భీమా ప్రాజెక్టు ప్రారంభమై దాదాపు 15 ఏండ్లవుతున్నది. ఎక్కడికక్కడ పంటలు వేసుకొని రైతులు జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వరి కాదు, జొన్నలు లేదా ఏదైనా ఆరుతడి పంటలు వేసుకోండని రేవంత్ చెప్తే రైతులు ఒప్పుకుంటారా? అలా అని రైతులను ఒప్పిస్తారా? ఒప్పించే బాధ్యతను ప్రస్తుత ఎమ్మెల్యేలు తీసుకుంటారా? భీమా ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీలను మళ్లించి నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టు పేరిట కొత్త నాటకానికి తెరదీసి అటు భీమా రైతాంగానికి, కొడంగల్, నారాయణపేట రైతులను సీఎం రేవంత్ నిండా ముంచుతున్నారు.
నిజానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద కొడంగల్-నారాయణపేట నియోజకవర్గానికి 2.0 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని, అది కూడా 16 టీఎంసీల నీరు నిల్వ ఉండే ఉదండాపూర్ రిజర్వాయర్ నుంచి రెండు పంటలు పండేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం డిజైన్ చేస్తే, రేవంత్‌రెడ్డి బాధ్యతారాహిత్యంగా ఎటువంటి నీటి లభ్యత లేని జూరాల నుంచి, అది కూడా భీమాకు కేటాయించిన నీటిని తన సొంత నియోజకవర్గానికి లిఫ్ట్ చేయాలని నిర్ణయించారు. కేసీఆర్ నాయకత్వంలో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాన్ని చల్లబరిచేందుకు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సర్వే కోసం జీవో విడుదలైంది.
ఇక్కడ కూడా ఆంధ్ర నాయకుల కుట్ర ఒకటి మనం అర్థం చేసుకోవాలి. తుంగభద్ర నది మీద గండ్రేవుల రిజర్వాయర్ కట్టుకోవాలని జీవో ఇస్తూ కంటితుడుపు చర్యగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సర్వేకు జీవో ఇచ్చారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 2013 ఆగస్టు నుంచి తెలంగాణ సిద్ధించే 2014, జూన్ 2 వరకు కనీసం పనుల కోసం టెండర్ కూడా వేయలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత సర్వే పూర్తిచేసి పనులను ప్రారంభించాం. ఇప్పుడు జీవో ఇచ్చి తెలంగాణ ఏర్పడిన తర్వాత అపెక్స్ కౌన్సిల్లో అడ్డుకోవచ్చనే కుటిలబుద్ధి ఆంధ్ర ప్రాంత నాయకులది.
ఉమ్మడి ఏపీ ప్రతిపాదించిన పాలమూరు ప్రాజెక్టులో మొత్తం 47 గ్రామాలు, 84,444 మంది జనాభా, 16,342 ఆవాసాలు ముంపు బారిన పడుతున్నాయి. ఇంత భారీ ముంపును తగ్గించడం ప్రభుత్వం ముందు ఒక సవాలుగా నిలిచింది. దాంతో పాటు జూరాల జలాశయం నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు మాత్రమే. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో రోజుకు 1.5 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని ప్రతిపాదించినందున జూరాల జలాశయం నుంచి ఇంత భారీగా నీటిని ఎత్తిపోయడం సాంకేతికంగా సాధ్యమా? ఎందుకంటే పాలమూరు పంపులకు కావలసిన నీళ్ల పరిమాణం కేవలం 25 నుంచి 30 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
జూరాల నుంచే కదా వరద జలాలు శ్రీశైలంకు వచ్చేది. ఆ నీటిని జూరాల నుంచే ఎత్తుకోవచ్చు కదా అని కొందరు మేధావులు అమాయకంగా అడిగే ప్రశ్న. జూరాల జలాశయం నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు. శ్రీశైలం జలాశయం నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. కాబట్టి, ఆ భారీ ఎత్తిపోతలు భారీ జలాశయం నుంచే సాధ్యమవుతుంది. ఇంకో ముఖ్య విషయం తుంగభద్ర నదిలో 430 టీఎంసీల నీటి లభ్యత ఉంది అని కేడబ్ల్యూడీటీ-1 చెప్పింది. నీటి లభ్యత లేని దగ్గర రూ.50 వేల కోట్లతో ప్రాజెక్టు కట్టడం నిరుపయోగంగా మారుతుంది కాబట్టే కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను రీడిజైన్ చేశారు.
