కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందన్నట్టుగా.. నిన్నటిదాక కేసీఆర్ ప్రభుత్వాన్ని కుటుంబపాలన అని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు పూర్తిగా బరితెగించి రాష్ర్టాన్ని, రాష్ట్ర సంపదను కాంగ్రెస్ కుటుంబాలకు ధార పోస్తున్నది. కేసీఆర్ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ 14 ఏండ్లు రాష్ట్రసాధన పోరాటంలో పాల్గొన్నారు. నిర్బంధాలు, జైళ్లు లెక్క చేయకుండా ఉద్యమించారు. కేసీఆర్ వారికి టిక్కెట్లిస్తే ప్రజల ముందుకు వెళ్లి ఒకటికి నాలుగు సార్లు వారి ఆశీర్వాదంతో చట్టసభల్లోకి వచ్చారు తప్ప బలవంతపు రుద్దుళ్లు కాదు. అయినా సరే.. కాంగ్రెస్ కుటుంబ పాలన అంటూ కోడై కూస్తే దానికి పచ్చ మీడియా, పచ్చళ్ల మీడియా వంత పాడింది. బురద చల్లింది. మరి ఇవాళ జరుగుతున్నదేమిటి? సీఎం తమ్ముడు అనధికారిక ఎమ్మెల్యేగా కొనసాగుతాడు. ప్రభుత్వ కార్యక్రమాల్లో వేదికపై తిష్ట వేస్తాడు. మరో సోదరుడు తన వ్యాపారం కోసం క్విడ్ ప్రో కో అనదగిన రీతిలో ఎంవోయూలు చేసుకుంటాడు. ఇంకో సోదరుడు ప్రభుత్వ వ్యవహారాల్లో షాడో సీఎంగా చెలామణి అవుతాడు. మరి గల్లీ కాంగ్రెస్ నాయకుడి నుంచి మహారాజశ్రీ రాహుల్‌గారి వరకు అంతా కుటుంబ పాలన అంటూ చేసిన విమర్శలు ఏమైనట్టు? ఇవాళ రాష్ట్రంలో సగం జిల్లాల్లో కుటుంబాల పాలన కొనసాగుతున్నది. జిల్లాకు ఒకటి రెండు కుటుంబాలు అధికారాన్ని పంచుకుతింటున్నారు. కుటుంబపాలన విశ్వరూపం కళ్లముందు కనిపిస్తున్నది. ఎన్ని కుటుంబాలు? ఎంత అరాచకం? పైగా తప్పేమిటని ఆ పార్టీవారే దబాయిస్తున్నారు. ఎన్నికల సమయంలో కుటుంబ పాలన అంటూ రాష్ట్రమంతా ఊదరగొట్టిన రాహుల్ ఈ కుటుంబాల పాలన చూసి ఏం చేస్తున్నట్టు? పార్లమెంటులో నిద్రపోతే ఓకే. కానీ తమ పార్టీ ప్రభుత్వం ఎలాగుందో దాని పనితీరు ఏమిటో కూడా చూడాలిగదా? ఎదుటి వారికి చెప్పిన నీతి సూత్రాలు తాము పాటించాలి గదా!
ఏ పార్టీ అయితే కేసీఆర్‌ది కుటుంబ పాలన అని ఆరోపించిందో, అదే కాంగ్రెస్ సర్కారులో కొందరు సీనియర్ నేతల కుటుంబాలే పెత్తనం చెలాయిస్తున్నాయి. అసలు ఆ మాటకొస్తే వారసత్వ రాజకీయాలపై పేటెంట్ హకు ఏ పార్టీకైనా ఉందంటే అది కాంగ్రెస్‌కే అన్నది చారిత్రక సత్యం. నెహ్రూ నుంచి రాహుల్‌గాంధీ వరకు కాంగ్రెస్‌లో రాజకీయ వారసత్వం కొనసాగుతూనే వస్తున్నది. రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కుటుంబ వారసత్వ రాజకీయాలకు, స్వీయ సామాజిక వర్గాన్ని జోడించి కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. ఆయన తన సామాజికవర్గానికి చెందిన నాయకులు, అధికారులకే ప్రభుత్వంలో పెద్దపీట వేశారని సొంత పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ ఈ పరిస్థితి లేదని చెప్పక తప్పదు. ప్రభుత్వంలో కీలక శాఖలు, బాధ్యతలు ఒకే సామాజికవర్గానికి చెందిన నాయకులు, అధికారులకు అప్పగించిన దాఖలాలు మునుపెన్నడూ లేవని పలువురు గుర్తుచేస్తున్నారు. బడుగు, బలహీనవర్గాలకు చెందిన పార్టీగా చెప్పుకొనే కాంగ్రెస్.. ప్రస్తుతం అగ్రకుల నేతల ఆధిపత్యంలోకి వెళ్లటం, ఉదయపూర్‌లో కాంగ్రెస్ ప్లీనరీ-2022లో చేసిన తీర్మానానికి తూట్లు పొడిచేలా ఉన్నదని ఆ పార్టీ అధిష్ఠానం కూడా కలవరపడుతున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలో కనీసం పీసీసీ అధ్యక్ష పదవి అయినా బీసీ సామాజికవర్గానికి కట్టబెట్టకపోతే పార్టీకి ఓటు బ్యాంకుగా ఉంటున్న బడుగు, బలహీనవర్గాలు దూరం అవుతారేమోనని ఆందోళన చెందుతున్నట్టు చెప్పుకొంటున్నారు.
