మౌనం బలహీనత కాదు, ఒక ఆయుధం. మేధావుల సందర్భోచిత, అర్థవంతమైన మౌనం మరింత శక్తివంతమైనది. అందుకే సీఎం రేవంత్‌ను కేసీఆర్ మౌనం ఎక్కువగా భయపెట్టింది. రాజకీయాల్లో ఒక నాయకుడు మౌనంగా ఉండటమంటే అతను అన్నింటి నుంచి తప్పుకున్నాడని కాదు. మౌనం నాయకుడికి గమనించే శక్తినిస్తుంది, లోతుగా ఆలోచించడానికి సమయాన్ని కల్పిస్తుంది, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ఇస్తుంది. అవసరం లేని ప్రతిస్పందనల నుంచి నాయకుడిని దూరంగా ఉంచి, రాజకీయ వ్యూహానికి పదును పెడుతుంది.
నిజమైన, సమర్థవంతమైన నాయకత్వం అంటే అన్ని అంశాలపై, అన్నివేళలా మాట్లాడటం కాదు. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకోవడం. కేసీఆర్ చేసిం ది అదే. రాజకీయాల్లో నాయకుల శబ్దం వార్తలు సృష్టించవచ్చు. కానీ, ఓపిక పట్టి, మౌనం వహించి ఇక తప్పని పరిస్థితుల్లో చేసే రాజకీయ విమర్శ చరిత్రను సృష్టిస్తుంది. మహాత్మాగాంధీ, నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, పీవీ, జ్యోతి బసు, మన్మోహన్సింగ్ వంటి గొప్ప గొప్ప నాయకులు కూడా అవసరమైనప్పుడు మౌనాన్ని తమ ఆయుధంగా మలచుకున్నవారే. మౌనాన్ని వ్యూహంగా ఉపయోగించారు. మాటలకన్నా కార్యాచరణకే ప్రాధాన్యం ఇచ్చారు. విమర్శలకు వెంటనే స్పందించకుండా, సరైన సమయం వచ్చేవరకు మౌనం వహించారు. ఈ మౌనమే రాజకీయ స్థిరత్వాన్ని, విశ్వసనీయతను, దీర్ఘకాలిక విజయాన్ని వారికందించింది.
రేవంత్ సర్కారుకు రెండేండ్ల సమయం ఇవ్వాలని, ప్రభుత్వ పనితీరును గమనించి విశ్లేషించిన తర్వాతనే విమర్శలు చేయాలని కేసీఆర్ ముందుగానే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆయన కూడా అందుకే మౌనం వహించారు. రేవంత్ సర్కార్ దుర్మార్గాలను భరించలేని కేసీఆర్ మొన్నటి ఆదివారం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సమక్షంలో నిర్వహించిన ఓపెన్ ప్రెస్మీట్లో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. స్పష్టమైన ఆధారాలతో ప్రశ్నలను సంధించారు. పాలమూరు ప్రాజెక్ట్ డీపీఆర్‌ను కేంద్రం తిరిగి పంపించడం, రాష్ట్రంలో క్షీణిస్తున్న లా అండ్ ఆర్డర్ పరిస్థితి, ఫార్మాసిటీ భూ వివాదాలు, అలాగే ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలులోని లోపాలపై ఆయన నేరుగా ప్రశ్నలను సంధించారు. రెండేండ్లు పూర్తయినా పింఛన్ల పెంపు, బాలికలకు ఉచిత స్కూటీలు, కల్యాణలక్ష్మి పథకం, ఒక తులం బంగారం వంటి కీలక హామీలు ఎందుకు అమలుచేయడం లేదని నిలదీశారు.
కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన సీఎం ప్రతిస్పందన ఏమిటి? అసెంబ్లీ బయటచేసిన వ్యాఖ్యలకు స్పందించను, చర్చలు అసెంబ్లీలోనే జరగాలని తప్పించుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం కేవలం అసెంబ్లీకే కాదు, ప్రజలకు కూడా జవాబుదారీనే. ఆ జవాబుదారీతనం మీడియా ద్వారానే ప్రజలకు చేరుతుంది. రేవంత్ వ్యాఖ్యలను బట్టిచూస్తే ప్రెస్ కాన్ఫరెన్స్‌లు అప్రామాణికమా? బహిరంగ సభలకు ప్రజాస్వామ్య విలువ లేదా? మీడియాలో వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదా? ఈ లాజిక్‌ను ఆయన అంగీకరిస్తే, భారత రాజకీయాల్లో చాలాభాగం అర్థం లేనిదిగా మారుతుంది. ఎందుకంటే ఎన్నికల ప్రచారాలు, హామీలు రోడ్లపైనే జరుగుతాయి. స్వాతంత్య్ర ఉద్యమం రోడ్లపైనే సాగింది. ప్రజాస్వామ్యం ప్రజల మధ్యే పెరిగింది. రోడ్లపై చేసిన వ్యాఖ్యలపై నేను స్పందించను అంటున్న రేవంత్ రెడ్డి రోడ్లపై సభలు పెట్టి, ప్రెస్మీట్లలో మాట్లాడి, ప్రత్యర్థులను విమర్శించినప్పుడు ఆయన ఆలోచన విధానం కూడా ఇలాగే ఉందా సమాధానం చెప్పాలి. స్వయంగా తరచూ ప్రెస్ కాన్ఫరెన్స్‌లు, బహిరంగ సభలు నిర్వహిస్తూ రాజకీయ వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రికి చెల్లుతుంది కానీ, మీడియా ముందు ప్రతిపక్షం ప్రశ్నలడగడం చెల్లదా? ఇది ఎందుకు తప్పవుతుందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.
ఇక మరో విషయం.. కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరని రేవంత్ చేసిన వ్యాఖ్య ఒక మౌలిక ప్రశ్నను లేవనెత్తుతున్నది. రాజకీయాల్లో క్రియాశీల అనే పదానికి నిర్వచనం ఏమిటి? రాజకీయ నిఘంటువులో అలాంటి పదం లేనే లేదు. రాజకీయాలు అంటే కేవలం పదవిలో ఉండటం కాదు, రోజూ అసెంబ్లీకి వెళ్లడం, ప్రతిరోజూ మాట్లాడటం మాత్ర మే రాజకీయ క్రియాశీలత కాదు. రాజకీయాల్లో పాల్గొనడమంటే ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విధానాలపై చర్చించడం, ప్రజలను చైతన్యపరచడం. కేసీఆర్ చేసేది అదే కదా? కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరంటూ పదే పదే కేసీఆర్ నామజపం చేసిన రేవం తే.. పరోక్షంగా కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో, అత్యంత యాక్టివ్‌గా ఉన్నట్టు ఒప్పుకున్నారు కదా?
ఇన్ని రోజులు కేసీఆర్ మౌనం భయపెడితే, ఇప్పు డు కేసీఆర్ మాటలు రేవంత్‌ను భయపెడుతున్నా యి. అందుకే ఆయన కేసీఆర్ ప్రశ్నలకు సమాధా నం ఇవ్వకుండా అసెంబ్లీకి రావాలని, అసెంబ్లీలోనే సమాధానం చెప్తానని తప్పించుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఏడాది మొత్తంలో (మూడు సమావేశాలు కలిపి) 30 రోజుల కంటే మించి జరగవు. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు కేవలం ఆ సమయంలోనే సమాధానం ఇస్తానంటే అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమే. ఇప్పటికైనా సీఎం తన వాచాలత్వాన్ని వదులుకోవాలి. జలదోపిడీపై, తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ అడిగిన మౌలిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, సుడా మాజీ చైర్మన్, కరీంనగర్)
-జీవీ రామకృష్ణారావు ,98667 67777