వాస్తవానికి సామాన్యుల మెదళ్లకు మేధావులే విజ్ఞానం, వివేచన, తర్కం, సత్యాన్వేషణ రూపాలలో మేతను అందించాలి. కానీ, సమాజ పరిణామ క్రమంలో ఇది ఒకోసారి గతి తప్పుతుంది. ఎందుకు తప్పుతుందనేది ఆలోచనకు అందని విషయమేమీ కాదు. అట్లా గతి తప్పినపుడు తమ వైపు నుంచి సామాన్యులే మేధావుల మెదళ్లకు మేతను అందించవలసి వస్తుంది. అటువంటి ఒక ప్రయత్నాన్ని ఇక్కడ తెలంగాణలోని కొందరు మేధావుల బృందం కోసం చేద్దాము. దానితో పాటు పైన అనుకున్నట్టు, వారి మేధో బాధ్యతల క్రమం ఎందువల్ల గతి తప్పింది? ఆ స్థితి నుంచి వారు బయటకు రావటం ఎట్లా? అనే విషయాలు కూడా విచారిద్దాము.
ప్రస్తుతం చర్చిస్తున్న విషయం బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ పెద్ద ఎత్తున అప్పుల పాలైందనే ఆరోపణ గురించి. ఈ ఆరోపణ కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు చేసే ప్రచారపు హోరు వల్ల ప్రజలు కొంత నమ్మవచ్చు. కానీ, దానికి విలువ అనదగ్గది ఉండదు. అటువంటి ఆరోపణ వాస్తవం అయి, లెక్కల ప్రకారం కూడా నిజమని తేలితే మాత్రం తప్పక విలువ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఆ విధమైన ప్రచారంలోని వాస్తవాలను, లెక్కలను పరిశీలించి సామాన్య ప్రజలకు తెలియజేయవలసింది ఎవరు? మేధావులు. అప్పుల గురించిన ప్రచారంపై వారు అటువంటి బాధ్యతను నిర్వర్తించారా? లేక ఎటువంటి పరిశీలనలు చేయక ఆ ప్రచారంలో గొంతు కలిపారా? అట్లా గొంతు కలిపే క్రమంలో వాస్తవాలను ఆయా పార్టీలతో పాటు తాము కూడా తొక్కిపెట్టారా? వీటితో పాటు మరికొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి గాని వాటిని తర్వాత వేసుకుందాము.
ఇప్పుడు అప్పుల విషయానికి వద్దాము. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులెన్ని అనేదానికి పలువురు పలుమార్లు పలు లెక్కలు చెప్పారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ స్వయంగా తానే వేర్వేరు లెక్కలు చెప్పింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని, అధికారానికి వచ్చిన తర్వాత కొన్ని. అప్పులనేవి అటు ఇటు మారే అంకెలు కావు. అవి ఎంతైనా కావచ్చు గాని నికరంగా ఉంటాయి. అటువంటప్పుడు ఇన్నిన్ని విధాలైన అంకెలు ప్రచారంలోకి తెచ్చారంటే, వాస్తవం ఏమిటో ఎవరికీ తెలియదన్నమాట. లేదా తెలిసినప్పటికీ అసత్యాలు ప్రచారం చేసారనుకోవాలి. కానీ మేధావులు ఏం చేశారన్నది ప్రస్తుత ప్రశ్న. వారు ఏమి చేశారో ప్రజలు ఎన్నికలకు ముందు చూశారు, ఎన్నికల సమయంలో చూశారు, ఇప్పటికీ చూస్తున్నారు. వారు ఆ విధంగా ఎందుకు వ్యవహరించారన్నది అర్థం చేసుకోవలసిన విషయం.
