రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ 11 నెలల పాలనను చూసిన వారెవరికైనా రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత అత్యంత కీలకమైన హోంశాఖ మంత్రిని ఇప్పటికీ నియమించకపోవడం ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. 18 మందితో ఉండవలసిన మంత్రివర్గం 12 మందికే పరిమితమైంది. కీలకమైన హోం, విద్య, మైనారిటీ సంక్షేమం తదితర శాఖలు ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్దనే అంటిపెట్టుకోవడంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. ఏకంగా పోలీసులే నిరసనలు తెలిపే దుస్థితి రాష్ట్రంలో ఏర్పడటం విచారకరం. కాంగ్రెస్ తరఫున గెలిచిన 65 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరూ హోంశాఖను నిర్వహించగల సమర్థుడు లేకపోవడం విడ్డూరం.
Congress Govt | పదేండ్ల బీఆర్ఎస్ సర్కార్ శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసింది. ప్రతి పోలీస్ శాఖకు అత్యాధునిక వాహనాలను సమకూర్చింది. అంతేకాదు, స్టేషన్ల నిర్వహణకు గాను నెలవారీగా రూ.50 వేలు మంజూరు చేసింది. ఏండ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న పోలీస్ అధికారుల ప్రమోషన్ల సమస్యను పరిష్కరించింది. తద్వారా కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు మనస్ఫూర్తిగా ప్రజలకు సేవ చేశారు.
నాటి బీఆర్ఎస్ సర్కార్ నేరాలను అదుపులో పెట్టేందుకు దేశంలో ఎక్కడాలేని విధంగా లక్షల సం ఖ్యలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. మహిళల రక్షణ కోసం ‘షీ’ టీమ్‌లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
కానీ, 11 నెలల్లోనే తెలంగాణలో పరిస్థితులు తలకిందులయ్యాయి. మూడు లైంగికదాడులు, ఆరు హత్యలతో రాష్ట్రం చిన్నాభిన్నామవుతున్నది. అంతేకాదు, కలిసి మెలిసి జీవిస్తున్న హిందూ-ముస్లిం సోదరుల మధ్య వైరం సృష్టించే ప్రయత్నాలు జరుగుతుండటం హేయనీయం. బక్రీద్ సందర్భంగా మెదక్ పట్టణంలో చెలరేగిన అల్లర్లు అలాంటివే. ఇటీవల సికింద్రాబాద్‌లోని ముత్యాల మ్మ గుడిలో జరిగిన అత్యంత హేయమైన ఘటనను ఖండించాల్సిందే. ఇలా వరుస ఘటనలు పోలీస్ శాఖ వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయి.
జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు గంగారెడ్డిని పట్టపగలే హత్య చేయడం అమానుషం. ‘ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలున్నాయా?’ అని అధికార పార్టీ ఎమ్మెల్సీ రోడ్డుపై ధర్నాకు దిగడం పోలీసు శాఖలోని లోపాలను తెలియపరుస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు రాష్ట్రంలో ఒకే తరహా పోలీస్ విధానాన్ని తీసుకువస్తామని రేవంత్ రెడ్డి మాటిచ్చారు. ఆయన మాట తప్పడంతో పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులు రోడ్లపైకి వచ్చి ధర్నా లు చేశారు. బెటాలియన్ కానిస్టేబుళ్లు ఏకంగా యూనిఫాంతో నిరసనలు తెలపడం ఆందోళనకరం.
అన్ని వసతులున్న ప్రగతిభవన్‌లో తాను ఉండనని భేషజాలకు పోయిన రేవంత్‌రెడ్డి… శాంతిభద్రతల పరిరక్షణకు వాడవలసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను తన మీటింగ్ హాల్‌గా ఉపయోగించుకోవ డం అత్యంత దారుణం. ఆయన చర్యల వల్ల పోలీస్ శాఖ విధులకు ఆటంకం కలుగుతున్నది. నేరాల అదుపునకు వినియోగించాల్సిన పోలీస్ శాఖను ప్రతిపక్ష నాయకులు, పౌరహక్కుల నేతలపై కక్ష సాధింపునకు వాడుతుండటంతో రాష్ట్రంలో ఖర్ఫ్యూ వాతా వరణం నెలకొన్నది. పోలీస్ స్టేషన్లలో అధికార పార్టీ నేతల పుట్టినరోజు వేడుకలు జరపడం, మంత్రుల బర్త్ డేలకు ఏసీపీ స్థాయి అధికారులు రోడ్లపై కేకులు కోయడం లాంటి కుత్సిత పనుల కారణంగా పోలీస్ శాఖ పలుచనవుతున్నది.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిన నేపథ్యంలో ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ తన తీరును మార్చుకోవాలి. వెంటనే హోంశాఖా మంత్రిని నియమించాలి. ప్రతిపక్షాలను, ప్రశ్నించే గొంతు కలను వేధించడానికి కాకుండా నేరాల అదుపునకు మాత్రమే పోలీసు శాఖను వాడుకోవాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపులో పెట్టకపోతే రేవంత్‌రెడ్డి ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.
– యం.డి.జమీలొద్దీన్ 86862 11556