ఉమ్మడి పది జిల్లాల్లో సగం జిల్లాల్లో కొన్ని కుటుంబాలే పదవులు, అధికారాన్ని అనుభవిస్తున్నాయి. ఖమ్మం, నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ప్రభుత్వాన్ని కొన్ని కుటుంబాలే శాసిస్తున్నాయని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా కొనసాగుతూ పార్టీని, ప్రభుత్వాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొన్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. నామినేటెడ్ పోస్టులూ ఇతరులకు ఇవ్వకుండా మోకాలడ్డుతున్నారని సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మల్లు భట్టి విక్రమార డిప్యూటీ సీఎంగా, తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంత్రివర్గంలో కొనసాగుతుండగా, ఖమ్మం ఎంపీగా రామసహాయం రఘురామిరెడ్డి ఉన్నారు. ఈయన పొంగులేటికి స్వయానా వియ్యంకుడు. రఘురామిరెడ్డిది కూడా కాంగ్రెస్ కుటుంబమే. ఈయన తండ్రి రామసహాయం సురేందర్‌రెడ్డి వరంగల్ మాజీ ఎంపీ. భట్టి విక్రమార తన భార్య నందినికి ఖమ్మం ఎంపీ టికెట్ ఇప్పించేందుకు చివరిదాకా తీవ్రంగా ప్రయత్నించారు. భట్టి సోదరుడు మల్లు రవికి నాగర్‌కర్నూల్ నుంచి ఎంపీ టికెట్ ఇవ్వడంతో నందినికి ఖమ్మం టికెట్ దకలేదు. పొంగులేటి తన సోదరుడు ప్రసాద్‌రెడ్డి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు యుగంధర్ కోసం చివరి దాకా ప్రయత్నించినా ఆఖరికి పొంగులేటి తన వియ్యంకుడు రఘురామిరెడ్డికి టికెట్ ఇప్పించుకోవటంలో సఫలమయ్యారు.
కాంగ్రెస్‌లో కుటుంబ పాలన గురించి చెప్పుకోవాల్సి వస్తే మొదటగా వినిపించే పేరు ఉమ్మడి నల్లగొండ జిల్లానే. ఇకడి నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రులుగా కొనసాగుతుండగా.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతి కోదాడ ఎమ్మెల్యేగా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరుడు రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఇదే జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత కుందూరు జానారెడ్డి కుమారులలో జైవీర్‌రెడ్డి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే, మరో కుమారుడు రఘువీర్‌రెడ్డి నల్లగొండ ఎంపీ. ఇప్పటికే నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఉండగా, మూడో మంత్రి పదవి కూడా సోదరుడు రాజగోపాల్‌రెడ్డికి ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చేటట్టయితే తన భార్య పద్మావతికి కూడా మంత్రి పదవి ఇవ్వాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పట్టుబడుతున్నారు. నల్లగొండ జిల్లాలో పదవులు, అధికారం ఈ మూడు కుటుంబాలకే పరిమితం కాగా, తాజాగా భువనగిరి ఎంపీగా గెలిచిన చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అరంగ్రేటం చేశారు. తన భార్య లక్ష్మికి భువనగిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చివరిదాకా ప్రయత్నించారు. సీఎం రేవంత్‌రెడ్డికి చామల సన్నిహితుడు కావటంతో ఆయనకు టికెట్ దక్కింది. మున్ముందు ఈ జిల్లాలో చామల కుటుంబం కూడా పదవులు దకించుకుంటుందేమో చూడాలి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ కాంగ్రెస్‌లో పెత్తనం రెండు కుటుంబాలదే. కడియం శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా, ఆయన కూతురు కావ్య వరంగల్ ఎంపీగా ఉన్నారు. మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. సురేఖ తన కూతురు సుస్మిత పటేల్‌కు పరకాల ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించిన విషయం తెలిసిందే.