ప్రతిపక్షాల లెక్కలు నిజం కాదని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చాలాసార్లు అంకెల సాయంతో వివరించింది. అయినప్పటికీ, వారు వారి లెక్కలే చెప్తుంటారని భావించి వదిలివేస్తే వేయవచ్చు. అందుకు ప్రజలను తప్పు పట్టలేము. ఎందుకంటే వారు మొదటినుంచి ప్రభుత్వాల అబద్ధాలు విని విని విసుగెత్తిపోయి ఉన్నారు. కానీ, బీఆర్ఎస్ చెప్తున్నది నిజమేనని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, దాని ఆధ్వర్యాన గల వివిధ సంస్థలు కూడా ధృవీకరిస్తే? ఆ లెక్కలను జాతీయ సగటుతో, ఇతర రాష్ర్టాలతో, ఉమ్మడి ఏపీ స్థితితో పోల్చి చూపితే? తెచ్చిన అప్పులతో పెంచిన సంపదలు ఎంతో, సాధించిన అభివృద్ధి ఏమిటో, అంతిమంగా ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడ్డాయో అవే కేంద్ర నివేదికలు వివరించి చెప్పితే? అప్పులు చేయటం కాదు, ఆ నిధులను ఎందుకోసం ఖర్చుచేశారనేది ముఖ్యమని ఆర్థికవేత్తలు అంటుంటే? ఈ సమాచారం, గణాంకాలు మేధావుల మెదళ్లకు మేత కానక్కరలేదా? మామూలుగానైతే కావాలి. కాని కాలేదు. ఎందుకు కాలేదన్నది తెలియవలసిన విషయం.
అప్పులు, అభివృద్ధి, ఆస్తుల కల్పనపై అనేక నివేదికలున్నాయి గాని ఇక్కడ కొన్నింటిని మాత్రం చూద్దాము. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు (2023) కొద్ది ముందు రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన హ్యాండ్‌బుక్ ప్రకారం, తలసరి నికర ఉత్పత్తి (పెర్ క్యాపిటా నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్)లో తెలంగాణ బీఆర్ఎస్ పదేళ్ల పాలన ముగిసిన 2022-23వ సంవత్సరం నాటికి మొత్తం దేశంలోనే మొదటి స్థానానికి చేరింది. అన్ని రాష్ర్టాలను మించిపోయింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో 190 శాతం వృద్ధిని సాధించి, తనకన్న ముందుండిన 13 పెద్ద రాష్ర్టాలను వెనుకకు తోసింది. ప్రజల తలసరి ఆదాయంలో 2014-15లో రూ.1,24,104తో ఐదవ స్థానంలో ఉండగా, 2023-24 నాటికి రూ.3,47,299కి చేరి దేశంలో మొదటి స్థానాన్ని సాధించిందన్నది సామాజిక- ఆర్థిక సర్వే వెల్లడించిన వాస్తవం. అప్పుల మాటకు వస్తే, ఇతర రాష్ర్టాలతో పోల్చినప్పుడు 23.8 శాతంతో 10వ స్థానంలో మాత్రమే ఉంది. ఐఆర్బీఎం పరిమితులను ఎప్పుడూ దాటలేదు. విశేషమేమంటే, ఉప ముఖ్యమంత్రి అయిన ఆర్థిక మంత్రి ఒక వైపు ఈ సర్వేను ప్రవేశపెడుతూనే, మరొకవైపు అప్పులు రూ.75,577 కోట్ల నుంచి రూ.6 లక్షల 71 వేల కోట్లకు పెరిగాయని, కాని అభివృద్ధి ఆ ప్రకారం జరగలేదన్నారు. ఆ లెక్క తప్పని రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించాయి. అయినా ఆ మాట రాజకీయ నాయకుడు అనటంలో విశేషం లేదు. కానీ, మేధావులుగా ప్రచారం పొందుతున్నవారు ఏ విధమైన సొంత పరిశీలన లేకుండా అదే ప్రచారాన్ని వల్లె వేశారు. ఎందుకన్నది తెలియాల్సిన విషయం. పోతే, ఎన్నికలకు రెండు నెలల ముందు సెప్టెంబర్‌లో కేంద్రం విడుదల చేసిన గణాంకాలు చెప్పిన దానిని బట్టి, 2023-24లో గ్రోస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ వృద్ధి లెక్కలలో 9.2 శాతంతో పెద్ద రాష్ర్టాలలో తెలంగాణ మొత్తం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
