2000 సంవత్సరంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కరెంటు చార్జీలను పెంచింది. ఈ పెంపుదలను వ్యతిరేకిస్తూ తెలంగాణ రైతాంగం 2010, ఆగస్టు 28వ తేదీన బషీర్‌బాగ్‌లో పెద్ద ఎత్తున ఉద్య మం చేసింది. ఈ ఉద్యమంలో పాల్గొన్న రైతులపై నాటి ప్రభుత్వం కాల్పులు జరిపింది. తత్ఫలితంగా ఎం తోమంది రైతన్నలు తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర తప్పిదాన్ని తన కండ్లతో చూస్తూ పార్టీలో కానీ, పదవిలో కానీ కొనసాగలేనని నిర్ణయించుకున్న కల్వకుంట్ల చం ద్రశేఖర్‌రావు (కేసీఆర్) సీమాంధ్ర ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించారు. తన డిప్యూటీ స్పీకర్ పదవితో పాటు, టీడీపీకి రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి బయటికి వచ్చారు. ఆ తర్వాత 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే.
అలుపెరుగని తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన, రాష్ట్ర ఆవిర్భావ అనంతరం కేసీఆర్ మొదట దృష్టిపెట్టింది కరెంటు మీదనే. అందుకే విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి ఎదిగింది. అంతేకాదు, వ్యవసాయంతో పాటు, హైదరాబాద్ లాంటి మహా నగరంలో కూడా 24 గంటల కరెంటు ఇచ్చిన చరిత్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. ఇలా ఒక్క విద్యుత్ రంగమే కాదు, అన్నిరంగాల్లోనూ అభివృద్ధి చెందిన తెలంగాణపై కాంగ్రెస్ పాలకుల కన్నుపడింది. రాష్ట్రంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం డిస్కంలను అడ్డుపెట్టుకొని కరెంటును వ్యాపారంగా మార్చితే లాభాలు వస్తాయనే ముందస్తు ప్రణాళికతో ఈఆర్సీకి ప్రతిపాదనలు పెట్టింది. రాష్ట్ర ప్రగతికి అంతరాయం కలుగకుండా చూడవలసిన బాధ్యత ఈఆర్సీపై ఉన్నది. అందుకే, ఈ వ్యాసకర్త అయిన నేను ప్రభుత్వ ప్రతిపాదనలను మన్నించవద్దనే వాదనలను ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు ముందు బలంగా వినిపించాను.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి కేవలం 7 వేల మెగావాట్ల విద్యుత్ ఉంటే దాన్ని 24 వేల పైచిలుకు మెగావాట్ల సామర్థ్యానికి పెంచిన ఘనత కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. అంతేకాదు, ట్రాన్స్మిషన్ లైన్లతో పాటు లక్షలాది ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటుచేసింది. వేల సంఖ్యలో సబ్స్టేషన్లను నిర్మించింది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి, పరిశ్రమలకు, గృహాలకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసింది. అలవికానీ హామీలతో, పుట్టెడు అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్‌ను వ్యాపారంగా మార్చి, వినియోగదారుల నుంచి అధిక చార్జీలు వసూలు చేయాలనే పన్నాగాన్ని పన్నుతున్నది. ఈ ప్రయత్నాన్ని నిలువరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అభివృద్ధి దిశగా సాగుతున్న తెలంగాణను విచ్ఛిన్నం చేయకుండా కాపాడుకుపోవాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.