మోసం, దగా, వంచన అనే మాటలకు కాంగ్రెస్ మారుపేరుగా నిలుస్తున్నది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీ ఇందుకు ఓ ప్రముఖ ఉదాహరణ అని చెప్పాలి. నేపాళ మాంత్రికుని తరహాలో గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అన్నివర్గాలకూ రకరకాల హామీలు గుప్పించింది. ఈ పరంపరలో బీసీలకు ఇచ్చిన టోకరా ప్రముఖంగా నిలుస్తుందనేది తిరుగులేని సత్యం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌తో బీసీలపై కుట్రకు బీజం పడింది. ఇది సాధ్యాసాధ్యాలు చూసుకోకుండా ఇచ్చిన హామీ కానేకాదు. అన్నీ తెలిసి, ‘ఇచ్చేదా చచ్చేదా’ అనే రీతిలో దీనిని ముందు పెట్టుకుని బీసీలను మోసం చేసింది.
స్థానిక సంస్థల్లో 42 శాతం పేరిట తీర్మానాలు, ఆర్డినెన్సులు, జీవోలంటూ వేస్తున్న కుప్పిగంతులే ఇందుకు నిదర్శనం. కాపురం చేసే లక్షణం కాలు మోపిన నాడే తెలుస్తుందన్నట్టుగా బీసీ కోటా పెంపుపై డెడికేటెడ్ కమిషన్ వేయకుండానే ముందుకు సాగాలని తీసుకున్న నిర్ణయంతోనే కాంగ్రెస్ ఏమి చేయబోతున్నదో తేలిపోయింది. కాంగ్రెస్‌కు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదని ఈ తొలి అడుగే రుజువు చేసింది. హైకోర్టు అక్షింతలతో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసినా తూతూమంత్రంగా కులగణన జరపడం మరో కుట్ర. ఆపై జరిపిన శాసన ప్రక్రియ అంతా ఓ పెద్ద ప్రహసనమే. ‘రానూ వస్తా.. కాకుండా జేస్తా’ అన్న తీరుగానే ఇదంతా జరుగుతున్నది. తొలుత మార్చిలో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు బిల్లు ప్రవేశపెట్టి, అసెంబ్లీ ఆమోదంతో గవర్నర్‌కు పంపారు. ఆయన దానిని రాష్ట్రపతి పరిశీలనకు పంపారు.
ఆ తర్వాత గత జూలైలో ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్‌కు పంపారు. ఆగస్టులో రిజర్వేషన్ల సీలింగ్‌ను ఎత్తివేస్తూ పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేశారు. వీటిపై రాష్ట్రపతి నిర్ణయం పెండింగ్‌లో ఉండగానే జీవో తెచ్చారు. ఇలా అష్టొంకర్లుగా కాంగ్రెస్ సర్కారు ఈ తమాషాను కొనసాగిస్తూనే ఉన్నది. ఇప్పుడు న్యాయవివాదాలతో ఈ రిజర్వేషన్లు ముందుకు కదలని పరిస్థితి వచ్చింది. హైకోర్టు స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. బీసీలను నట్టేట ముంచడమనే కాంగ్రెస్ కుట్ర దీనితో పరాకాష్టకు చేరుకున్నది.
ఇవేవీ అనూహ్యమైన పరిణామాలు కావు. సుప్రీంకోర్టు 50 శాతం పరిమితి గురించి ఇప్పుడు కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దానిని అధిగమించేందుకు తమిళనాడు అనుసరించిన మార్గమూ కండ్లముందరే ఉన్నది. సుప్రీంకోర్టు పరిమితిని దాటి 69 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వంపై తమిళనాడు సీఎం జయలలిత ఒత్తిడి తెచ్చారు. న్యాయస్థానాల పరిశీలన పరిధిలోకి రాకుండా తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించారు. రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ర్టాలకున్నప్పటికీ అది సుప్రీం విధించిన పరిమితికి లోబడే జరగాలి. ఆ పరిమితిని అధిగమించాలంటే ఒక్కటే మార్గం. కేంద్రం తన వంతుగా తొమ్మిదో షెడ్యూల్లో చేరిస్తే సరిపోతుంది. కేంద్రంలో అధికార పక్షమైన బీజేపీ, ప్రతిపక్షమైన కాంగ్రెస్ తలచుకుంటే అది ఎంతలో పని! ఇక్కడే కాంగ్రెస్, బీజేపీ అసలు రంగులు బయటపడుతున్నాయి. కాంగ్రెస్ అరకొర విధానాలు అనుసరిస్తూ పోతే అందులో తప్పులు వెదికే పనికి బీజేపీ పరిమితమైంది. దొందూ దొందే అన్నట్టుగా రెండు పార్టీలూ బీసీ రిజర్వేషన్లతో చెలగాటమాడుతున్నాయి.
మండల్ నివేదికను అటకెక్కించి బీసీలకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్, సుదీర్ఘకాలం దేశాన్ని పరిపాలించినప్పుడు బీసీల గురించి పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీసీ మంత్రం జపిస్తున్నది. బీసీలకు దామాషా ప్రాతినిధ్యం కల్పించడం గురించి ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ తాజాగా చేసిన మోసాన్ని గ్రహించి బీసీలు ఉద్యమబాట పట్టారు. బూటకపు హామీ ఇచ్చి, ఆపై నాటకాలతో కాలక్షేపం చేయడం ఇకపై సాగదని బీసీలు గళమెత్తుతున్నారు. బీసీ సంఘాలు నిర్వహించిన తెలంగాణ బంద్ విజయవంతం కావడం కాంగ్రెస్‌కు ఓ హెచ్చరిక!