తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. ఈ కాలంలో ఏం సాధించిందీ ప్రభుత్వం? ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చింది? చేసింది ఎంత? చెప్పుకొన్నది ఎంత? ఏడాది పాలన ఎట్లా సాగిందో ఓ సారి చూద్దాం.
ఎన్నికలకు ముందు మెరిపిస్తామని మురిపించారు. కానీ, ఇప్పుడు ఏడిపిస్తున్నరు. ఇది స్థూలంగా కాంగ్రెస్ ఏడాది పాలన. ఈ ఏడాది పాలనకు వారు ప్రజాపాలన విజయోత్సవాలు అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. ఇన్నేండ్ల తర్వాత ఇప్పుడే ప్రజాస్వామ్యం వచ్చినట్టు.. ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడినట్టు కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. ఏ పేరు పెట్టి ఉత్సవాలు చేసుకున్నా.. ప్రజలు ఈ పాలనను హర్షిస్తున్నారా? లేక విమర్శిస్తున్నారా? అనేది కూడా అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతి సందర్భంలో ఓ నెరేషన్‌ను బిల్డప్ చేసి ప్రజల మీద రుద్దుతున్నారు కాంగ్రెస్ పాలకులు. ముఖ్యమంత్రి నుంచి మొదలుపెడితే మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందిరిదీ అదే వరుస.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉచిత బస్సు పథకం మాత్రమే అమలు చేశారు. ఆ తర్వాత మిగతా వాటి ఊసే లేదు. ఇతరుల చెప్పుల్లో కాళ్లు పెట్టి ‘ఇగో ఈ బ్రాండెడ్ చెప్పులు మావే’ అని చెప్పుకున్నట్టు ఉంది వీళ్ల వ్యవహారం. గత ప్రభుత్వ హయాంలో సాగుతో పాటు ఇతర రంగాలు, వృత్తులు ఎలా వృద్ధి చెందాయో మనకు తెలిసిందే. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వృత్తులు, ఉపాధి మార్గాల గురించిన పట్టింపే లేదు. విద్యారంగం గురించిన సోయి లేదు. నోరు తెరిస్తే చాలు మేడిగడ్డ కుంగింది.. కరెంట్ కొనుగోళ్లకు భారీగా ఖర్చుపెట్టారని అంటున్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించకుండా ఉంటే ఈ ఏడాది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధ్యపడేదా? గత ప్రభుత్వం విజయవంతంగా అమలుచేసిన పథకాలు, కార్యక్రమాల నిర్వహణ కూడా ఈ పాలకులకు చేతకావడం లేదు. అందుకే రాష్ట్రంలో నిత్యం కోతల కరెంట్ వస్తున్నది. రైతుబంధు ఇంకా అందలేదు. గత ప్రభుత్వం నిర్మించిన థర్మల్ పవర్ ప్రాజెక్టులను అట్టహాసంగా ప్రారంభిస్తూ అప్పులు.. అప్పులు అని గావుకేకలు పెట్టడం ఎందుకు?
ఎదుటివారి తప్పును ఎత్తిచూపే ముందు తమ తప్పు ఏమిటో కూడా తెలుసుకోవాలి. గత ప్రభుత్వం లక్షల కోట్ల విలువ చేసే సంపదను సృష్టించింది. భవిష్యత్తు తరాలకు భరోసా ఇచ్చింది. ఏం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేసింది? ఆ మొత్తాన్ని వేటిపై ఖర్చు పెట్టింది? ఏ సంపద సృష్టించేందుకు బాటలు వేసింది? ఒక్క ఏడాదిలోనే అన్నీ సాధ్యం కావు. అవుతుందని, అవ్వాలని కూడా ఎవరూ అనడం లేదు. వాస్తవాలను గుర్తించకుండా, ప్రజలకు వాస్తవాలు తెలియకుండా చేయాలనుకోవడం తప్పు. అయితే అనుభవం ద్వారా ప్రజలకు వాస్తవాలు అవగతంలోకి వస్తాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం మర్చిపోయినట్టుంది.
2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే చెరువుల పూడికతీతకు పూనుకున్నది. ప్రతి ఇంటికీ తాగునీరు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. క్షణం కూడా కరెంట్ పోకుండా చర్యలు తీసుకున్నది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింతగా పెంచేందుకు ప్రణాళికలు రచించింది. 2014-15 బడ్జెట్‌ను చూస్తే నాటి ప్రభుత్వ వాస్తవిక దూరదృష్టి అర్థమవుతుంది.
కానీ, ఈ ప్రభుత్వం మాత్రం వచ్చిన వెంటనే శ్వేతపత్రాల పేరిట ప్రజలను ఏమార్చే పనిని పెట్టుకున్నది. విద్య, వైద్యం, సాగు, తాగునీటి రంగాల విషయంలో నాటి ప్రభుత్వం సాధించిన విజయాల గురించి కేంద్రప్రభుత్వం, కేంద్ర సంస్థలు చాలాసార్లు ప్రస్తావించాయి. కాంగ్రెస్ నాయకులు కూడా పొగిడిన సందర్భాలున్నాయి. లాజికల్‌గా మాట్లాడుతూ తాము విపక్ష ఆరోపణలను తిప్పికొడుతున్నామని అనుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఇప్పటికీ రైతు భరోసా ఇవ్వలేదు. కౌలురైతుల గురించి సోయి లేదు. రైతుకూలీల ప్రస్తావన లేదు. తెలంగాణ విధ్వంసం తప్ప పునాదులను బలపర్చాలనే భావన పాలకుల్లో ఏ మాత్రం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.
తొలి ఏడాది పాలన తీరు వచ్చే నాలుగేండ్లలో ఎట్లా ఉండబోతున్నదో కండ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఈ ఏడాది కాలంలో ఒక్కటంటే ఒక్క అడుగు కూడా అభివృద్ధి దిశగా పడలేదు. రాబోయే కాలంలో ఆ దిశగా పడుతుందనే భరోసా కూడా లేదు. అప్పుల్లో ఉన్నామని, తమ వద్ద నిధులు లేవని పదే పదే చెప్తున్నారు. మన కంటే బీద రాష్ర్టాలు ఇన్ని మార్లు అప్పుల గురించి చెప్పుకోవడం లేదు. కానీ, కాంగ్రెస్ నాయకులు మాత్రం దాన్నో మంత్రంలా పఠిస్తున్నారు. పాఠంలా వల్లె వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు తమపై పెట్టిన బాధ్యతను గుర్తించడం లేదు. ఏడాది పాలన సాంతం ఏడ్చిన కన్ను తూడ్చినట్టే తప్ప కొత్తగా ఏమీ లేదు.
తమను నమ్మి ఓట్లు వేసిన గ్రామాలను కాంగ్రెస్ గాలికొదిలేసింది. పాలమూరు వలసల వార్తలు మళ్లీ కనిపిస్తున్నాయి. కరెంట్ కోతలు, విత్తనాలు, ఎరువులు అందక రైతులు పడుతున్న ఇబ్బందుల వార్తలు పతాక శీర్షికలకెక్కుతున్నాయి. ఇప్పటికైనా పాలకులు తమ తప్పులను సరిద్దుకుని ముందుకు సాగితే వారికే మంచిది. అస్తమానం గత ప్రభుత్వంపై నిందలేస్తూ కాలం గడిపితే ఏదో ఒక రోజు ప్రజలు తిరగబడతారు.