ఎన్నడూ పారని కాల్వలు నిండుగా పారుతున్నాయి. బీడువారిన పొలాలన్నీ పచ్చగా కళకళలాడుతున్నాయి. తద్వారా పంటలు విరివిగా పండుతున్నాయి. రైతుల ముఖాల్లో చిరునవ్వులు విరబూస్తున్నాయి. రైతుల ఆదాయం ఇప్పుడు రెండింతలైంది. దీనికి కారణం ఎవరో వారికీ తెలుసు. కానీ, ఆ వాస్తవాన్ని కప్పిపుచ్చడానికి ప్రభుత్వంతో పాటు కొన్ని పత్రికలూ ప్రయత్నిస్తున్నాయి. బృహత్తర పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆదినుంచీ ఇదే రాద్ధాంతం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాలికి బలపం కట్టుకుని మరీ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే, ఆయనంటే గిట్టనివారు పనిగట్టుకొని మరీ విషప్రచారం చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ర్టాన్ని దశాబ్దాల పాటు పాలించింది కాంగ్రెస్, టీడీపీలే. ఆ పార్టీలు పేరుకే ప్రాజెక్టులు కట్టాయి. కానీ, నీళ్లు మాత్రం ఇయ్యలేదు. నీళ్లు లేనిచోట ప్రాజెక్టులు కట్టి తెలంగాణను మాయజేశారు. మా పాలమూరును దత్తత తీసుకున్నా కష్కెడు నీళ్లు ఇయ్యలే. గోదావరి, కృష్ణమ్మల ఒడ్డునే ఉన్న బిడ్డల గొంతు తడపలేకపోయారు ఆ మహా నేతలు. ఇదీ నాటి తెలంగాణ దీనస్థితి. ‘మా నీళ్లు మాగ్గావాలె’ అనే నినాదం ఎత్తిపట్టి, ఎలుగెత్తి చాటింది కేసీఆరే. మహోత్తర ఉద్యమంతో తెలంగాణను సాధించారు. ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ర్టాన్ని నడిపించారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు.. ఆ తర్వాత పరిస్థితులను పరికించి చూస్తే తెలిసిపోతుంది కేసీఆర్ ఏం సాధించారనేది.
ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సారెస్పీ అరువై ఏండ్ల చరిత్రను చూడండి. ఒక్క పంటకూ నీరందించని దుస్థితి. అదే ఎస్సారెస్పీ ఇప్పుడు రెండు తరి పంటలకూ నీరందిస్తున్నది. ఇదెలా సాధ్యమైంది? తెలంగాణలో పంట ఉత్పత్తి ఎలా పెరిగింది? అప్పుడు లేనిది, ఇప్పుడెలా సాధ్యమవుతున్నది. వీటన్నింటికీ సమాధానం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కటే. దాని ఫలితంగానే నాడు పల్లేర్లు మొలిచిన రేగళ్లలో నేడు గోదారి పరవళ్లు తొక్కుతున్నది. తెలంగాణ వరదాయిని అనే పేరును గోదావరి సార్థకం చేసుకుంటున్నది. అయినప్పటికీ ఈ ఫలితాలన్నింటినీ విస్మరిస్తూ రాజకీయ బేహారులు, కుహనా మేధావులు కాళేశ్వరంపై కక్షగడుతున్నారు, విష ప్రచారాలకు దిగుతున్నారు.
