది అఖిలేష్ యాదవ్ అభిప్రాయం. ఇది మన విజయమని బీహార్ పాలకుల వాదన. జనతా దళ్, లోక్ జనశక్తి, ఎన్సీపీ, డీఎంకే పార్టీలు తమ విజయమని చెప్పుకోగా, బీజేపీ మిత్రపక్షాలు జేడీయూ, ఎల్జేపీ (రాం విలాస్ పాశ్వాన్) పార్టీలు తమ విజయమని ప్రకటిస్తున్నాయి. కులగణన డిమాండ్ చేయడమంటే దేశ ద్రోహమేనని, దేశాన్ని కులం పేరుతో విభజించే ప్రయత్నమని మొన్నటివరకు విమర్శించిన బీజేపీ సైతం ఇది మోదీ సామాజిక విప్లవమని గొప్పగా చెప్తున్నది.
ఈ విజయం ఎవరిదనే విషయాన్ని పక్కనపెడితే ఇప్పటి వరకు స్వతంత్ర భారతంలో కులగణన చేయలేదనేది వాస్తవం. కులగణన వల్ల దేశంలో ఏ సామాజికవర్గం వారు ఎంత మంది ఉన్నారనే విషయం తేటతెల్లమవుతుంది. తద్వారా సామాజిక, రాజకీయరంగాల్లో ఆయా కులాలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం వద్ద లెక్కలు అందుబాటులో ఉంటాయి. అయితే, కులగణన తమ విజయమని కాంగ్రెస్ చెప్పుకొంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఐదు దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నా సామాజిక న్యాయం కోసం కులగణన చేయాలనే ఆలోచన రానందుకు కూడా కాంగ్రెస్ బాధ్యత వహించాలి.
కులగణనను అంత తీవ్రంగా వ్యతిరేకించి, చివరకు బీజేపీ నాయకులూ ఊహించని, ఆశించని విధంగా ఎలాంటి ముందస్తు ప్రచారం లేకుండా హఠాత్తుగా మోదీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.దీనివల్ల తాత్కాలికంగా రాహుల్‌గాంధీకి క్రెడిట్ రావచ్చు. కానీ, కాంగ్రెస్ ముక్త్ భారత్ కోరుకునే మోదీ ఆ పార్టీకి ఉపయోగపడే నిర్ణయం తీసుకుంటారా? ఇక్కడే అసలు మతలబు ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ చేతిలో ఉన్న ఏకైక ఆయుధం కులగణన. మైనారిటీ మంత్రం కూడా కాంగ్రెస్‌ను గట్టెక్కించలేకపోతున్నది. కాంగ్రెస్ ప్రస్తుతం మూడు రాష్ర్టాల్లోనే అధికారంలో ఉంది. తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు రెండేండ్లలోపే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నాయి. తెలంగాణలో పాలన, హామీ ల అమలు చూసి తమను గెలిపించాలని మహారాష్ట్రలో కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేసింది. కానీ, బీజేపీకి ఊహించని మెజారిటీ వచ్చిం ది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు ప్రయోజనం కలిగించే నిర్ణయం మోదీ ఎందుకు తీసుకుంటారు? కాంగ్రెస్ చేతిలో ఉన్న చివరి ఆయుధాన్ని సైతం లాగేసుకోవడానికే మోదీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
సాధారణంగా 2025లో జనాభా లెక్కల సేకరణ ప్రారంభం కావాలి. లెక్కల సేకరణ పూర్తయిన తర్వాత అధికారికంగా ప్రకటించడానికి రెండేండ్ల సమయం తీసుకుంటారు. ఇప్పటికే ఈ ఏడాది ప్రథమార్ధం చివరికి వచ్చేశాం. ఇంకా జనాభా లెక్కల సేకరణ మొదలుకాలేదు. అంటే 2029లో జరిగే పార్లమెంట్ ఎన్నికల నాటికి జనాభా లెక్కల సేకరణ పూర్తి చేసి, అధికారికంగా ప్రకటించే అవకాశాలు తక్కువే. కులగణన చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నందున ఇకపై కులగణన కోసం కాంగ్రెస్ డిమాండ్ చేయలేదు. ముందుగానే రాహుల్‌ను మోదీ కట్టడి చేసేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు అంశానికి, కులగణన నిర్ణయానికి ఓ సారూప్యత ఉన్నది. 2004 ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇవ్వాలని డిమాండ్ చేయగా, ఉచిత విద్యుత్తు ఇస్తే కరెంట్ తీగలు బట్టలు ఆరేసుకోవడానికి పనికొస్తాయని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయాక టీడీపీ తొలి సమావేశంలోనే తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్తు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. సంస్కరణలవాది అని బాబును ఆకాశానికెత్తిన మీడియా సైతం ఏంటీ ఈ యూటర్న్ అని విమర్శించింది. ఈ హామీ అసలు ఉద్దేశం ఏమిటనేది పార్టీ నేతలకు చంద్రబాబు వివరించారు. ‘మనం ఉచిత విద్యుత్తు సాధ్యం కాదని వాదించినంతకాలం అది కాంగ్రెస్‌కు మైలేజీగా మారుతుంది. వచ్చే ఎన్నికల్లో సైతం ఇదే ప్రధాన అంశమైతే మనకు ఇబ్బంది. యూటర్న్ అని మీడియా చెప్పినా ఫర్వాలేదు. మేం కూడా ఉచిత విద్యుత్తు ఇస్తామని ప్రకటిస్తే ఆ అంశం ఎన్నికల్లో ప్రధానాంశం కాకుండాపోతుంది. మనకు కావలసింది అదే’ అని చంద్రబాబు పార్టీ నేతలతో చెప్పారు. ఇప్పుడు మోదీ సరిగ్గా అదే చేశారు.