ఎన్నికల తంతు పూర్తయి కొత్త పార్లమెంట్ కొలువుదీరింది. ముచ్చటగా మూడో విడత ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ బలాబలాల్లో ప్రస్ఫుటమైన తేడాలు రావడం మనం చూస్తున్నాం. పాలక కూటమి బలం, పలుకుబడి ఒకింత తగ్గడం, విపక్ష కూటమి కొంత ముందంజ సాధించడం అనేవి సభా నిర్వహణలో తప్పక ప్రతిఫలిస్తాయి. తొలిరోజు సంరంభంలో రాజ్యాంగం, ఎమర్జెన్సీ పదేపదే ప్రస్తావనకు రావడం ఆహ్వానించదగ్గ విషయమే. దీనిపై పాలక, విపక్షాల మధ్య కొంత రాద్ధాంతమూ చోటుచేసుకుంది. దేశం ప్రకటిత, అప్రకటిత ఎమర్జెన్సీలను ఎంతమాత్రం కోరుకోవడం లేదనేది విస్పష్టం. నాడు ఇందిర పాలనపై, నిన్నటి ఎన్నికల్లో మోదీ ప్రభుత్వంపై ప్రజలు ఇచ్చిన తీర్పులే అందుకు నిదర్శనాలు. పాలక, విపక్ష కూటములకు నాయకత్వం వహిస్తున్న రెండు జాతీయ పార్టీలూ ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మసలుకుంటే మంచిది.
అభివృద్ధి, సంక్షేమాల మధ్య సమతూకం సాధించి సమస్యల వలయం నుంచి ప్రజలను బయటపడేయటం తక్షణ కర్తవ్యం. ఆ దిశగా పార్లమెంటు చర్చలు సాగాల్సి ఉంది. ఎన్నికల ప్రచారార్భాటంలో పెద్దగా ప్రస్తావనకు రాని ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయన్న సంగతి ఈ సందర్భంగా మరచిపోరాదు. విపక్షం బలపడటం వల్ల ఈ సమస్యలపై సభలో అర్థవంతమైన చర్చలు జరిగి, తగిన కార్యప్రణాళిక రూపొందుతుందని దేశ ప్రజలు ఆశిస్తున్నారు. వ్యవసాయ రంగం కనీస మద్దతు ధర కోసం, పారిశ్రామిక రంగం ప్రోత్సాహకాల కోసం ఎదురుచూస్తున్నాయి. ఆదాయాల్లో పెరుగుతున్న వ్యత్యాసాల దృష్ట్యా పేదరిక నిర్మూలనకు వినూత్నమైన విధానాలను రూపొందించడం తప్పనిసరి. నిర్లక్ష్యానికి గురై నీరసించిన నిరుద్యోగులకు తక్షణం ఎంతో కొంత ఊరట కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రజలెన్నుకున్న ప్రతినిధులపై ఉన్నది.
మారిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఒంటెత్తు పోకడలకు పోకుండా నలుగురినీ కలుపుకొనిపోయే రీతిలో పనిచేయడం ఎంత ముఖ్యమో.. ఇండియా కూటమి నిర్మాణాత్మక ప్రతిపక్ష బాధ్యతను సమర్థంగా నిర్వహించడమూ అంతే ముఖ్యం. కానీ, ఈ సయోధ్య అంత సులభంగా సాధ్యం కాదని స్పీకర్ ఎన్నిక వివాదం తెలియజేస్తున్నది. సభాపతిని ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయానికి దశాబ్దాల తర్వాత గండి పడుతున్నది. బలం పెంచుకున్న విపక్షం డిప్యూటీ స్పీకర్ పదవి కోసం పట్టుబట్టడం, పాలక పక్షం ససేమిరా అనడంతో పోటీ అనివార్యమవుతున్నది. రాబోయే రోజుల్లో జరగబోయే సభావ్యవహారాల తీరుతెన్నులను ఇది సూచనప్రాయంగా వెల్లడిస్తున్నది. ఏదేమైనప్పటికీ పాలకపక్షం, విపక్షం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్లాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పక తప్పదు. అప్పుడే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం
సార్థకమవుతుంది.