తిప్పిపోతలని, కరెంటు చార్జీల భారమని, నిర్వహణ అసాధ్యమని అవాకులు, చెవాకులు పేలుతున్నారు. దీనికి కార ణం లేకపోలేదు. దశాబ్దాలుగా తాము సాధించలేని ప్రగతిని కేసీఆర్ పదేండ్లలో సాధించారని, మండుటెండల్లో మత్తళ్లు దుంకించారని, జలఫలాలను తెలంగాణ రైతాంగానికి అందించారనీ…
ఉమ్మడి ఏపీలో ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేసేనాటికి ప్రధాన జలాశయం 12 టీఎంసీల సామర్థ్యం తగ్గిపోయింది. కాల్వలన్నీ పూర్తయ్యేసరికి మరో 10 టీఎంసీల సామర్థ్యం తగ్గింది. ఇక ఎస్సారెస్పీ స్టేజ్-1లో అంటే ఎల్ఎండీకి ఎగువన ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాల్వ 0-146 కిలోమీటర్ల వరకు 4,62,920 ఎకరాలు, దిగువన అంటే కాకతీయ కెనాల్ 146-284 కిలోమీటర్ల వరకు 5,05,720 ఎకరాలు, మొత్తంగా 9,68,640 ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సి ఉన్నది. అందులో 1/3 తరి, 2/3 మెట్ట పంటలకు నీరందేలా ప్రాజెక్టును డిజైన్ చేశారు. కానీ, ఉమ్మడి పాలనలో ఏనాడూ స్టేజ్-1లో ఆ ఆయకట్టుకు నీరందించిన దాఖలాల్లేవు. ప్రాజెక్టు చరిత్రలో వానకాలం, యాసంగి కలిపినా మొత్తంగా 9 లక్షల ఎకరాలు దాటలేదంటే ఆ ప్రాజెక్టు దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎస్సారెస్పీ మొదటి దశ ఆయకట్టుకే దిక్కు లేదంటే 1984లో రెండో దశ చేపట్టారు. కాకతీయ కాల్వను 284 కిలోమీటర్ల నుంచి 347 కిలోమీటర్లకు విస్తరించి మరో 4,40,000 ఎకరాలకు నీరందించాలని నిర్ణయించారు. రాష్ట్ర ఏర్పాటు నాటికి ఆ పనులేవీ పూర్తికాలేదు. మరోవైపు పూర్తయిన కాల్వలు సైతం నీళ్లివ్వకుండానే శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ఆయకట్టు అంతా కాగితాలపై తప్ప, వాస్తవంలో నాలుగైదు లక్షల ఎకరాలకు నీళ్లు పారడమే గగనమైంది. నిజాంసాగర్ కింద ఉన్న ఆయకట్టుదీ అదే దుస్థితి. చెరువుల కింద ఆయకట్టూ అంతమాత్రమే. కాళేశ్వరం పూర్తయిన తర్వాత స్టేజ్-1, స్టేజ్-2ల ద్వారా ప్రాజెక్టు కింద మొత్తం ఆయకట్టుకు రెండు పంటలకు నీరందుతున్నది. కేంద్రప్రభుత్వం ఆమోదించిన ప్రాజెక్టు డీపీఆర్‌లో 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, వరదకాల్వ, సింగూరు ప్రాజెక్టుల కింద 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే.
కాళేశ్వరం ద్వారా తొలి ప్రయోజనం పొందేది, ప్రస్తుతం లబ్ధి పొందుతున్నది కూడా పైన పేర్కొన్న ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు రైతాంగమే. ఆ ప్రాజెక్టుల్లో నీటి సరఫరాకు కాల్వల వ్యవస్థ సిద్ధంగా ఉండటమే అందుకు కారణం. పదేండ్లలో రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు మూడు రెట్లు పెరుగడానికి కాళేశ్వరం ప్రాజెక్టు దోహదం చేసిందనేది అక్షర సత్యం. వ్యవసాయ ఉత్పత్తులే కాదు, చేపల ఉత్పత్తి కూడా అదే స్థాయిలో పెరిగింది. ప్రజల ఆదాయం పెరిగినందువల్ల పరోక్ష పన్నుల రూపంలో కూడా గణనీయమైన ఆదాయం రాష్ట్ర ఖజానాకు చేరుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా రాబోయే వందేండ్ల వరకు హైదరాబాద్ నగరానికి నీటికి ఢోకా లేదు.
తెలంగాణ ప్రగతిలో కీలకమైన కాళేశ్వరాన్ని చూసి ఓర్వలేక కొందరు.. తెలంగాణ బీళ్లకు నీళ్లు పారడం చూడలేక ఇంకొందరు.. దశాబ్దాల ఉమ్మడి పాలనా వైఫల్యాలను ఎత్తిచూపుతున్నదనే ఆక్రోశం.. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో మరికొందరు రాజకీయ బేహారులు, అవకాశాల కోసం ఆ రాజకీయ నేతల పంచన చేరిన కుహనా మేధావులు ఇంకొందరు.. అంతా కలిసి ప్రాజెక్టుపై ముప్పేట దాడి చేస్తున్నారు.
కట్టుకథలతో అప్రతిష్ట పాల్జేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మేడిగడ్డ బరాజ్ వంతు వచ్చింది. ఆ ఘటనను సాకుగా చూపి మొత్తంగా ప్రాజెక్టే నిరర్థకమనే విష ప్రచారాన్ని మళ్లీ ప్రారంభించారు. తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ కలిసి ఏకంగా కేసీఆర్‌ను దోషిగా చూపాలనే కుట్రలకు తెరలేపాయి. అందులో భాగంగానే ఈ కమిషన్ విచారణ, కేసీఆర్‌కు నోటీసులు. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ప్రజలను భ్రమల్లో కొంతకాలం ఉంచవచ్చేమో కానీ, ఎల్లకాలం ఉంచడం ఎవరితరమూ కాదు. ఎవరెన్ని విధాలుగా దుష్ప్రచారం చేసినా కేసీఆర్ రూపొందించిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రగతి రథచక్రం. ఇది అక్షర సత్యం.
-వ్యాసకర్త: సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్ ,89198 96723