మూడు రంగుల జెండా పార్టీ ఇటీవల గాంధీభవన్‌లో ఓ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి, ఇద్దరు, ముగ్గురు మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు గూడ హాజరైండ్రు. ఈడిదాన్క బాగనే ఉంది గనీ.. పాపం ఆ పార్టీలో కొత్తగా జేరిన ఓ ఇద్దరు ముసలి నేతల పరిస్థితే నెరీ అవమానంగా తయారైందట. ఓ మూలగ్గూసున్న వీళ్లు మీటింగ్ అయిపోయినంక పక్కకువొయి విక్రమార్కుడు సినిమాలోని ‘రవితేజ, బ్రహ్మానందం’ తరహాలో గతాన్ని తవ్వుకున్నరట.‘గులాబీ పార్టీల ఉన్నప్పుడు ఆయన కుడిబాజుకు నువ్వు, ఎడమ బాజుకు నేను.. ఎట్లుండేటోళ్లం, ఇప్పుడట్లైపోయినం భయ్యా’ అని మస్తు బాధవడ్డరట. ఇప్పుడెంత బాధవడ్డా ఫాయిదా లేదని కాంగ్రెస్ కార్యకర్తలు ఊకోవెట్టడంతో వాళ్లకు కొంత ధైర్నం వచ్చిందని సమాచారం.
గాంధీభవన్‌లో ఇప్పుడు ‘ఏకు వొయి మేకై గూసుంది’ అనే మాట ఎక్కువినిపిస్తున్నది!. వారంల ఒక్కరోజన్న గాంధీభవన్‌కు పోవాల్నని, కార్యకర్తల కట్టాలను, బాధలను, సమస్యలను సావధానంగా విని వాళ్లకు పరిష్కారం సూపెట్టాల్నని రాష్ట్ర మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. అయితే… పీసీసీ అధ్యక్షుడిగా పదవీ ప్రమాణం తిన్న వెంటనే మహేశ్‌కుమార్ గౌడ్.. ‘మంత్రులే గాద్ సారు, మీరు గూడ గాంధీభవన్‌కు వారానికి రెండు రోజులు రావాల్నని, గప్పుడే కార్యకర్తల కట్టాలు తీరుతయని’ చెప్పిండట! సూడటానికి సలహా, సూచనల లెక్కనే కనిపిస్తున్నా మహేశ్‌కుమార్ మాటల వెనుక మర్మం మరోటి ఉన్నదని, పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి సుర్కు వెట్టిండని గాంధీభవన్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నయి.
‘నమ్మినోళ్లే నట్టేట ముంచిర్రని’ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లబోదిబోమని మొత్తుకుంటున్నడట. కర్ణాటక రాష్ట్రంల ఏ మూల జూసినా ముడా స్కాం గురించే ఇప్పుడు చర్చ నడుస్తున్నది. ‘మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ’లో తన భార్య పార్వతి పేరు మీన అక్రమంగా ఇంటి జాగలు కొట్టేసిండనేది సిద్ధరామయ్య మీద అభియోగం. ఈ ముచ్చట బైటికెలా పొక్కిందనే విషయాన్ని ఆరా తీస్తే ఉచ్చులు పేనింది బీజేపీ మాజీ సీఎం యడియూరప్పే అయినప్పటికీ ఇరికిచ్చింది మాత్రం తన కాంగ్రెస్ పార్టీకి చెందినవారేనట! ముడా కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాలన్నీ యడియూరప్పకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద లీడరేనట. విషయం తెల్సుకున్న సిద్ధులు సార్ ఇటు కక్కలేక, అటు మింగలేక లోలోపల మండిపోతున్నడట.!
ముఖ్యముంత్రి నోటి పొంట ‘పండవెట్టి తొక్కుతె కసరెల్లాలె.., పేగులు దీసి మెడలేసుకుంటా’ అనే మాటలు అలవోకగా వస్తయి. ముఖ్యమంత్రి సారు మాటల్నే ఆదర్శంగా తీసుకున్నట్టున్నరు హుజూర్నగర్ ఏరియా దవాఖాన నర్సులు. రోజులు నిండిన చూలాలును పండవెట్టి తొక్కి మరీ కాన్పు జేసిన్రు. మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా వాసి అయిన రేణుక పురుడు పొయ్యిమని దవాఖానకు వోతె డాక్టర్లు అందుబాటులో లేరు. ‘మేమేమన్న తక్కువ తిన్నమా’ అనుకున్నారేమో నర్సులు ఆ నిండు చులాలు పొట్ట మీద శెయ్యి వెట్టి ఒత్తుడు షురూ జేసిన్రు. ఎంత తన్లాడినా పాపం ఆ తల్లి ప్రసవించలేదు. ఆ నర్సులకు మన ముఖ్యమంత్రి మాటలు టక్కున గుర్తుకొచ్చినట్టున్నయి. చేతి గ్లౌజులు తీసి కాళ్లకు తొడిగి.. నిండు చులాలును పండవెట్టి తొక్కిర్రు. మగపిల్లగాడు బైటికైతే వచ్చిండు గనీ పాపం జీవునంతోని గాదు. ఇంకా నయ్యం ఆ చూలాలు పేగులు తీసి మెడలో వేసుకోలేదు సంతోషం.
– సిన్రాజయ్య