రీ డిజైన్ తర్వాత ప్రాజెక్టు ప్రతిపాదనల్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రధానమైన మార్పు నీటి ఎత్తిపోతలను జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి మార్చడం. కొత్త జలాశయాలను ప్రతిపాదించడం, పంపింగ్ సామర్థ్యాన్ని రోజుకు 1.5 టీఎంసీల నుంచి 2 టీఎంసీలకు పెంచడం, ఆయకట్టు 10 లక్షల ఎకరాల నుంచి 12.30 లక్షల ఎకరాలకు పెంచడం, గతంలో కంటే ముంపు గణనీయంగా తగ్గించడం జరిగింది. ఒక ప్రాజెక్టు సర్వేను 8 నెలల్లోనే పూర్తిచేసి టెండర్లు పిలిచి 20 నెలల్లో ఏదుల, కరివెన వంటి పెద్ద రిజర్వాయర్లను నిర్మించడం, ప్రపంచంలోనే అతి పెద్దదైన అండర్ గ్రౌండ్ పంపింగ్ స్టేషన్లను పూర్తిచేసి ఒక పంపు నడపటమనేది ఒక చరిత్ర. 145 మెగావాట్ల సామర్థ్యం గల పంపులు మరో చరిత్ర.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేండ్లయింది. కనీసం ఒక్క సమావేశమైనా పెట్టుకున్నారా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో కీలకమైన పనులన్నీ కేసీఆర్ హయాంలోనే పూర్తిచేశాం. కేవలం 10 శాతం పనులు చేస్తే ప్రాజెక్టు పూర్తయి రిజర్వాయర్లలో నీళ్లు నింపవచ్చు. కోర్టులో కేసులు వేసి పాలమూరు ప్రాజెక్టును అడ్డుకుంటే అన్ని కేసులను అధిగమించి కాలువలకు టెండర్లు పిలిచాం. కానీ, రేవంత్ ప్రభుత్వం ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదు. కనీసం టెండర్లను రద్దు కూడా చేయలేదు. చిత్తశుద్ధి ఉంటే కాలువలను కేవలం ఒక ఏడాదిలో పూర్తిచేయవచ్చు కదా? పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వానికి పంపి దాదాపు అన్ని అనుమతులను సాధించుకున్నాం. కేవలం నీటి కేటాయింపుతో ముడిపడి ఉన్న అంశం ట్రిబ్యునల్ పరిధిలో ఉన్నందున హైడ్రాలజీ అంశంలో అనుమతి రాలేదు. మిగతా అన్ని అనుమతులున్న పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్ అంశాన్ని కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఒప్పించాలి. రేవంత్ గురువు చంద్రబాబు తన పరపతి ఉపయోగించి డీపీఆర్‌ను వెనక్కిపంపారు.
గంపగుత్తగా ట్రిబ్యునల్ ఇచ్చిన 811 టీఎంసీల నీటిని తెలంగాణకు, తెలంగాణ ప్రాంతంలో ఏ ప్రాజెక్టుకైనా కేటాయింపు చేసుకునే అధికారం ఉన్నది. అందుకే కేసీఆర్ పాలమూరు ప్రజల శ్రేయస్సు కోసం 90 టీఎంసీల నీటి కేటాయింపు జీవో ఇచ్చారు. గతంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి మీటింగ్ పాలమూరు ప్రాజెక్టుల మీదనే జరిగింది. కల్వకుర్తి ప్రాజెక్టుకు 40 టీఎంసీల నీటిని కేటాయిస్తూ కేసీఆర్ జీవో 141 ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రమే నిధులు ఇచ్చి పూర్తిచేస్తుంది. అందువల్ల పోలవరం ద్వారా కృష్ణకు మళ్లించే నీటిని పాలమూరుకు కేటాయించాలి.
