తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచీ ద్వేషమే. ఆ విద్వేషంతోనే తెలంగాణపై హస్తం పార్టీ కసి పెంచుకున్నది. అందుకే సిరిసంపదలతో అలరారుతున్న అమాయకపు ఆడపిల్ల లాంటి హైదరాబాద్ స్టేట్‌కు బలవంతంగా ఏపీతో లగ్గం చేసింది. అంతటితో ఆగకుండా సమైక్య పాలకులను బలవంతంగా రుద్ది
తెలంగాణ జీవాన్ని కబళించింది. 60 ఏండ్ల పాటు తెలంగాణ బిడ్డలు తన్లాడిన తర్వాత, తన పీకల
మీదికి వచ్చాక తెలంగాణను ప్రకటించాల్సి వచ్చింది. అంతే తప్ప మనపై ప్రేమతో కానే కాదు.
కేసీఆర్ నేతృత్వంలో జరిగిన 14 ఏండ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా ఏర్పడిన తెలంగాణ.. ఆయన నాయకత్వంలో 10 ఏండ్లపాటు ప్రగతి పథంలో దూసుకెళ్లింది. ఇది కాంగ్రెస్ పార్టీకి నచ్చలేదు. మొదటి నుంచి మన ప్రాంతంపై ఉన్న విద్వేషానికితోడు తెలంగాణ ఇచ్చింది తామేనని నెత్తినోరు బాదుకున్నా తమను ఆదరించలేదన్న కసి తోడైంది. అందుకే రాష్ట్రంలో మొదటిసారి ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ పగ్గాలను కావాలనే కనీస పరిజ్ఞానం లేని వ్యక్తి చేతిలో పెట్టింది. కేసీఆర్ నాయకత్వంలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన తెలంగాణ ఘనకీర్తి మరింత పెరిగితే తమకే నష్టమని భావించిన కాంగ్రెస్ అధిష్ఠానం ఉద్దేశపూర్వకంగానే గల్లీ లీడర్‌కు ఎక్కువ ఢిల్లీ లీడర్‌కు తక్కువ లాంటి రేవంత్‌రెడ్డిని సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. అధిష్ఠానం అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రేవంత్ మొదటి నుంచి తన అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రపంచ యవనికపై తెలంగాణ పరువు తీస్తున్నారు.
కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తొలినాళ్లలో దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుతో మొదలైన తెలంగాణ పరువు తీసే కార్యక్రమం ఇటీవల జరిగిన సదస్సులోనూ నిర్విఘ్నంగా కొనసాగింది. గతంలో పెట్టుబడుల పేరిట దావోస్‌కు వెళ్లిన రేవంత్ బృందం పెట్టుబడుల మూటలు తీసుకురాకపోగా అపకీర్తిని మూటకట్టుకొని వచ్చింది. సమయం, సందర్భం, అర్థంపర్థం లేకుండా న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని మాట్లాడిన రేవంత్ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకోవడంతో పాటు తెలంగాణ పరువును తీసేశారు.
ఇటీవలి ఆర్థిక వేదిక సదస్సులోనూ రేవంత్ ఏ మాత్రం తగ్గలేదు. అజ్ఞానంలో తనను మించినవారు లేరని మరోసారి నిరూపించుకున్నారు. భాష అనేది భావవ్యక్తీకరణ కోసం మాత్రమే. అందరికీ అన్ని భాషలు రావాలని ఏమీ లేదు. కానీ, వచ్చీరాని ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ మధ్యలో స్టక్ అయి ‘ఓ.. ఓ.. ఓ’ అని రేవంత్ నసుగుతున్న వీడియోలు ఇంటర్నెట్ను ముంచెత్తాయి. గత సదస్సులో న్యూక్లియర్ చైన్ రియాక్షన్‌తో అందర్నీ అలరించిన రేవంత్ ఈసారి ‘అవర్ స్టేట్ ఈజ్ చైనా ప్లస్ వన్’ అంటూ మరోసారి తాను నవ్వుల పాలు కావడమే కాకుండా తెలంగాణనూ నవ్వులపాలు చేశారు. ‘మా పోటీ అమరావతితో కాదు, ప్రపంచ దేశాలతో’ అని రేవంత్ చెప్పగానే పక్కనే ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నవ్వు ఆపుకోలేకపోయారు. కెమెరాల ముందే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ.. ‘ఎలాంటి తెలంగాణకు ఎలాంటి కర్మ పట్టింది’ అనుకుంటూ వారు నవ్వుకున్న వీడియోలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి.
