భారతదేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలను అడుగడుగునా మోసం చేసింది. ప్రతి సందర్భంలోనూ బీసీ వ్యతిరేకతను చాటుకున్నది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణచివేసింది తప్పితే ఏనాడూ బీసీల ఉద్ధరణకు పూనుకున్న సందర్భాలు లేవు. రాజ్యాంగ రచనా కాలం మొదలు బీసీ రిజర్వేషన్ల సమయం, నిన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు బీసీల ప్రాతినిధ్యాన్ని చట్టసభల్లో కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ వివక్ష చూపింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ఉదయపూర్ డిక్లరేషన్ చేసింది. ప్రతి పార్లమెంట్ స్థానానికి బీసీలకు రెండు అసెంబ్లీ టికెట్లు కేటాయిస్తామని ప్రకటించింది. ఈ లెక్క ప్రకారం బీసీలకు 34 టికెట్లు ఇవ్వాలి. కానీ, 21 సీట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నది. అందులో కొన్ని సీట్లు ఓడిపోయే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఇచ్చింది. ఉదారవాద విధానాలను అవలంబిస్తున్నామని చెప్పుకొన్న కాంగ్రెస్ పార్టీ అగ్రకులాలకు ప్రభుత్వ పదవులు మొదలు పార్టీ అధ్యక్ష, పీసీసీ పదవులను కట్టబెట్టి, బీసీ నాయకత్వాన్ని ఎదగకుండా తొక్కిపెట్టింది. జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, నేటి రాహుల్‌గాంధీ వరకు బీసీలను తమ ఓటు బ్యాంకుగా వాడుకున్నారే కానీ బీసీల రాజకీయ, ఆర్థిక స్వావలంబన గురించి శ్రద్ధ చూపలేకపోయారు. దళితులకు సంక్షేమ పథకాల్లో కొంత మేర న్యాయం చేసి, దేశ జనాభాలో 52 శాతం ఉన్న బీసీలను అత్యంత దుర్మార్గంగా అణచివేసింది కాంగ్రెస్ పార్టీ.
బీసీ రిజర్వేషన్ల విషయంలో తమిళనాడులో చేసిన పెరియార్ ఉద్యమం వల్ల భారత రాజ్యాంగానికి మొదటి సవరణ జరిగింది. ఆ తర్వాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజీనామాతో రాజకీయ ఒత్తిడి మేరకు బ్రాహ్మణుడైన కాకా కాలేల్కర్ ఆధ్వర్యంలో మొదటి కమిషన్ ఏర్పాటైంది. ఆ కమిషన్ సిఫారసు అమలుచేయడంలో చిత్తశుద్ధిని చూపకపోగా, వాటిని కాంగ్రెస్ అణగతొక్కింది. ఆ తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ బీసీల కోసం కొత్త కమిషన్ వేయలేదు, ఉన్న కమిషన్ సిఫారసులను పట్టించుకోలేదు. మారోజు వీరన్న మాటల్లో చెప్పాలంటే.. బీ(బ్రాహ్మణ) హెచ్(హరిజన) ఏ(ఆదివాసీ) ఎం(మైనార్టీ) పాలసీని అనుసరిస్తూ సంక్షేమ పథకాలు అమలుచేయడంలో బీసీలకు మొండిచేయి చూపింది.
ఇందిరాగాంధీ మరణానంతరం అధికారం చేపట్టిన రాజీవ్‌గాంధీ మండల్ కమిషన్ అంశాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా వీపీ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు చారిత్రాత్మకమైన మండల కమిషన్ అమలును ప్రకటించినప్పుడు ప్రతిపక్ష హోదాలో రాజీవ్‌గాంధీ దాదాపు రెండున్నర గంటల పాటు పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్లపై విషం కక్కాడు. రాజీవ్‌గాంధీ తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలుచేయాలని కొంత ప్రయత్నం చేసినా సుప్రీంకోర్టు ఆయన నిర్ణయాన్ని కొట్టివేసింది. రిజర్వేషన్లను అమలుచేయడంలో కాంగ్రెస్ నిర్లక్ష్య ధోరణి కారణంగా దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా కేంద్ర, రాష్ట్ర పరిధిలోని ఉద్యోగాల్లో బీసీలు పెద్ద ఎత్తున నష్టపోయారు. కొన్ని లక్షల ఉద్యోగాలు కోల్పోయారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ కులగణన ప్రక్రియను పూర్తిచేసి బహిర్గతపర్చలేదు. ఈ విషయంలో రాహుల్‌గాంధీ ఆసక్తి చూపడం లేదంటేనే బీసీల పట్ల ఆయన వైఖరి నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించినట్టు ఉందనేది సుస్పష్టం.
ఏపీ, తెలంగాణలో ఇప్పటివరకు బ్రాహ్మణ, వైశ్య, వెలమ, రెడ్డితోపాటు దళితులకు ముఖ్యమంత్రి అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. కేవలం ఒక్క రెడ్డి సామాజిక వర్గానికే 17 సార్లు ముఖ్యమంత్రి అవకాశం కల్పించింది. కానీ, ఒక్కసారి కూడా బీసీలకు అవకాశం కల్పించలేదు. 2023లో తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్లీ రెడ్డి సామాజికవర్గానికి చెందిన రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసి, దళితుడిని ఉప ముఖ్యమంత్రిని చేసి బీసీలకు నామమాత్రంగా రెండు మంత్రి పదవులను కట్టబెట్టింది. ఇవన్నీ గమనిస్తే కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల వివక్ష, నిర్లక్ష్యవైఖరి ఉన్నట్టు స్పష్టమవుతున్నది.
సామాజిక న్యాయం, బీసీ కులగణన పేరిట దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న రాహుల్‌గాంధీ కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో పదవుల పంపకంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఎందుకు నోరు మెదపడం లేదు. 2016, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కులగణన చేయించారు. ఈ లెక్కలు బహిరంగపరుస్తామని ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీలోని అగ్రకులాలు అడ్డుకుంటున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ కులగణన ప్రక్రియను పూర్తిచేసి బహిర్గతపర్చలేదు. ఈ విషయంలో రాహుల్‌గాంధీ ఆసక్తి చూపడం లేదంటేనే బీసీల పట్ల ఆయన వైఖరి నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించినట్టు ఉందనేది సుస్పష్టం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కనీసం 9 సీట్లయినా బీసీలకు కేటాయించాలి. అప్పుడే సామాజిక న్యాయం చేసినట్టవుతుంది.
– నక్క మహేశ్‌యాదవ్ 90143 84440