పాలమూరు జిల్లా విస్తీర్ణపరంగా చూసుకుంటే దాదాపు 35 లక్షల ఎకరాలు వ్యవసాయానికి అనువుగా ఉన్న ప్రాంతం. అంటే, దాదాపుగా 350 టీఎంసీల నీరు పాలమూరుకు కావాలి. కల్వకుర్తి లిఫ్ట్‌ను గత ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కేవలం 3 లక్షల ఎకరాలకు సరిపోయేటట్టు పనులను ప్రారంభించింది. భీమా, కోయిల్‌సాగర్ లాంటి ప్రాజెక్టులు చిన్న చిన్న పంపులతో కేవలం 40 నుంచి 60 రోజులు నడిచేటట్టు ప్రతిపాదించబడినాయి. కేసీఆర్ ప్రతి సమావేశంలో ప్రతి ఎమ్మెల్యే లేదా మంత్రులు అందరం కూడా నీటి గురించి చర్చించేవాళ్లం. అందుకే పాలమూరు ప్రాజెక్టును 1.5 టీఎంసీకి బదులు 2 టీఎంసీలు లిఫ్ట్ చేసేవిధంగా పనులను ప్రారంభించాం.
పాలమూరు ప్రాజెక్టు నుంచి జూరాల, భీమా ప్రాజెక్టులో 1.5 లక్షల ఎకరాలకు సరిపడా నీటిని కరివెన రిజర్వాయర్ నుంచి, కల్వకుర్తి ప్రాజెక్టు కోసం 2 లక్షల ఎకరాలకు వట్టెం, ఏదుల రిజర్వాయర్ నుంచి ఇవ్వాలని తూముల పనులను పూర్తిచేశాం. రేవంత్ రెడ్డి నల్గొండ మంత్రులకు దాసోహమయ్యాడనటానికి ఇటీవల జరుగుతున్న సంఘటనలే ఉదాహరణ.
హడావుడిగా సర్వేలు స్టార్ట్ చేయటం, అడిగిందే తడవుగా డిండికి టెండర్లు పిలవటం, పాలమూరు ప్రాజెక్టుకు డిండికి లింకు పెట్టి జిల్లాల మధ్య, రైతుల మధ్య ఘర్షణలు రేపే స్థాయికి దిగజారటం దేనికి సంకేతం? ఇప్పటికైనా నిజంగా పాలమూరు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కింద కాలువ పనులను పూర్తిచేయాలి. ఎలాంటి డీపీఆర్ కాని అనుమతులు లేని ఆంధ్ర ప్రాజెక్టులకు కేంద్రం ఆర్థిక సహాయం ఇస్తున్న నేపథ్యంలో కనీసం పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా సాధించాలి. 8 మంది బీజేపీ ఎంపీలుండి కూడా కనీసం పాలమూరు ప్రాజెక్టులపై చర్చ జరపటానికి ఎందుకు భయపడుతున్నారు?
పోలవరం నుంచి కృష్ణానదికి గోదావరి జలాల తరలింపు విషయమై గోదావరి అవార్డులో ఏమున్నదో కూడా తెలుసుకోవాలి. 04.08.1978న కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని బచావత్ అవార్డులో Annexureగా ఉంచి చట్టబద్ధత కల్పించారు. ఈ ఒప్పందం క్లాజ్ 7 (a), (b), (f)లో అంగీకరించిన అంశాలు ఇలా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టా అవసరాలకు తరలించుకోవచ్చు. ఆ మేరకు కృష్ణాలో మిగులు నీటిని పోలవరం ప్రాజెక్టును కేంద్ర జలసంఘం అనుమతించిన రోజు నుంచే మహారాష్ట్ర 14 టీఎంసీలు, కర్ణాటక 21 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 45 టీఎంసీలను నాగార్జునసాగర్ ఎగువన బేసిన్లో ఉండే ఆయకట్టు అవసరాలకు, తాగునీటి అవసరాలకు వినియోగించుకోవచ్చు. రాష్ట్ర విభజన తర్వాత నాగార్జునసాగర్ ఎగువన తెలంగాణ రాష్ట్రమే ఉన్నది కాబట్టి ఉమ్మడి ఏపీకి కేటాయించిన 45 టీఎంసీలు తెలంగాణకే చెందుతాయి. అందుకే, ఈ నికర జలాలను పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించడం జరిగింది.
