అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కులగణన జరిపి, 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తానని బీసీలకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బీసీల ఓట్లు కీలకమని, వారికి ఏదో ఒక గట్టి హామీ ఇవ్వకపోతే తమవైపు తిప్పుకోవడం కష్టమని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో 2023 నవంబర్ పదో తేదీన వారి కోసం అట్టహాసంగా ఓ హామీల పత్రం విడుదల చేసింది. దానికి ‘కామారెడ్డి డిక్లరేషన్’ అని ఆడంబరపు పేరు ఒకటి తగిలించింది. అధికారం చేజిక్కిన తర్వాత హామీలను తుంగలో తొక్కి తన అసలు రంగు బయటపెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. సవ్యంగా కులగణన జరుపకుండా తూతూమంత్రంగా నిర్వహించి, అసెంబ్లీలో 2025 మార్చి 17న హడావుడిగా బిల్లు పాస్ చేయించి కేంద్రానికి పంపింది.
ఆ బిల్లులో సవాలక్ష లొసుగులున్నాయి. అది అమలులోకి రావాలంటే కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాలి. అది జరిగే పని కాదని తెలుసు. అందరూ ఊహించినట్టుగానే అది కేంద్రం దగ్గర ఆగిపోయింది. ఈలోగా స్థానిక ఎన్నికలు జరపాలని న్యాయస్థానం ఆదేశించడంతో ఇన్నాళ్లూ కాలయాపన చేసిన కాంగ్రెస్ సర్కారు ఇటీవల ఆర్డినెన్స్ అంటూ మరో నాటకానికి తెరతీసింది. కేంద్రం వద్ద బిల్లు పరిశీలనలో ఉండగా, ఈ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదముద్ర వేస్తారా? అనేది ఒక సందేహం. ఒకవేళ ఒప్పుకొన్నా ఆర్డినెన్స్ న్యాయ పరిశీలనకు నిలుస్తుందా అనేది మరో సందేహం.
కుడిచేత్తో ఇచ్చి, ఎడమచేత్తో లాగేసుకున్నట్టుంది బీసీ రిజర్వేషన్ వ్యవహారం. బీసీలను గాలికొదిలి, ‘ఇది నా పాపం కాదని’ చేతులు కడిగేసుకోవడమే కాంగ్రెస్ కుటిలత్వంగా కనిపిస్తున్నది. అటు బీజేపీ కూడా ఈ అంశంపై ఏం మాట్లాడటం లేదు. ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు తీసేస్తే చిటికెలో అనుమతి తెప్పిస్తామని ఆ పార్టీ నాయకులు అర్థం లేని ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరాల్సిందేనని బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తాఖీదు జారీచేయడం గమనార్హం. కాంగ్రెస్ సర్కారు కుట్రలు కనిపెట్టిన బీసీ నేతలు ఏకతాటి మీదకు వచ్చి ఉద్యమిస్తున్నారు. మంగళవారం నాటి బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం మహాధర్నా బీసీల ఆగ్రహానికి అద్దం పట్టింది.
కాంగ్రెస్ ఎన్నడూ బీసీలకు అండగా నిలువలేదు. మండల్ నివేదిక అమలు చేస్తే దేశంలో కులతత్వం పెరిగిపోతుందని ఆనాడు రాజీవ్‌గాంధీ తెగ బాధపడిపోయారు. కాంగ్రెస్ ఢిల్లీ గద్దె దిగిన తర్వాతనే బీసీ రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయనేది మరువరాదు. ఇప్పుడాయన వారసుడు రాహుల్ నేతృత్వంలో మరోసారి బీసీలకు వెన్నుపోటు పొడిచే ప్రక్రియ దిగ్విజయంగా కొనసాగుతున్నది.
తమను అతికష్టం మీద నమ్మి అధికారం అప్పగించిన తెలంగాణలో బీసీలకు వెన్నుపోటు పొడిచి దేశవ్యాప్త కులగణన, రిజర్వేషన్ల గురించి రాహుల్ జపించడం విడ్డూరం. కుప్పిగంతులు, పక్కచూపులు మాని ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు విధించిన గడువులోగా దీన్ని సాధిస్తుందా? లేక ఆ సాంకేతికతల వెనుక దాక్కుని రిజర్వేషన్లను, లేదా ఎన్నికలను దాటవేస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.