కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి వెనుక ఒకటిగా అవినీతి కుంభకోణాల్లో చిక్కుకుంటున్నది. సీఎం సిద్ధరామయ్య పేరు పలు కేసుల్లో ప్రముఖంగా వినిపిస్తున్నది. ముఖ్యంగా మైసూరు అర్బన్ డెవలప్మెంట్ (ముడా) భూమి కుంభకోణం ఆయన మెడకు బలంగానే చుట్టుకుంటున్నది. ఆయనను అవినీతి కేసులో ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్ ఇదివరకే అనుమతి ఇచ్చారు. దీని రద్దుకు హైకోర్టులో సీఎం సిద్ధరామయ్య వేసిన పిటిషన్ వీగిపోవడం ఆయనకు పెద్దదెబ్బ అనే చెప్పాలి. ముడా లేఔట్ల ద్వారా సీఎం సతీమణి పార్వతి, ఆయన బావమరిది లబ్ధి పొందారనేది ప్రధాన ఆరోపణ. ముడాకు సమర్పించిన భూముల విలువను మించిన ప్లాట్లను తిరిగి పొందారనేది ఫిర్యాదుదారుల కథనం. పిటిషన్లో ప్రస్తావించిన అంశాలపై దర్యాప్తు జరపాల్సిందేనంటూ జస్టిస్ ఎం.నాగప్రసన్న అభిప్రాయపడటం గమనార్హం. గవర్నర్ అనుమతి మంజూరులో తొందరపాటును ప్రదర్శించారన్న వాదననూ తిరస్కరించారు.
హైకోర్టు తీర్పుతో సిద్ధరామయ్యపై దర్యాప్తునకు, తదనంతరం ప్రాసిక్యూషన్‌కు మార్గం సుగమమవుతుంది. కనీసం రెండు వారాల స్టే ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోరినప్పుడు ‘నా తీర్పుపై నేనే స్టే ఇవ్వలేను’ అని జస్టిస్ నాగప్రసన్న ప్రకటించడం గమనార్హం. దీంతో ప్రాసిక్యూషన్‌ను ఆపేందుకు సిద్ధరామయ్య ముందున్న దారులన్నీ మూసుకుపోయాయి. ముడా ప్లాట్ల వ్యవహారంలో ప్రభుత్వానికి రూ.45-55 కోట్ల మేర నష్టం వాటిల్లిందంటున్నారు. నిజానికి ఆయన కుటుంబ సభ్యులు ముడాకు అభివృద్ధి నిమిత్తం ఇచ్చిన భూములు వారి పేరు మీదకు రావడం వెనుక కూడా అనుమానాస్పదమైన పరిణామాలు జరిగాయన్న సంగతి కూడా వెలుగులోకి వచ్చింది. మరోవైపు వాల్మీకి గిరిజనాభివృద్ధి సంస్థ నిధుల మళ్లింపు కేసులోనూ సిద్ధరామయ్య పాత్రపై అనుమానాలున్నాయి. ఆర్థికశాఖను స్వయంగా నిర్వహిస్తున్న సీఎం నిర్ణయం మేరకే నిధులు మళ్లించారని ఆరోపణలున్నాయి. అయితే ఆ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. వాల్మీకి సంస్థ నిధులను వేర్వేరు ఖాతాలు తెరిచి చిన్నచిన్న మొత్తాలుగా రూ.94 కోట్లు దారిమళ్లించారు. ఇందులో కొంత మొత్తం కర్ణాటకలో, మరికొంత మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ఖర్చులకు వినియోగించారని అప్పట్లో బలంగా వినిపించింది.
ఈ తరహా అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణల కారణంగానే ఏఐసీసీకి కర్ణాటక ప్రభుత్వం ఏటీఎంగా మారిందనే మాట వినిపిస్తున్నది. ఈ రెండు కుంభకోణాలపై విపక్ష బీజేపీ సహజంగానే హంగామా చేస్తున్నది. ఈ నేపథ్యంలో బీజేపీ తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు పన్నుతున్నట్టు సిద్ధరామయ్య చేసిన ఆరోపణ బేలగా ధ్వనిస్తున్నది. మరోవైపు అధిష్ఠానం ఒత్తిడి మేరకు బీజేపీ పాలనలో జరిగిన వివిధ కుంభకోణాలపై సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం ఇదివరకే మూడు జ్యుడీషియల్ కమిషన్లు వేసింది. కుంభకోణాల దర్యాప్తు ప్రగతిని సమీక్షించేందుకు సీఎం ఇటీవలే మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇలా ఒకరి గురించి మరొకరు బయట పెట్టుకుంటుండటంతో కుంభకోణాల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేననే అభిప్రాయం సామాన్య ప్రజలకు కలగడంలో వింతేమున్నది.