7 (f) ప్రకారం పోలవరం నుంచి 80 టీఎంసీలకు మించి గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించినట్టయితే ఆ నీటిలో కూడా అదే నిష్పత్తిలో… అంటే 45:21:14 నిష్పత్తిలోనే ఎగువ రాష్ర్టాలైన తెలంగాణ, కర్ణాటక, మహారాష్ర్టలు కృష్ణా జల్లాల్లో వాటాను డిమాండ్ చేయవచ్చు. ఇప్పుడు ఏపీ 200 టీఎంసీల గోదావరి జలాలను పోలవరం నుంచి కృష్ణా బేసిన్‌కు, అటునుంచి పెన్నా బేసిన్‌కు తరలించుకుపోతున్నది. కాబట్టి పైన ప్రస్తావించిన క్లాజ్ 7(f) ప్రకారం కృష్ణా జలాల్లో అదనంగా 112.5 టీఎంసీల వాటాను డిమాండ్ చేయవచ్చు. (గోదావరి బోర్డు కూడా ఈ అంశాన్ని తన వ్యాఖ్యల్లో ప్రస్తావించడం గమనార్హం.) అప్పుడు పోలవరం నుంచి కృష్ణా బేసిన్‌కు తరలించినందుకు తెలంగాణకు కృష్ణా జలాల్లో హక్కుగా లభించే అదనపు నికర జలాల వాటా 45+112.5=157.50 టీఎంసీలు అన్నమాట. ఈ జలాలను నికర జలాల కేటాయింపులు లేని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు ఎస్ఎల్బీసీ (40 టీఎంసీలు), కల్వకుర్తి (40 టీఎంసీలు), నెట్టెంపాడు (25 టీఎంసీలు), పాలమూరు-రంగారెడ్డి (90 టీఎంసీలు), డిండి (30 టీఎంసీలు) వేటికైనా కేటాయించుకునే అవకాశం తెలంగాణకు ఉంటుంది.
కృష్ణా ట్రిబ్యునల్-1 (బచావత్)లో క్లాజ్ 14 (B) కూడా ఏదైనా నదీ బేసిన్ నుంచి కృష్ణా బేసిన్‌కు నీటిని తరలిస్తే ఆ నీటికి బదులుగా కృష్ణా జలాల్లో ఎగువ రాష్ర్టాలు ఎక్కువ వాటాను కోరవచ్చు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టులో పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి 200 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. కాబట్టి కృష్ణాలో ఎగువ రాష్ర్టాలైన తెలంగాణ, కర్ణాటక, మహారాష్ర్ట కృష్ణా జలాల్లో అధిక వాటాను పొందడానికి ఈ అవార్డు హక్కును కల్పిస్తున్నది.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు, పాలమూరులోని ప్రాజెక్టులకు నీటిని కేటాయించుకునేందుకు ఇంతటి నిదర్శనాలు కండ్ల ముందు ఉన్నా తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రాకు దాసోహమై తెలంగాణకు ద్రోహం తలపెట్టడాన్ని తెలంగాణ సమాజం గమనించాలి. ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యంతో పాలమూరు రైతాంగానికి అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తన తీరు మార్చుకోకుంటే పాలమూరు రైతాంగాన్ని ఏకం చేసి తగిన బుద్ధిచెప్తాం. పాలమూరుకు, తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరిగినా తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తున్నాం.
(వ్యాసకర్త: రాష్ట్ర వ్యవసాయశాఖ మాజీ మంత్రి)
-సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి