ఎవరు ఔనన్నా, కాదన్నా కాళేశ్వరం తెలంగాణ వరప్రదాయిని. ఇది తిరుగులేని సత్యం. కేసీఆర్ మీది కోపం కాళేశ్వరం మీద చూపుతానంటే బొక్కబోర్లా పడక తప్పదు. ఆ సంగతి సీఎం రేవంత్‌కు అనుభవపూర్వకంగా తెలిసివచ్చింది. కాళేశ్వరం కూలేశ్వరమని అవాకులు, చెవాకులు పేలిన సీఎం తన మాటలు మడిచి జేబులో పెట్టుకుని మడమ తిప్పుతుండటమే ఇందుకు నిదర్శనం. కేసీఆర్ మీది అక్కసుతో ఆడిన తిక్క రాజకీయం బూమరాంగ్ కావడమే అందుకు కార ణం. కంటిలో నలుసు పడితే కనుగుడ్డు పెరికేసుకుంటామా? ప్రాజెక్టులు కట్టిన తర్వాత చిన్నచిన్న సమస్యలు రావడం, మరమ్మతులు చేయడం ఎప్పటినుంచో జరుగుతున్నదే. నాగార్జునసాగర్ అయినా, శ్రీశైలం ప్రాజెక్టు అయినా బాలారిష్టాలు తప్పలేదు.
నిర్వహణలో భాగంగా నిత్యం ఏదో ఒకచోట మరమ్మతులు జరుగుతూనే ఉంటాయి. అందుకు కాళేశ్వరం మినహాయింపు అని ఎవరూ అనరు. అయితే ఆ మహా ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని, లోపాలున్నాయని ఇల్లెక్కి కూసి రాజకీయ లబ్ధి పొందాలని వెంపర్లాడారు. చిన్న పగులును భూతద్దంలో చూపి రెండేండ్లు కాలయాపన చేశారు. జన హృదయంలో జల కాళేశ్వరానికి ఉన్న స్థానం చెదిరిపోనిది. ఇంకా పడావు పెట్టాలని చూస్తే ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటుందనే భయంతోనే సర్కారు ఇప్పుడు యూటర్న్ తీసుకుని మరమ్మతులకు పోతున్నది. అందుకు గుట్టు చప్పుడు కాకుండా టెండర్లు పిలుస్తున్నది.
తుమ్మిడిహట్టి వద్ద మరో బరాజ్ కడతామని ఎగిరిపడ్డవారు నోరుమూసుకొని మరమ్మతులకు పోవడం రెండు నాల్కల ధోరణి కాక మరేమిటి? విచారణ కమిషన్ల పేరుతో రాజకీయ వేధింపులకు పాల్పడ్డవారు స్థానిక ఎన్నికల్లో ఓటుపోటుకు జడిసి పీఛేముడ్ అంటున్నారు. దర్యాప్తుల పేరిట నానాయాగీ చేసి రెండేండ్ల కాలాన్ని నీటిపాలు చేసి ఇప్పుడు తీరికగా కాళేశ్వరుడి కాళ్లు పట్టుకుంటున్నారు. వీలైతే మేడిగడ్డను పడావుపెట్టి, తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ కట్టి కమీషన్లు దండుకుందామనేదే కాంగ్రెస్ ఆలోచన. కానీ, అక్కడ ప్రాజెక్టు కట్టడం వల్ల తగిన నీరు రాదు, పైగా చిక్కులు ఎక్కువని నీటిపారుదల నిపుణులు తెగేసి చెప్తున్నారు. మరోవైపు రెండు యాసంగి సీజన్లలో నీరివ్వకుండా పంటలను ఆగం చేసినందుకు అన్నదాతలు ఆగ్రహంతో ఉన్నారు.
నగరానికి రెండో విడత గోదావరి జలాలను తరలించాలంటే కాళేశ్వరమే దిక్కు. కాకపోతే ఇదివరకటి బీఆర్ఎస్ సర్కారు కొండపోచమ్మ సాగర్ నుంచి తేవాలని చూస్తే, కాంగ్రెస్ సర్కారు కమీషన్ల కక్కుర్తితో మల్లన్నసాగర్ అంటున్నది అంతే తేడా. తెచ్చేవి అచ్చంగా కాళేశ్వర జలాలే అన్నది ముమ్మాటికీ సత్యం. అది కూడా కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన అనేక జలాశయాలు, పంపులు వినియోగించడం ద్వారానే అన్నది గుర్తుంచుకోవాలి. ఆ సంగతి నేరుగా ఒప్పుకోకుండా ఎల్లంపల్లి నీళ్లు అని బుకాయించడం రేవంత్ మార్కు ఎగవేత తప్ప మరోటి కాదు. కాళేశ్వరంపై సర్కారు దుర్నీతి బూటకాలతో ప్రజలను ఎల్లకాలం బురిడీ కొట్టించడం సాధ్యం కాదని తేటతెల్లం చేసింది. ప్రజలు తమ కుప్పిగంతులను గమనించడం లేదని పాలకులు అనుకుంటే పొరపాటే. సకాలంలో, సరైన సమయంలో, సరైన రీతిలో గుణపాఠం చెప్పేందుకు వారు ఎదురుచూస్తున్నారు.