దేశాన్ని, వివిధ రాష్ర్టాలను అత్యధిక కాలం పాలించిన పార్టీ కాంగ్రెస్. ఆ పార్టీ నేతలకే గనుక చిత్తశుద్ధి ఉండి ఉంటే దళిత సమాజం ఎప్పుడో బాగుపడేది. కేవలం ఓట్ల కోసం దళిత నినాదాన్ని వినిపిస్తూ ఆచరణలో తీరని ద్రోహం చేసింది. దళిత సామాజికవర్గాల నుంచి ఎదిగివచ్చిన గొప్ప గొప్ప నాయకులను పైమెట్టుదాకా రానీయలేదు. అలంకారప్రాయమైన పదవులకే పరిమితం చేసింది. నాటి అంబేద్కర్ మొదలుకొని నేటి మల్లికార్జున ఖర్గే వరకు ఆ పార్టీ దళిత నాయకులను పావులుగా వాడుకున్నదే తప్ప, పాలకులుగా అవకాశం ఇయ్యలేదు. అందుకు దేశ చరిత్రలో చోటుచేసుకున్న ఉదంతాలు కోకొల్లలు.
ప్రపంచ స్థాయి మేధావిగా, న్యాయ కోవిదునిగా, రాజ్యాంగ నిర్మాతగా దేశం యావత్తు గౌరవించే బీఆర్ అంబేద్కర్ మహనీయునికి అడుగడుగునా అపచారం తలపెట్టిన చరిత్ర కాంగ్రెస్‌దే. భారత తొలి ప్రధాని నెహ్రూ క్యాబినెట్లో తొలి న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన అంబేద్కర్ పట్ల ప్రజల్లో నానాటికీ పెరుగుతున్న ఆదరణ చూసి, నెహ్రూ సహించలేకపోయారు. భారతీయ సమాజాన్ని లోతుగా అధ్యయనం చేసిన అనుభవంతో రాజ్యాంగ నిర్మాణ పరిజ్ఞానంతో అంబేద్కర్ రూపొందించిన హిందూ కోడ్ బిల్లును నెహ్రూ ఆమోదించలేదు. అందుకు నిరసనగా 1951 సెప్టెంబర్ 27న తన మంత్రి పదవికి అంబేద్కర్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి వైదొలిగారు. ఇంతకూ అంబేద్కర్ రూపొందించిన బిల్లులో అభ్యంతరకర అంశాలేవీ లేవు. మహిళలకు ఆస్తి హక్కు, విడాకుల హక్కు, బహు భార్యత్వ నిషేధం, కులాంతర వివాహాల గుర్తింపు, ఓబీసీ కమిషన్ ఏర్పాటు వంటి సమాజ శ్రేయోదాయకమైన ప్రతిపాదనలు ఉన్నాయి. 1951 అక్టోబర్- 1952 ఫిబ్రవరి మధ్యకాలంలో జరిగిన భారత సార్వత్రిక తొలి ఎన్నికల్లో అంబేద్కర్ తాను స్థాపించిన షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్ పార్టీ అభ్యర్థిగా బాంబే నార్త్ సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు. నెహ్రూ కూటనీతిని ప్రదర్శించి, అంబేద్కర్ అనుచరుడైన దళిత సామాజిక వర్గానికి చెందిన నారాయణ సరోబా కాజ్రోల్కర్ను రంగంలోకి దింపడమే కాకుండా, కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేసి అంబేద్కర్‌ను ఓడించారు. ఆ ఎన్నికల్లో అంబేద్కర్‌కు వ్యతిరేకంగా అభ్యర్థిని నిలుపబోమని తొలుత ప్రకటించిన కాంగ్రెస్ మాటతప్పి మోసం చేసింది. 1954లో మహారాష్ట్రలోని బండారా లోక్‌సభ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరిగినప్పుడు సైతం అంబేద్కర్‌కు పోటీగా కాంగ్రెస్ తమ అభ్యర్థి బోర్కర్‌ను రంగంలోకి దింపి అధికార బలంతో ఓడించగలిగింది.
లోక్‌సభలో ప్రవేశించాలన్న అంబేద్కర్ కల నెరవేరకుండానే 1956లో దివంగతులయ్యారు. ఆ తర్వాత 30 ఏండ్లపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. అంబేద్కర్‌ను ఓడించిన కాజ్రోల్కర్కు 1970లో పద్మభూషణ్ పురస్కారాన్ని ఇచ్చింది. కానీ అంబేద్కర్‌ను గుర్తించనే లేదు. నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చి వీపీ సింగ్ ప్రధాని అయ్యాక, 1990లో అంబేద్కర్‌కు భారతరత్న పురస్కారం ఇచ్చి సత్కరించింది. అప్పుడే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అంబేద్కర్ నిలువెత్తు చిత్రపటం కొలువుతీరింది.