యథాతథంగా అప్పుల విషయమై రిజర్వ్ బ్యాంక్ తన 2024వ సంవత్సరపు హ్యాండ్‌బుక్‌లో ఏమి చెప్పిందో చూద్దాము. అప్పులన్నది బీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలకు, వాటికి తీసిపోకుండా మన మేధావులకు ఒక పెద్ద ఫేవరేట్ ప్రచారాంశంగా మారటం తెలిసిందే. వారి లెక్కలు ఐదు నుంచి ఎనిమిది లక్షల వరకు గాలిపటాల వలె ఎగురుతూ పోయాయి. ఇప్పటికీ ఎగురుతున్నాయి. కొందరు మేధావి మహాశయులైతే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ రథాలకు జెండాలు ఊపటంతో ఆగక, హామీలు ఎందుకు అమలు కావటం లేదని ప్రజలు ప్రశ్నిస్తే, గత ప్రభుత్వం చేసిన అప్పుల భారం కారణమంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వంతపాడారు. వారంతా ఈ ఆర్బీఐ లెక్కలను చూడాలి. బ్యాంక్ చెప్పింది గత ప్రభు త్వం పదేళ్లలో చేసిన రుణాలు రూ.3.17 లక్షల కోట్లు మాత్రమే. ఆ లెక్కలు చాలవనుకుంటే ఇదే 2025వ సంవత్సరం ఇదే ఆగస్టు నెల 11వ తేదీకి రండి. సాక్షాత్తూ లోక్‌సభలో బీజేపీకి చెందిన తెలంగాణ సభ్యుడొకరు ఈ విషయమై ప్రశ్న వేశారు. ప్రభుత్వం కూడా ఆ పార్టీదే. అందుకు ఆర్థిక సహాయమంత్రి ఇచ్చిన లిఖిత పూర్వక స మాధానం ‘కాగ్’ తాజా నివేదికను ఆధారం చేసుకుం టూ, ఆ సంఖ్య రూ.2.8 లక్షల కోట్లేనని స్పష్టం చేసింది.
ఈ విధంగా లెక్కలు చెప్పుకొంటూ పోవాలంటే మరెన్నయినా ఉన్నాయి. కానీ, లెక్కలనేవి ఎంత నిజాలైనా అట్లా పేర్చుకుంటూ పోతే పాఠకులకు విసుగేస్తుంది. కనుక ఇంతటితో ఆపుదాము. అదే సమయంలో ఈ తరహా మేధావుల బృందానికి కొన్ని ప్రశ్నలు వేయాలి. బీఆర్ఎస్ వ్యతిరేక పార్టీల అసత్య ప్రచారాలతో బుద్ధిపూర్వకంగా గొంతు కలిపి ప్రచారాలు చేసిన వీరు, పైన పేర్కొన్న నివేదికలను, అదే విధమైన ఇతర అధికారిక నివేదికలను గమనించారా? గమనించకపోయేందుకు అవి చీమలంత చిన్నవి కావు. పదేండ్లలో ఒకటి రెండుగా మాత్రమే వెలువడినవీ కావు. అయినప్పటికీ తమ దృష్టికి రాలేదని చెప్పదలచుకుంటే ఆ మాటలను నమ్మవలసిన అవసరం లేదు. కనుక, వాటిపై తమ అభిప్రాయాన్ని ఎన్నడూ వెల్లడించక మౌనం వహించిన ఆ పెద్దలు, ఇప్పటికైనా నోరు విప్పుతారా? ఒకవేళ ఆ లెక్కలు అన్నీ గాని, కొన్ని గాని తప్పని భావిస్తే ఆ వివరణలు కూడా ప్రజల దృష్టికి తేవచ్చు. ఆ విధంగా తమ మేధో నిజాయితీని, వ్యక్తిగత నిజాయితీని ప్రజలకు ప్రదర్శించాలి. లేనిపక్షంలో ఇంతకాలం అనుమానితులుగా మారిన వారిని అంతకుమించి సమాజం పట్ల దోషులుగా పరిగణించవలసి ఉంటుంది. అప్పుడు వారు మేధావులు అనబడే ఉత్కృష్ఠ స్థానం నుంచి తమను తామే బహష్కరించుకుంటారు.
