గ్యారెంటీల మాయాజాలంతో వరుసగా హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాల్లో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రకటించిన గ్యారెంటీలు వికటించి హర్యానా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. కొందరిని ఎల్లకాలం మోసం చేయవచ్చు. అందరిని కొంతకాలం మోసం చేయవచ్చు. కానీ అందరినీ అన్ని కాలాలు మోసం చేయలేరని మరోసారి రుజువైంది. హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వ గ్యారెంటీల వైఫల్యం సరిహద్దు రాష్ట్రమైన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి దారితీయగా తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల్లో గ్యారెంటీల వైఫల్యం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపింది. దేశ రాజకీయ, ఆర్థిక రంగాల్లో ప్రధాన భూమిక పోషించే రాష్ట్రం దక్కినట్టే దక్కి ‘చేయి’జారిపోయింది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ ఆఘాడి ఘోర పరాజయానికి, బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ఘన విజయానికి కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల వాగ్దాన వైఫల్యాలు ప్రధాన కారణమయ్యాయి.
2022, డిసెంబర్లో జరిగిన హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పది గ్యారెంటీలు ప్రకటించి అధికారంలోకి వచ్చింది. అదే క్రమంలో 2023 మే నెలలో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు గ్యారెంటీలు ఇచ్చి, అదే ఏడాది నవంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారెంటీలు ప్రకటించి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకున్నది. ఏడాది తిరగక ముందే ఈ మూడు రాష్ర్టాల ప్రజలు దారుణంగా మోసపోయామనే అభిప్రాయానికి వచ్చారు. గ్యారెంటీల వైఫల్యం సరిహద్దు రాష్ర్టాలకు పాకింది. ఫలితంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌కు చేదనుభవం ఎదురైంది. ప్రత్యేకించి మహారాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరుగని పరాజయాన్ని మూటగట్టుకున్నది. మహారాష్ట్రలో మహా వికాస్ ఆఘాడి ప్రకటించిన ఐదు గ్యారెంటీలను ప్రజలు నమ్మలేదు. పొరుగున ఉన్న కాంగ్రెస్ పాలిత తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల గ్యారెంటీల వైఫల్యాల నేపథ్యంలో మహారాష్ట్ర ఓటర్లు మహా వికాస్ ఆఘాడిని తిరస్కరించారు. కాంగ్రెస్‌తో కలిసి నడిచిన పాపానికి అఘాడి భాగస్వామ్య పక్షాలు శివసేన (ఉద్ధవ్‌థాక్రే) ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలకూ భంగపాటు తప్పలేదు.
గత లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 స్థానాల్లో 30 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ నాయకత్వంలోని మహా వికాస్ ఆఘాడి 4 నెలలకే చతికిల పడిపోయింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు పునరావృతమై అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధిస్తామనుకున్న అఘాడి కూటమి అగాథంలోకి జారిపోయింది. మహిళలకు నెలకు రూ.3 వేలు, ఉచిత బస్సు, నిరుద్యోగులకు నెలకు వేలు, 50 శాతం రిజర్వేషన్ల పరిమితి తొలగింపు, రూ.25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా వంటి ప్రజాకర్షక గ్యారెంటీలు ప్రకటించినా తెలంగాణ, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం వల్ల మహారాష్ట్ర ప్రజలు వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. ప్రత్యేకించి తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల సరిహద్దులలో నివసించే మహారాష్ట్ర ప్రజలు మహా వికాస్ ఆఘాడిని ఊడ్చిపారేశారు. లోక్‌సభ ఎన్నికల్లో నెత్తిన పెట్టుకున్నవాళ్లే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి నెలకేసి కొట్టారు. కాంగ్రెస్ గ్యారెంటీల గప్పాలకు వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పు అది.
కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాలలో గ్యారెంటీల పేరుతో ప్రజలను దారుణంగా వంచించిన కాంగ్రెస్ పక్కనే ఉన్న మహారాష్ట్రలో అవే గ్యారెంటీల మాయోపాయాలతో అధికారంలోకి రావాలని నేలవిడిచి సాముచేసింది. ఎందుకంటే ఈ మూడు రాష్ర్టాల మధ్య వేయి కిలోమీటర్ల పైగా సరిహద్దులున్నాయి. కళ్యాణ కర్ణాటక, మరాఠ్వాడ, తెలంగాణ ప్రాంతాలు భాషా ప్రయుక్త రాష్ర్టాలు ఏర్పడేంతవరకు ఒక రాష్ట్రంగా ఉన్నవే. ఈ ప్రాంతాల మధ్య బంధుత్వాలు వ్యాపార లావాదేవీలు నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి. సాంస్కృతిక ఆచార వ్యవహారాల ఆదాన ప్రదానాలున్నాయి. పైగా, తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల ప్రజలకు మరాఠీ తెలిసినట్టే అవతలి గట్టున ఉన్న మహారాష్ట్ర ప్రజలకు తెలుగు, కన్నడ భాషలు తెలుసు. ఈ నేపథ్యంలో తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల గ్యారెంటీ గ్యాంబ్లింగ్‌ను సరిహద్దు మహారాష్ట్ర ప్రజలు గ్రహించడానికి ఎక్కువ సమయం పట్ట లేదు. అందుకే కీలెరిగి వాత పెట్టారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రపూర్, యావత్మాల్, నాందేడ్ జిల్లాలు తెలంగాణ సరిహద్దుల్లో, సాంగ్లీ, సోలాపూర్, కొల్హాపూర్, జిల్లాలు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నాయి. గడ్చిరోలి, చంద్రపూర్, హింగోలి, నాందేడ్, ఉస్మానాబాద్, లాతూర్, సోలాపూర్, సాంగ్లీ, హట్కానంగి, కొల్హాపూర్, రత్నగిరి లోక్‌సభ నియోజకవర్గాలు అదే పరిధిలో ఉన్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో ఉస్మానాబాద్ రత్నగిరి మహాయుతి గెలుచుకోగా ఎనిమిది లోక్‌సభ స్థానాల్లో మహా వికాస్ ఆఘాడి విజయం సాధించింది. హట్కానంగే లోక్‌సభ స్థానంలో విజయం సాధించిన ఇండిపెండెంట్ అభ్యర్థి ఆఘాడి సరసన చేరడంతో మొత్తంగా 11 స్థానాల్లో 9 ఆ కూటమి ఖాతాలో చేరాయి. కానీ, 4 నెలలకే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి తారుమారైంది. తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాలకు ఆనుకొని ఉన్న 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ ఆఘాడి గెల్చుకున్న నియోజకవర్గాలు మూడు మాత్రమే. తెలంగాణ పొరుగున ఉన్న గడ్చిరోలి, అహెరి, రాజూరా, ఆర్నీ, కిన్వట్, హడ్గావ్, బోకర్, నాయీ గావ్, దేగ్లూర్ మహాయుతి గెలుచుకోగా మహా వికాస్ అఘాడి కేవలం ఒక్క ‘వానీ’ నియోజకవర్గానికి పరిమితమైంది. కర్ణాటక సరిహద్దుల్లోని ముద్ఖేడ్ ఉద్గిర్, నీలంగా, అవుసా, అక్కల్కోట్, సోలాపూర్, పండర్పూర్, జాట్మిరాజ్, కొల్హాపూర్, కాగల్, చంద్గడ్, సావంత్వాడి, అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహాయుతి విజయం సాధించగా ఉమర్గా, తస్గావ్ నియోజకవర్గాల్లో మాత్రమే మహా వికాస్ ఆఘాడి విజయం సాధించింది. మొత్తంగా తెలంగాణ సరిహద్దుల్లోని నాలుగు జిల్లాలు, కర్ణాటక సరిహద్దుల్లోని మూడు జిల్లాల్లో కలిపి 54 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ ఆఘాడి గెలిచింది 15 మాత్రమే. ఈ లెక్కన కాంగ్రెస్ గ్యారెంటీ మోసాలు మహారాష్ట్ర ఫలితాలను తారుమారు చేశాయన్నది తేటతెల్లమైంది. కాంగ్రెస్‌ను నమ్మి దరిచేరిన దిగ్గజ నేతలు శరద్‌పవార్, ఉద్ధవ్ థాక్రేలకు సహవాస దోషం ఫలితంగా పరాభవం ఎదురైంది. ఎవరికీ కనీసం ప్రతిపక్ష హోదా దక్కని దుస్థితి ఏర్పడింది.
‘బేగాని షాదీ మే అబ్దుల్లా దీవానా’ అన్నట్టు సొంత రాష్ర్టాలలో గ్యారెంటీలను గంగలో కలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, వారి మంత్రి బృందాలు, నాయకశ్రేణులు మహారాష్ట్రలో ప్రచారం చేయడం, తమ రాష్ర్టాల్లో గ్యారెంటీలను పూర్తిగా అమలుపరచామని పచ్చి అబద్ధాలాడటం సరిహద్దు నియోజకవర్గాల్లో మహా వికాస్ ఆఘాడి విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీశాయి. అవి మోసపూరిత ప్రసంగాలని అక్కడి ప్రజలు గ్రహించారు. తెలంగాణ మూలాలున్న ప్రజలు నిర్ణాయక శక్తులుగా ఉన్న 8 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రచారం చేసినా తుదకు దక్కినవి రెండే రెండు. సిద్ధరామయ్య పరిస్థితి అంతే. ఏదేమైనా మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పరివారం గెలుపు తలుపు ముందు బొక్క బోర్లా పడటానికి గల కారణాల్లో అంతకుముందు కొలువుదీరిన మూడు కాంగ్రెస్ ప్రభుత్వాల గ్యారెంటీల వైఫల్యాలు ముందు నిలిచాయి.