1936 నుంచి 1986లో దివంగతులయ్యేంత వరకు 50 ఏండ్లపాటు అప్రతిహతంగా పార్లమెంటుకు ఎన్నికవుతూ వచ్చిన జగ్జీవన్ రామ్‌కు కూడా సొంత కాంగ్రెస్‌లో అవమానాలు తప్పలేదు. 1971లో జరిగిన యుద్ధంలో భారత్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోయి తూర్పు పాకిస్థాన్ ప్రాంతాన్ని కోల్పోవడం అదే బంగ్లాదేశ్‌గా ఏర్పడడంలో ఇందిరాగాంధీ పాత్ర ఎంత ఉన్నదో నాటి రక్షణ మంత్రిగా జగ్జీవన్‌రామ్ పాత్ర అంతే ఉన్నది. కానీ ఆ కీర్తిని ఇందిరాగాంధీ సొంతం చేసుకున్నారు. 1975లో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు ఆమె స్థానంలో ప్రధానిగా సీనియర్ మంత్రి జగ్జీవన్‌రామ్ బాధ్యతలు చేపట్టాల్సింది. కానీ ఇందిరాగాంధీ తన పదవిని వదులుకోలేదు సరి కదా, జగ్జీవన్‌రామ్ చుట్టూ పొగ పెట్టి పార్టీ నుంచి వెళ్లిపోయేదాకా వెంటపడ్డారు.
అంతదాకా ఎందుకు..? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దళితనేత దామోదరం సంజీవయ్య కాంగ్రెస్ చేతిలో తీవ్ర వంచనకు గురై ముఖ్యమంత్రి పదవిని నిలుపుకోలేకపోయారు. సమైక్య రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి కాగా, మలి ముఖ్యమంత్రిగా సంజీవయ్య 38 ఏండ్ల ప్రాయంలోనే 1960లో ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికే రాజాజీ, టంగుటూరి ప్రకాశం, బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి మంత్రివర్గాల్లో పనిచేసిన అనుభవమున్న సంజీవయ్య ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేశారు. 27% బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, పేదలకు ఆరు లక్షల ఎకరాల భూమి పంపిణీ, వృద్ధాప్య పెన్షన్లు వంటి విప్లవాత్మక సంస్కరణలకు రూపకల్పన చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం సొంత పార్టీకి చెందిన ఒక బలమైన సామాజికవర్గం నేతల నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. సంజీవయ్య నాయకత్వంలో కాంగ్రెస్ 1962 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. కానీ సంజీవయ్యకు మళ్లీ ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. సంజీవరెడ్డి ఎగరేసుకుపోయారు. ఆ తర్వాత 40 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో డజన్‌కు పైగా ముఖ్యమంత్రులు కొలువు తీరారు. వారిలో దళిత ముఖ్యమంత్రి ఎవరూ లేరు.
దేశ రాజకీయ చరిత్రలో కాంగ్రెస్ ముఖ్యమంత్రుల జాబితా వందల్లో ఉంటుంది. కానీ కేవలం ఐదుగురు మాత్రమే కాంగ్రెస్ దళిత ముఖ్యమంత్రులంటే ఆశ్చర్యం కలుగకమానదు. కాంగ్రెస్‌కు చెందిన భోలా పాశ్వాన్ బీహార్ తొలి దళిత ముఖ్యమంత్రిగా కేవలం నాలుగు నెలలు, జగన్నాథ్ పహాడియా రాజస్థాన్ తొలి దళిత ముఖ్యమంత్రిగా 13 నెలలు, సుశీల్ కుమార్ షిండే మహారాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రిగా 22 నెలలు, చరణ్‌జీత్‌సింగ్ చన్నీ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఆరు నెలలు మాత్రమే పరిపాలించారు. సంజీవయ్యలాగే ఈ నలుగురు ముఖ్యమంత్రులెవరూ పూర్తి కాలం పాలించలేదు. కాంగ్రెస్ పాలించనీయలేదు.
1998లో సోనియాగాంధీకి ఏఐసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టడం కోసం బలహీన వర్గాలకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, కాంగ్రెస్ సీనియర్ నేత సీతారామ్ కేసరిని ఆ పదవి నుంచి అవమానకరంగా తప్పించారు. ఆ వృద్ధనేతపై ఏఐసీసీ కార్యాలయంలోనే దాడికి ఎగబడ్డారు. రాష్ట్ర కాంగ్రెస్ అధికార చరిత్రపుటల్లో నెత్తుటి అధ్యాయం 1991 నాటి చుండూరు మారణకాండలో ప్రాణాలు కోల్పోయిన దళిత సోదరుల రక్తం మరకలు ఇంకా గాంధీ భవన్ గోడలకు అంటుకునే ఉన్నాయి.
సమైక్య రాష్ట్రంలో 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పటికే లోక్‌సభ సభ్యుడిగా జాతీయస్థాయి పార్టీ వ్యవహారాల పర్యవేక్షకుడిగా ప్రధాని రాజీవ్‌గాంధీకి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన దళిత నేత మల్లు అనంతరాములు అప్పుడు ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావించారు. కానీ అది జరుగలేదు. ఆయన సోదరుడు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉన్న మల్లు భట్టివిక్రమార్క తొలుత శాసనమండలికి అనంతరం వరుసగా నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికైన ఓటమి ఎరుగని నేత. కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావించారు. కానీ రేవంత్‌రెడ్డి ఇలా వచ్చి అలా పదవిని చేజిక్కించుకున్నారు. దళితుల పట్ల కాంగ్రెస్ మార్క్ కపట రాజకీయాలు ఒకటా రెండా ఇలా ఎన్నని చెప్పగలం?