కొందరు మేధావులు ఈ విధంగా వ్యవహరించటానికి కారణం ఏమిటనే ప్రశ్న ఒకటి మొదట వేసుకున్నాము. అందుకు సమాధానం కనుగొనేందుకు ఇప్పుడు ప్రయత్నిద్దాము. కొందరు వ్యక్తిగత స్వార్థ కారణాలతో ఆ పని చేస్తుండవచ్చు గనుక, ఆ కారణాలు ఏవైనప్పటికీ వారిని వదిలివేద్దాము. ప్రజలకు కావలసింది వ్యక్తుల గురించి కన్న ఎక్కువగా ధోరణుల గురించి. ఆ ధోరణులు ఏమై ఉంటాయో అర్థం చేసుకోవాలి. ఆ విధంగా ఆలోచించినప్పుడు తోచేది బహుశా ఈ విధంగా ఉండవచ్చు. తెలంగాణ వంటి చరిత్ర, సమస్యలు, ఉద్యమాలు గల నేలపై చైతన్యాలు ఎక్కువ. ఆ కారణంగా పాలకులపై, పీడకులపై సాయుధ ఘర్షణలు సైతం చిన్నవి, పెద్దవి అనేకం జరిగాయి. చివరిగా అది నక్సలైట్ పోరాట రూపంలో కొన్ని దశాబ్దాల పాటు సాగి రెండు తరాలను ప్రభావితం చేసి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకునే సమయానికి బలహీనపడుతూ వచ్చింది. ఎన్ని త్యాగాలు జరిగినా సమస్యలు మాత్రం కొనసాగటంతో ఆ స్ఫూర్తి, ఘర్షణా స్వభావం కూడా కొనసాగాయి. ఆ తరాల వారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో ఒక లక్ష్యం సిద్ధించినట్టయితే భావించారు గాని, తదనంతర మార్పులు వేగంగా జరిగిపోవాలని కోరుకున్నారు.
కోరుకోవటం వారి పరిస్థితులను బట్టి సహజం. కానీ, వాస్తవిక పరిస్థితులను చూసినప్పుడు వారు కోరుకున్నంత వేగంగా మార్పు అన్నది అసహజం. దానితో ఆ రెండింటి మధ్య వైరుధ్యం తలెత్తింది. ఇక్కడనే కాదు. భారత స్వాతంత్య్రోద్యమాన్ని గాని, మొత్తం ప్రపంచంలో అదే తరహా ఉద్యమాల నుంచి మొదలుకొని విప్లవోద్యమాల వరకు గాని, ఇటువంటి వైరుధ్యం తలెత్తని చోటు బహుశా ఎక్కడా లేదు. కొత్త ప్రభుత్వాలు ఎంత చేసినా, ఆ వేగాన్ని అందుకోలేకపోవటంతో పాటు ప్రతి చోటా కొన్ని తడబాట్లకు గురై కొన్ని తప్పులు కూడా చేశాయి. ఇదే తెలంగాణలో కనిపించింది. ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకోలేనివి. కాని మేధావులైన వారు చేయవలసిందేమిటి? ఆ పని చేశారా?