ఉమ్మడి ఏపీలో ప్రారంభమైన కుటుంబ వారసత్వ రాజకీయాలు, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఏపీలో కొనసాగుతున్నాయి. మొన్నటివరకు ఏపీ సీఎంగా ఉన్న జగన్మోహన్రెడ్డి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారసుడే. తెలంగాణలో కేసీఆర్‌ది కుటుంబ పాలన అని విమర్శించిన కాంగ్రెస్ పార్టీయే ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ఆర్ కూతురు షర్మిలను నియమించింది. ప్రస్తుతం ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూడా ఎన్టీఆర్ రాజకీయ వారసత్వ పార్టీయే. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందే చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినా, ఆయనకు సీఎం పదవి దకింది మాత్రం ఎన్టీఆర్ రాజకీయ వారసత్వం పుణ్యానే. ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు సీఎం, చంద్రబాబు కుమారుడు లోకేశ్ మంత్రి, చంద్రబాబు బావమరిది బాలకృష్ణ ఎమ్మెల్యే, బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ విశాఖపట్నం ఎంపీ, చంద్రబాబు వదిన పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ కూడా. గంటా శ్రీనివాస్‌రావు ఎమ్మెల్యేగా ఉండగా, ఆయన వియ్యంకుడు నారాయణ ఏపీ మంత్రిగా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూపోతే అంతా కుటుంబ రాజకీయమే.
ఉమ్మడి మెదక్ జిల్లాలో మంత్రి దామోదర రాజనరసింహ, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి కుటుంబాలవీ రాజకీయ వారసత్వమే. మంత్రి దామోదర రాజనరసింహ తండ్రి రాజనరసింహ కూడా కాంగ్రెస్ నాయకుడే.
ఆయన 3 పర్యాయాలు అందోల్ ఎమ్మెల్యేగా పనిచేయగా, ఆయన మరణానంతరం వారసుడిగా దామోదర రాజనరసింహ రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ఆర్ హయాంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక జగ్గారెడ్డి భార్య నిర్మలా జగ్గారెడ్డి గతంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటిచేసి ఓడిపోయారు. గతంలో ఆమె జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేశారు. తాజాగా రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతులు, అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. జగ్గారెడ్డి వారసురాలిగా కూతురు జయారెడ్డి ఇప్పటికే రాజకీయ ప్రవేశం చేశారు. ప్రస్తుతం యువజన కాంగ్రెస్‌లో ఆమె పని చేస్తున్నారు. ఇదే జిల్లాకు చెందిన గీతారెడ్డి ఉమ్మడి ఏపీలో మంత్రిగా పని చేశారు. ఈశ్వరీబాయి రాజకీయ వారసురాలిగా గీతారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దివంగత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి వెంకటస్వామి కుటుంబ వారసత్వం దశాబ్దాలుగా కొనసాగుతున్నది. వెంకటస్వామి పెద్ద కుమారుడు వినోద్ గతంలో మంత్రిగా, చిన్న కుమారుడు వివేక్ ఎంపీగా పనిచేశారు.
ప్రస్తుతం చెన్నూరు నుంచి వివేక్, బెల్లంపల్లి నుంచి వినోద్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. వెంకటస్వామి కుటుంబం నుంచి మూడవ తరం కూడా రాజకీయాల్లోకి వచ్చారు. వివేక్ కుమారుడు గడ్డం వంశీకృష్ణ ఇటీవల పెద్దపల్లి ఎంపీగా గెలుపొందారు. ఇదే జిల్లాకు చెందిన కొకిరాల ప్రేమ్సాగర్రావుది రాజకీయ వారసత్వమే. ఆయన ప్రస్తుతం మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రేమ్‌సాగర్‌రావు భార్య సురేఖ కూడా కాంగ్రెస్‌లో చురుకైన రాజకీయ నాయకురాలే. ప్రస్తుతం ఆమె మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. గతంలో సురేఖ సిర్పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మంత్రివర్గ విస్తరణలో ప్రేమ్‌సాగర్‌రావుకు స్థానం లభిస్తుందని అంచనా వేస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ వారసులకు పుట్టినిల్లు. ప్రస్తుత ప్రజాప్రతినిధులు రాజకీయ వారసులుగానే రాజకీయాల్లోకి వచ్చారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేశ్‌రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఇరువురు వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చినవారే. సీఎం రేవంత్‌రెడ్డికి రాజకీయ వారసత్వం లేకపోయినప్పటికీ బంధుత్వాలు ఉన్నాయి. దివంగత కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి సోదరుడు పద్మారెడ్డి కూతురు గీతారెడ్డిని రేవంత్‌రెడ్డి వివాహం చేసుకున్నారు.
రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా కొడంగల్ నియోజకవర్గానికి అనధికార ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. మరో సోదరుడు కొండల్‌రెడ్డి తెరవెనుక రాజకీయాలలో చురుకుగా ఉన్నారు. కామారెడ్డి నుంచి రేవంత్‌రెడ్డి అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు అకడ కొండల్‌రెడ్డి ఇన్చార్జిగా పనిచేశారు. ఇక నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి దివంగత పీసీసీ అధ్యక్షుడు మల్లు అనంతరాములుకు స్వయానా సోదరుడు. మల్లు అనంతరాములు గతంలో నాగర్‌కర్నూల్ ఎంపీగా ఉండగా ఆయన మరణానంతరం ఆయన వారసుడిగా మల్లు రవి రాజకీయాల్లోకి వచ్చారు. మల్లు రవి మరో సోదరుడు భట్టి విక్రమార ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేసిన కోనేరు రంగారావుకు మల్లు రవి స్వయానా అల్లుడు.