నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుంది.. అన్న సామెత చందంగా తయారైంది కాంగ్రెస్ రైతు భరోసా వ్యవహారం. అన్నదాతను ఊరించి ఊరించి చివరకు చేతికి దక్కని పంటలా ఉసూరుమనిపించారు. ఇప్పుడు కాంగ్రెస్ చెయ్యిచ్చిన హమీల జాబితాలో రైతు భరోసా కూడా చేరిపోయింది. ఇప్పటికే రైతులు కాంగ్రెస్ తీరుతో విసిగిపోయారు. రుణమాఫీ తతంగం చూశారు. అరకొరగా అమలు చేయడంతో అదొక ప్రహసనంలా తయారైంది. దెబ్బ మీద దెబ్బలా భరోసా కోతలు వచ్చిపడ్డాయి. రూ.15 వేలు అని చెప్పి రూ.12 వేలే ఇస్తామని చావు కబురు చల్లగా చెప్పింది రేవంత్ సర్కారు. ఇదే పెద్ద ధోకా అనుకుంటే లబ్ధిదారులను తగ్గించేందుకు అర్హతల పేరిట వేసే కోత అతిపెద్ద ధోకా.
రాష్ట్రంలో సాగుయోగ్యమైన భూమి 1.48 కోట్ల ఎకరాలుంది. ఆ మొత్తానికి యాసంగిలో రైతుభరోసా ఇవ్వాలంటే రూ.8,880 కోట్లు కావాలి. సాగుచేసిన భూమికే ఇస్తారా? సాగుయోగ్యమైన భూమికీ ఇస్తారా? ఒకవేళ సాగుచేయని భూములను మినహాయిస్తే అందులో సగమే చెల్లిస్తారు. హామీయే కదా ఇచ్చేస్తే పోలేదా అన్నట్టు కౌల్దార్లకూ ఇస్తామన్నారు. ఇప్పటిదాకా ఎలా ఇస్తారో తేలలేదు. ఇలాంటి అంశాలపై సర్కారు నుంచి స్పష్టత లేకపోవడం మరో సమస్య. సర్కారు పెద్దలు తలోదారిగా, పూటకోమాట మాట్లాడుతూ గందరగోళం సృష్టిస్తున్నారు. తీవ్ర నిరాశ చెందిన రైతులు ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారు. ప్రజల కోసం విపక్ష బీఆర్ఎస్ ఉద్యమాల బాట పడితే అరెస్టుల పేరిట పోలీసు నిర్బంధాన్ని అమలు చేయడం విస్మయం కలిగిస్తున్నది.
అధికారం చేజిక్కించుకునేందుకు అలవికాని హామీలిచ్చారు. అందరికీ అన్నీ అన్నారు. అరచేతిలో స్వర్గం చూపించారు. హామీలంటే నమ్మరేమోనని గ్యారెంటీ అనే మాటను అరువు తెచ్చుకున్నారు. అక్కడికి హామీ అనేది ఏదో సంతలో సరుకైనట్టు. అయితే ఇప్పుడు గ్యారెంటీకే వారెంటీ లేకుండా పోయింది. 420 హమీలను అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ ఏమూలకూ సరిపోదని అప్పట్లోనే ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. మాయదారి మాటలకు పడిపోవద్దని అప్పటి సీఎం కేసీఆర్ ఎన్నికల సభల్లో పదేపదే హెచ్చరించారు. కానీ ఫలితం లేకపోయింది. అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి హామీల ఎగవేత కోసం వేయని ఎత్తు లేదు, చేయని కసరత్తు లేదు. వాయిదాలు, కోతలతో ప్రజలకు చుక్కలు చూపిస్తున్నది. ఉచిత వంటగ్యాస్, కరెంటు హామీల గురించి సర్కారు గొప్పలు చెప్పుకుంటున్నది. కానీ అవీ అర్ధసత్యాలే.
ఆర్టీసీని పణంగా పెట్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేస్తున్నారు. మిగిలిన హామీలను ఒకటి తర్వాత ఒకటిగా తుస్సుమనిపిస్తున్నారు. ఉద్యోగాల కల్పన కలగానే మిగిలిపోయింది. ఇదివరకటి సర్కారు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ తతంగమంతా పూర్తిచేసిన ఉద్యోగాలకే నియామక పత్రాలు అట్టహాసంగా అందజేసి జబ్బలు చరుచుకున్నారు. అవ్వలకు, తాతలకు వృద్ధాప్య పింఛన్ రూ. 2016 నుంచి రూ. 4 వేలకు పెంచుతామన్నారు. పైనున్న పదహారు కోతపెట్టి రెండు వేలే ఇస్తున్నారు. కల్యాణలక్ష్మికి తులం బంగారం కానుకగా ఇస్తామన్నారు. తులం కాకిబంగారం కూడా ఇవ్వడం లేదు. విద్యార్థినులకు స్కూటీ ఇస్తామన్నారు. కనీసం సైకిల్ కూడా ఇవ్వడంలేదు. నమ్మి మోసపోయాం.. ఇప్పుడు గోస పడుతున్నాం అని రైతులే కాదు ప్రజలందరూ వాపోతున్నారు. నమ్మితేనే మోసం చేస్తాం.. నమ్మకపోతే ఎలా చేస్తామని కాంగ్రెస్ పెద్దలు గడుసుగా వాదిస్తారేమో!