భారత్ జోడో పేరుతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారు. దేశంలో విద్వేష, విచ్ఛిన్న రాజకీయాలు కొనసాగుతున్నాయని ఆయన అంటున్నారు. అది వాస్తవమే. అయితే, ఆ రాజకీయాలను అడ్డు కోవడంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎందుకు విఫలమైందో ఆయన జవాబు చెప్పాలి. దేశ సంపద కొద్ది మంది చేతుల్లోకి వెళ్లిపోయిందని రాహుల్ పదే పదే అంటున్నారు. కారణాలేంటో ఆయన ప్రజలకు ఎందుకు వివరించలేకపోయారు? అసలు దేశం ఈ దురవస్థకు కారణం కావడానికి కాంగ్రెస్ పాలన కూడా కారణం కాదా అన్న ప్రశ్నకు ఆయన జవాబు చెప్పాలి.
మ పాలనలో నిరుద్యోగం పెరిగినా బీజేపీకి ఎలాంటి ఇబ్బంది లేదు. ధరలు ఆకాశాన్నంటినా చింత లేదు. ఎందుకంటే వీటి నుంచి ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించడానికి, ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి, నిప్పు రాజేయడానికి ఆ పార్టీ వద్ద మత విద్వేష కుతంత్రాలున్నాయి. భారతదేశంలో ప్రజాస్వామ్యం రూపురేఖలు ఎప్పుడో మారిపోయాయి. ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు, ప్రజల కష్టసుఖాలకు ఏమాత్రం జవాబుదారీగా లేని విధంగా నేడు భారత ప్రజాస్వామ్యం తయారైందంటే దానికి కాంగ్రెస్ పార్టీ హయాంలో బీజం పడింది. అదిప్పుడు వృక్షంగా మారుతోంది.
ఈ దేశానికి ఏ పార్టీ నేత ప్రధాని అయినా నిరుద్యోగం తగ్గలేదు. ధరల పెరుగుదల ఆగిపోలేదు. ప్రతి రాజకీయ పార్టీ దేశ సంపదను అమ్మి ప్రభుత్వాలను నడుపుతున్న పరిస్థితి వస్తున్నది. విదేశాల నుంచి మరింత అప్పును తెచ్చుకుంటున్నాయి. స్వయంప్రతిపత్తి గల సంస్థలను బలహీనం చేస్తూ వస్తున్నవి. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంబానీని ఆ పార్టీ తరఫున రాజ్యసభకు పంపించారు. ఆయన ఆస్తులు పెరిగాయి తప్ప తగ్గలేదు. బీజేపీ హయాంలో కూడా ఆయన ఆస్తులు పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా అదానీ ఆస్తులు కూడా ప్రపంచ స్థాయికి పెరిగాయి. ఇలాంటి వారి ఆస్తులు పెరగడానికి కాంగ్రెస్, బీజేపీ సహకరించిన విషయం రాహుల్కు తెలియదా?
ఈ 75 ఏండ్ల స్వతంత్ర దేశంలో ప్రజల అభివృద్ధి కోసం వచ్చిన చట్టాల కంటే వారిని నిరుపేదలను చేయడానికి వచ్చిన చట్టాలే ఎక్కువ. ఇందులో కాంగ్రెస్కు, బీజేపీకి పెద్ద తేడా ఏమీ లేదు. కాంగ్రెస్ చేసిన చట్టాలను ప్రజల మీద, రచయితల మీద, మేధావుల మీద, రాజకీయ నాయకుల మీదా బీజేపీ ప్రయోగిస్తోంది.
ఇప్పుడు చెప్పండి రాహుల్ గాంధీ… ఈ దేశ ప్రజల అణచివేతలో మీ భాగమెంతో? 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో 50 ఏళ్ల పాలన మీదే. కానీ మీ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకుల ఆస్తులు ఎంత పెరిగాయో వార్తా పత్రికలు చూస్తే తెలుస్తుంది. కానీ ప్రజల జీవన ప్రమాణాలు, ఆస్తులు పెరగకపోవడానికి కారణం పాలక పక్షాల అసమర్ధతా లేక ప్రజల అసమర్ధతా? నెహ్రూ, ఇందిర హయాంలో స్థాపించిన విధంగా మన్మోహన్ కాలంలో ప్రభుత్వ సంస్థలు స్థాపించకపోవడానికి కారణమేమిటో మీరు చెప్పగలరా రాహుల్? కొన్ని రాజకీయ పార్టీల్లో కుటుంబ పాలన లేదా నియంతృత్వ వైఖరి ఉంటున్నాయి. మీ పార్టీకి కూడా ఆ పేరుంది… దాన్ని వదులుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పాదుగొల్పగలరా?
ఇప్పుడు ప్రభుత్వ సంస్థలను బీజేపీ ప్రభుత్వం ఇద్దరు వ్యక్తుల చేతుల్లో పెట్టి దేశ సంపదను కార్పొరేట్ల పరం చేస్తోంది. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని మరింత ఎక్కువగా అమలు చేస్తూ దేశ సంపదలో 57 శాతాన్ని కేవలం ఒక శాతం ధనికుల చేతిలో పెట్టింది.ఈ దేశ సంపద కార్పొరేట్ల సొంతం కావాలన్నదే మీ రెండు పార్టీల జాతీయ విధానమా? న్యాయ, కార్య నిర్వాహక, పత్రికా రంగాలు, స్వయం ప్రతిపత్తి కలిగిన కేంద్ర సంస్థలు మీ పార్టీ పాలనలో బలహీనపడితే, మోడీ హయాంలో ఊపిరి పీల్చుకోలేకపోతున్నాయి. ఈ దేశ విద్యా వ్యవస్థను నాశనం చేయడంలో మీకు, బీజేపీకి పెద్ద తేడా ఏమీ లేదు!
దేశ ప్రజలకు సూచన
భారత ప్రజలారా.. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ దేశ పేద, మధ్య తరగతి ప్రజల ఆవేదన ఏంటో చెప్పండి. విద్యార్థులు, రైతుల ఆవేదనను వినిపించండి. ఇప్పుడు మీరు ఏ సమస్యలతో బాధ పడుతున్నారో కండ్లకు కట్టినట్టు ఆయనకు వివరించండి. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తే విద్వేష, విచ్చిన్న రాజకీయాలు ఉండవు కదా అని అడగండి. ఇవాళ దేశంలో రాజకీయ పార్టీలు ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటున్నాయి. కొత్త తరానికి, యువ తరానికి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పార్టీ యువ తరానికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తుందేమో రాహుల్ గాంధీని అడగండి. వేరే పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన అవకాశ వాదులను వదులుకుంటారేమో అడగండి. మన పిల్లలకు నాణ్యమైన, నైపుణ్యాలు కలిగిన విద్యను ఉచితంగా అందిస్తారేమో అడగండి. ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించండని అడగండి. పసి పిల్లలు తాగే పాలు మొదలుకుని పండు ముసలి వాళ్లు వాడే మందుల వరకు ఉన్న జీఎస్టీ భారాన్ని తగ్గించగలరా అని ప్రశ్నించండి.
– మాందాల భాస్కర్
97050 53483
(వ్యాసకర్త: విద్యార్ధి నాయకులు)