గతం ఘనం. ప్రస్తుతం హీనం..భవిష్యత్తు దారుణం.. ఇలా ఉన్నది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. నాయకత్వ లేమి, నిలకడ లేనితనం, బలహీన ప్రతిపక్షం అనే పదాలకు సంపూర్ణ న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్. యాభై సంవత్సరాలు దేశాన్ని పరిపాలించామని చెప్పుకునే పార్టీ నేడు కేవలం 4 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నదంటే దాని పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అటువంటి పార్టీ నేడు తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతుంటే ఆ పార్టీపై జాలేస్తున్నది.
దేశాన్ని పాలించిన అరవైఏండ్లలో భోఫోర్స్ స్కాం, కామన్వెల్త్ స్కాం, ఆదర్శ్స్కాం, సత్యం స్కాం, ఛాపర్ స్కాం.. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాలనంతా స్కామ్‌ల మయమే. అలాంటి పార్టీ తెలంగాణలో ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చేందుకు తెగ ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా పెన్ను ఉందని కాంగ్రెస్ ఇష్టానుసారం హామీలు గుప్పిస్తున్నది. కానీ తెలంగాణ జలాన్ని, జనాన్ని అర్థం చేసుకున్నది ఒక కేసీఆర్ మాత్రమే. అయినా తెలంగాణకు మీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రకటించిన అష్ట సూత్ర పథకం, షట్ సూత్రం పథకం, పంచ సూత్ర పథకం అని చెప్పడమే కానీ వాటిని అమలు చేసి ఉంటే ఇప్పుడు మీ పరిస్థితి ఇలా ఎందుకు ఉండేది. కర్ణాటకలో గెలిచారంటే అక్కడి అధికార బీజేపీ వైఫల్యం, అవినీతి కారణం. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో అందిస్తున్న కేసీఆర్‌ను ఓడించాలనుకోవడం ఓడలేని సముద్ర ప్రయాణం లాంటిది.
ఆనాడు స్వాతంత్య్ర ఉద్యమంలో మహాత్మాగాంధీలా తెలంగాణ ఉద్యమాన్ని అహింసా పద్దతిలో నడిపి తెలంగాణ రాష్ట్రం సాకారం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్. నాడు సాధించిన తెలంగాణ నేడు అభివృద్ధి చెందిందంటే కేసీఆర్ విజన్ కారణం కాదా? తెలంగాణ ప్రత్యేక సంస్కృతిని కాపాడుతూ నేడు విశ్వ యవనికపై తెలంగాణకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తున్న తరుణంలో కాంగ్రెస్ కేసీఆర్ పాలనను విమర్శించడం సిగ్గుచేటు.
నోటుకు ఓటు కేసులో దొరికిన నిందితుడికి పీసీసీ పగ్గాలిచ్చి రేపు తెలంగాణలో అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఉప్పు పాతరేస్తారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ముందు జాతీయ పార్టీలని చెప్పుకునే మీరు జడిసిపోవలసిందే. మొన్నటికి మొన్న హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సదస్సు నిర్వహించినపుడు చూసుంటారు కదా? ఏమి ఈ హైదరాబాద్ అని ఆశ్చర్యపోయి ఉంటారు కదా? అందుకే ఆకుపచ్చని తెలంగాణ పై మీ కన్ను పడింది. పచ్చని పంటకు తెగులు పడ్డట్టు, అందుకే 6 హామీల గ్యారంటీ కార్డు ప్రకటించారు. వారంటీ లేని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాల గ్యారెంటీ చూస్తే గమ్మత్తుగా ఉన్నది. మీరు ప్రకటించిన హామీల గ్యారెంటీ కార్డు కేసీఆర్ పథకాలకు జిరాక్స్ కార్డు అని తెలంగాణ ప్రజలకు తెలుసు. మీరు పరిపాలిస్తున్న ఏ రాష్ట్రంలో ఈ హామీలు అమలవుతున్నాయో చెప్పండి? చెప్పలేరు ఎందుకంటే లేవు కనుక. ఒకవేళ ఆ రాష్ర్టాల్లో ఆదాయం బట్టే పథకాలు ఉంటాయి అంతే. దాని అర్థం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది అని ఒప్పుకున్నట్లే కదా? దానికి బీఆర్ఏస్ పార్టీ విజన్.. కేసీఆర్ మిషన్ కారణమని అనాల్సిందే కదా?