తెలంగాణ మేధావులు కొన్ని దశాబ్దాల పాటు వివిధ వామపక్ష భావజాలాలతో ప్రభావితులయ్యారు. ఇటీవలి కాలానికి వచ్చేసరికి అన్నిరకాల వామపక్షాలు బలహీనపడగా వీరు కూడా గణనీయంగా బలహీనపడ్డారు. ఇది ఎట్లా ఉంటుందంటే, బలహీనపడినట్లు సాధారణ ప్రజలు నిజాయితీగా అంగీకరిస్తారు. కానీ, మేధావులు అనేవారికి నిజాయితీ తక్కువ, భేషజాలు ఎక్కువ. వారి మేధోస్థితి, మానసిక స్థితి ఆ విధంగా తయారై ఉంటాయి. దానితో కృత్రిమత, నటనలు వస్తాయి. అశక్తత ఆవరిస్తుంది. తమ వాస్తవిక స్థితులను అంగీకరించలేరు. అటువంటి పరిస్థితుల మధ్య తాము ఇప్పటికీ ఒకనాటి ప్రజాపక్షం వారమేనని, ఇప్పటికీ అంతే పట్టుదలగా పోరాడగలమని ప్రదర్శించుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇతరత్రా వాస్తవాలను గుర్తించనిరాకరిస్తారు. అట్లా నిరాకరించటం కూడా తమ గతకాలపు నిజాయతీకి, ప్రజాపక్ష వైఖరికి రుజువులనుకుంటారు. అట్లా చూపజూస్తారు. అన్ని లక్షణాలూ వారు తమకు తాము తెచ్చిపెట్టుకునేవే.
సరిగా అటువంటి దశలో, ఆ విధమైన స్వీయ మానసిక స్థితిలో ఈ మేధావి బృందాలకు బీఆర్ఎస్ ఒక ప్రజా వ్యతిరేకిగా, రాష్ర్టాన్ని ఎంతమాత్రం అభివృద్ధి చేయనిదిగా, అప్పుల కుప్పగా, అవినీతిమయమైనదిగా తోచసాగింది. ఆ తరహా ఆలోచనల మధ్య అణుమాత్రమైనా ఏ మంచీ కనిపించలేదు. స్వయంగా విప్లవం తేలేని వారు ఆ భంగపాటు మానసిక స్థితిలో గత కాలపు శత్రువును ప్రేమించినట్టు, తెలంగాణను ఫ్యూడల్ యుగంలో పీడించి ఉమ్మడి రాష్ట్రంలో పిప్పిచేసి, అటు విప్లవోద్యమాలనూ ఇటు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలను నిర్దాక్షిణ్యంగా అణచివేసి వేలమంది యువకులను చంపిన కాంగ్రెస్, ఈ మేధావి మహాశయులకు ఉన్నట్టుండి ప్రేమాస్పదమైంది. కనుక వారి అబద్ధాలకు తాము కూడా వ్యూహాత్మకంగా తోడు గొంతుకలై నిలిచారు.
ఆ విధంగా తమ వ్యూహంలో తామే చిక్కుకుపోయినవారికి అందులోనే మరిన్ని విన్యాసాలు చేయటం మినహా గత్యంతరం లేని స్థితి ఏర్పడింది. కనుకనే కనీసం గత ఏడాదిగా ప్రజల వాస్తవిక స్థితిగతులు, మనోభావాలు ఏ విధంగా మారుతున్నా అటు తొంగిచూసి తెలుసుకునే ధైర్యం చేయలేకపోతున్నారు. నేటికీ అవే అసత్యాలను పునశ్చరిస్తున్నారు. అంతిమ విశ్లేషణలో విచారకరం ఏమంటే, వీలైనంత మంది మేధావులు సజీవంగా, సచైతన్యంగా ఉండవలసిన తెలంగాణ, ఈ విధంగా తగినంతమందిని కోల్పోతున్నది.