రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మూడు ఫేకులు, ఆరు లీకులు అనే చందాన సాగుతున్నది. లీకులనే వార్తలుగా మలిచి, కట్టుకథలు సృష్టించి హెడ్‌లైన్స్ మేనేజ్మెంట్కు కాంగ్రెస్ సర్కార్ పాల్పడుతున్నది. ప్రతిపక్ష బీఆర్ఎస్ మీద అడ్డగోలు అసత్య ప్రచారంతో మీడియాను, తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తున్నది. ప్రభుత్వంలో ఉన్నవాళ్లే మీడియాకు లీకులు ఇవ్వడం కాంగ్రెస్ దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనం. ప్రజాసమస్యలు, ప్రభుత్వ వైఫల్యాల నుంచి జనాల దృష్టి మరల్చడానికి కాంగ్రెస్ కుయుక్తులు పన్నుతున్నది.
ఇందుకు తాజా ఉదాహరణ.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణ. మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి కేటీఆర్‌ను విచారిస్తున్నట్టు కొన్ని మీడియా చానెళ్లు ఫేక్‌న్యూస్ ప్రచారం చేశాయి. స్వయంగా పోలీసులే ఇచ్చిన సమాచారంతో ఆ కథనాలు ప్రసారం చేసినట్టు ఓ న్యూస్ చానెల్ ప్రతినిధి చెప్పడంతో కుట్ర బయటపడింది. రాధాకిషన్‌రావు కూతురు లంచ్ తీసుకొని లోపలికి వెళ్లారని పోలీసులు మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చారట. గతంలో కూడా ఎవరో నటీనటుల ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఆ వ్యవహారం వెనుక రాజకీయ నాయకులు ఉన్నారని కొందరు పనిగట్టుకొని దురుద్దేశపూరిత ప్రచారం చేశారు. నటీనటుల ఫోన్లు ట్యాప్ అవ్వలేదని పోలీసు అధికారులు వెల్లడించినట్టు ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో వార్త ప్రచురితమైనా వ్యక్తిత్వహననం ఆగలేదు.
రేవంత్‌రెడ్డి వికృత రాజకీయ క్రీడలో మీడియాను పావుగా వాడి, ప్రజలను తప్పుదోవ పట్టించడం గర్హనీయం. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ, సరైన సమాచారాన్ని ఇవ్వాల్సిన పోలీసులే ఫేక్ న్యూస్‌కు ఆజ్యం పోయడం వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. ప్రజలను ప్రతీసారి మోసం చేయలేరు. లీకులు, ఫేకులతో పబ్బం గడుపుదామనుకుంటే ప్రజలు ఎల్లకాలం సహించరు.
– మైత్రేయ కొడకండ్ల