రేవంత్ గతంలోనూ ఇలాగే కనీస అవగాహన లేకుండా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ పరువును బజార్లో పడేశాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దిల్‌సుఖ్‌నగర్‌లో విమానాలు దొరుకుతున్నాయని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అంతేకాదు, హైదరాబాద్ చుట్టూ మూడు సముద్రాలు ఉన్నాయని మరోమారు తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న తనను ఎవరూ గుర్తించడం లేదని బాధపడే రేవంత్ తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు పేరు మర్చిపోవడం విడ్డూరం. దావోస్ సదస్సులో మాజీ ప్రధాని నరసింహారావుకు బదులుగా నర్సింగరావు అని సంబోధించారు. ఇది అజ్ఞానం అనుకోవాలో, అవివేకం అనుకోవాలో, అహంకారం అనుకోవాలో తెలియడం లేదు. ఒకసారి అంటే పొరపాటు అనుకోవచ్చు. గతంలోనూ పీవీ పేరును ఇదే విధంగా సంబోధించి అవమానించారు.
ప్రపంచ వేదికలపై ఇలా వరుసగా రేవంత్ వల్ల తెలంగాణ పరువు మంటగలుస్తున్నా కాంగ్రెస్ అధిష్ఠానం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తెలంగాణపై ఆ పార్టీకి ఉన్న విద్వేషమే అందుకు ప్రధాన కారణం. వాస్తవానికి తమకంటే విజ్ఞానులు కాంగ్రెస్ సీఎంలుగా, ప్రధానులుగా ఉండటం ఆ పార్టీకి ఏ మాత్రం ఇష్టం ఉండదు. అందుకే ఎంతసేపటికీ తాము చెప్పినట్టు తలాడించే వారినే ఆ పార్టీ పీఠాలపై కూర్చోబెడుతుంది. ఈ సంస్కృతికి అడ్డుకట్ట వేసినందుకే పీవీని కాంగ్రెస్ అవమానించింది. మైనారిటీ సర్కారును ఐదేండ్లపాటు విజయవంతంగా పీవీ నడిపించారు. కాంగ్రెస్ అధిష్ఠానం మెడలు వంచి, వారి ఉడుత ఊపులకు భయపడకుండా నెహ్రూ కుటుంబం ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆర్థిక సంస్కరణలను చేపట్టి దేశాన్ని ప్రగతి పథాన నడిపించారు.
ఇటీవల మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు దేశ రాజధానిలో ప్రత్యేకంగా ఘాట్ నిర్మించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించిన కాంగ్రెస్.. పీవీకి ఘాట్ నిర్మించలేదు. నిర్మించాలని ప్రతిపాదనలు పెట్టలేదు. పీవీ తెలంగాణ బిడ్డ కావడం, దీనికి తోడు తెలంగాణపై కాంగ్రెస్‌కు ఉన్న అక్కసే అందుకు ప్రధాన కారణం.
తెలంగాణ ఏర్పడ్డాక ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఉంటే ఇప్పుడు జరుగుతున్నట్టు విధ్వంసం జరిగి ఉంటే తెలంగాణను ఒక విఫల రాష్ట్రంగా చిత్రీకరించేవారు. మళ్లీ ఏపీలో కలపాలనే డిమాండ్ వచ్చేది. ఈ విషయాన్ని ముందే గ్రహించిన ఉద్యమ నేత కేసీఆర్.. బీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేయలేదు. రక్తం ధారపోసి సాధించుకున్న తెలంగాణ ప్రగతి రథానికి ఆయనే సారథ్యం వహించారు. తెలంగాణ అనే విత్తుకు కంచెగా మారి కాపలా కాశారు. అభివృద్ధి అనే కాడిని తన భుజాలపై మోశారు. రేయింబవళ్లు శ్రమించి తెలంగాణను కాపాడుకున్నారు. అహర్నిశలు శ్రమించి కేసీఆర్ నిర్మించిన కలల సౌధాన్ని చివరి ఇటుక పేర్చి, పూర్తిచేసి రంగులద్ది తుది మెరుగులు దిద్దాల్సిన రేవంత్ అందుకు విరుద్ధంగా పునాదులనే పెకలిస్తున్నారు. ‘Government is not the solution to our problem. Government is the problem’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ చెప్పినట్టు.. తెలంగాణ సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ పరిష్కారం కానే కాదు. కాంగ్రెస్సే తెలంగాణకు అసలు సమస్య.
(వ్యాసకర్త: అధ్యక్షులు, బీఆర్ఎస్ ఆస్ట్రేలియా)
-కాసర్ల నాగేందర్‌రెడ్డి