నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో పురుగుల అన్నం పెడుతున్నారని.. ఇబ్బంది పడుతూ ఈ విషయాన్ని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్తే కూడా పట్టించుకోకపోగా విద్యార్థులను బెదిరించడంతో విద్యార్థినీలంతా కలిసి ఇటీవల హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
సంగారెడ్డి జిల్లా జూకల్ ఎస్టీ బాలుర ఆశ్రమ పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం పెట్టడంలేదని.. పురుగుల అన్నం, కుళ్లిపోయిన కూరగాయలతో వంట చేస్తున్నారని విద్యార్థులంతా అన్నం కంచాలతో నిజాంపేట-బీదర్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించి రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై నిరసన తెలియజేశారు. ఇలా బడిలో పాఠాలు చదువుకోవాల్సిన పిల్లలు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన దుస్థితి నెలకొన్నది. రెండేండ్లుగా గురుకులాల పిల్లలు అయితే దవాఖానపాలు.. లేదంటే రోడ్డుపాలు అన్నట్టుగా తయారైంది.
కేసీఆర్ హయాంలో గురుకులాలంటే ఇంగ్లీష్ మీడియం చదువు, జాతీయస్థాయి క్రీడల్లో రాణించే ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా వర్ధిల్లాయి. కానీ నేడు అందులో చదువుకునే విద్యార్థులంతా అర్ధాకలితో అలమటిస్తున్నారు. భావిభారత పౌరులు సచ్చిబతుకుతున్నారు. పేద విద్యారులకు దేవాలయాలుగా భావించే గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లకు కాంగ్రెస్ గ్రహణం పట్టి పీడుస్తున్నది. హాస్టళ్లల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు, విద్యార్థుల ఆత్మహత్యలు, పాముకాటు మరణాలు, పర్యవేక్షణలేక ఇబ్బందులు.. ఇలా ఒక్కటేమిటి సకల సమస్యలతో విద్యారంగం కొట్టుమిట్టాడుతున్నది. రేవంత్ పాలనలో 2 వేలకు పైగా గురుకుల విద్యార్థులు దవాఖాన పాలైనట్టు ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి.
స్వరాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మంచి తిండి, చక్కటి చదువు అందుతుండేవి. ఎస్సీ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యావ్యవస్థను దేశానికే ఆదర్శంగా నిలిపారు. తెలంగాణ గురుకులాలు పేదలపాలిట వరంగా రూపుదాల్చాయి. పేదింటి బిడ్డలైన పూర్ణ, ఆనంద్ లాంటి ఎవరెస్ట్ శిఖరాధిరోహకులను అందించిన నిలయాలుగా పేరుగాంచినవి.
ఎందరో పిల్లలు ఇంజినీరింగ్, మెడిసిన్‌లో సీట్లు సాధించారు. ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందారు. కానీ నేడు గురుకులాల్లో పిల్లలకు ఎప్పుడు ఏం జరుగుతుందో అంతుపట్టని దుస్థితి నెలకొన్నది. పేద విద్యార్థులు చదువుకునే వసతి గృహాలు, గురుకులాలపై రేవంత్ సర్కార్ నిర్లక్ష్యమే ఇందుకు కారణం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాలకపక్ష పెద్దలు, అధికారులు సంక్షేమ వసతి గృహాలను పర్యవేక్షించడంలేదు. ఫుడ్ పాయిజన్ లాంటి ఘటనలు జరిగినపుడు మాత్రమే హడావుడి చేస్తూ, తర్వాత చోద్యం చూస్తున్నారు.. తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల సమస్యలు పూర్తిగా గాలికొదిలేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థుల కుటుంబాలు రెక్కాడితే కానీ డొక్కాడనివే. ఇంట్లో గ్రాసం లేకపోయినా పిల్లల చదువు ఆపోద్దనే ఆలోచనతో సర్కార్ మీద నమ్మకంతో సంక్షేమ హాస్టళ్లలో చేర్చే బడుగు జీవులు వాళ్లు. బీఆర్ఎస్ హయాంలో మంచి చదువు, పోషకాహారం అందుతుందనే నమ్మకంతో పిల్లలను తల్లిదండ్రులు హాస్టళ్లలో చేర్పించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అధ్వాన్నంగా మారింది.
‘మేడిపండు చూడ మేలిమై ఉండును.. పొట్టవిప్పి చూడ పురుగులుండు’ అన్న తీరుగా సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు దర్శనమిస్తున్నాయి. ఇన్ని దారుణాలు జరుగుతున్నా ప్రభుత్వం చీమ కుట్టినైట్టెనా స్పందించడంలేదు. ఫలితంగా ఎండాకాలమొస్తే నీళ్ల కొరత, వానాకాలమొస్తే పాముల బెడద, చలికాలంలో దోమలతో విద్యార్థులు సావాసం చేస్తున్నారు. సరైన పోషకాహారం, మెరుగైన చదువు అందిస్తే గురుకులాల నుంచి అబ్దుల్ కలాం, అంబేడ్కర్, ఫూలే కలలను సాకారం చేసే వారసులు తయారవుతారు. కానీ ప్రభుత్వ అసమర్థత కారణంగా విద్యార్థులు తిండిలేక అలమటిస్తున్నారు. గురుకులాల్లో పిల్లల భవితవ్యంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
అటు చదువు మాన్పించలేక, గురుకులాల్లోనే కొనసాగించలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలిలో దీపాలుగా మారిన పిల్లలపై శ్రద్ధ పెట్టాలని తల్లిందండ్రులు వేడుకున్నా పాలక పెద్దలు కనికరించడంలేదు. అందాల పోటీలకు, గ్లోబల్ సమ్మిట్ల కోసం అనవసర ఖర్చు చేసిన సొమ్ములో కనీసం సగమైనా పేద విద్యార్థుల కోసం ఖర్చు పెడితే ఎంతో బాగుండేది. ‘కూట్లె రాయి తీయలేనోడు పోయి ఏట్ల రాయి తీస్తడట’ అన్నట్టు.. వసతి గృహాలనే కాపాడుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కూళ్లు అంటూ ప్రచారం చేసుకుంటున్నది. ప్రజలు అడుగుతున్నది భిక్ష కాదు. వాళ్ల హక్కులు. వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను సర్కార్ పరిష్కరించి, ఆ బిడ్డల ప్రాణాలకు భరోసా కల్పించాలి.
-రాజు పిల్లనగోయిన