అలా ఒప్పుకోరు సరి కదా మీరు పైగా తెలంగాణ మిగులు బడ్జెట్‌ను అప్పుల బడ్జెట్ చేశారంటారు. ఉన్నవాడు అప్పు చేసి కారు కొంటే విలాసం. డ్రైవర్ అప్పు చేసి కారు కొంటే అది జీవితం. అయినా ఇది అర్థం కాదు. తెలంగాణ అంటే ఎడారి అని. తెలంగాణ ఎగువన ఉన్న దని, దానికి నీరు రాదని. తెలంగాణ రైతాంగాన్ని ఎండబెడితే, ఇపుడు ఆ తెలంగాణే దేశానికి అన్నపూర్ణ అయిందన్న విషయం మింగుడు పడటం లేదా? అప్పటి ఎడారి తెలంగాణ నేల ఇపుడెలా జలపాతమైంది? దానికి కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు కావా? మీరు చేస్తే జలయజ్ఞం. కేసీఆర్ చేస్తే ధనయజ్ఞమా?
తెలంగాణ వస్తే కరెంటు కష్టాలు అన్నారు. నేడు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, రజక, మంగలి షాపులకు ఉచిత విద్యుత్తును దేశంలో తెలంగాణ కాకుండా మరే రాష్ట్రమైన ఇస్తున్నదా? ఇపుడు తెలంగాణలో ఎక్కడైనా కరెంట్ తీగ పట్టుకోండి. మాడిపోతరు. తెలంగాణ ప్రజలు కూడా కరెంట్ తీగ లెక్క. తెలంగాణలో పరిపాలన వికేంద్రీకరణ జరిగి ప్రజలకు సకల సౌకర్యాలు అందుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి.
ఒక్కసారి గ్రామాల్లోకెళ్లి రోడ్లు చూడండి, పల్లెప్రగతి, పట్టణ ప్రగతి చూడండి. హైదరాబాద్ సిగ్నల్ ఫ్రీ రోడ్లు చూడండి. కొత్త సచివాలయం చూడండి. ఆ పక్కనే అమరవీరుల జ్యోతి చూడండి. ఫైనాన్షియల్ సిటీ చూడండి.టీ హబ్, బీహబ్, వీ హబ్, టీ శాట్, టీ ప్రైడ్, టీ గ్లోబలింకర్ వంటివి ఎక్కడైనా ఉన్నాయా? కనీసం మీ ఊహల్లోకి ఎపుడైనా వచ్చాయా? ఎడారి భూములు మత్తడి దుంకుతాయని, తొండలు గుడ్లు పెట్టే భూములు వందల కోట్లు కుమ్మరిస్తాయని అనుకున్నారా? ఆసరా పింఛన్లతో వృద్ధ్దులు, ఒంటరి మహిళలు, వితంతువులు, బీడీ, చేనేత, కల్లు గీత కార్మికులు, ఎయిడ్స్, బోదకాలు, డయాలసిస్ పేషంట్స్, దివ్యాంగులు ఆర్థిక భరోసాతో కేసీఆర్ వెంటే ఉన్నారని భయపడుతున్నారా? కాంగ్రెస్ అంటే పాత, బీజేపీ అంటే వాత అని తెలంగాణ ప్రజలకు తెలుసు కనుకే తెలంగాణ తలరాతగా బీఆర్ఎస్ను ఎంచుకున్నారు.
కాంగ్రెస్, బీజేపీలు తామే దేశంలో ఉంటామని కలలు కంటున్నా యి. కానీ మీరు ఎన్ని జన్మలెత్తినా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు. తెలంగాణను పూర్తిగా అర్థం చేసుకున్నది కేసీఆర్ మాత్ర మే. తెలంగాణకు ఏంకావాలో, ఎలా అభివృద్ధి చేయాలో దార్శనికత కలిగిన నేత కేసీఆర్‌కు తెలు సు. అటువంటి దార్శనికుడిని ము చ్చటగా మూడోసారి తెలంగాణ ప్రజలు ఆశీర్వదించబోతున్నారు. మన ఓటు కారు, మన సారు కేసీఆర్, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్.