ఏ వ్యక్తి ప్రతిభకైనా గీటురాయి అతని పనితనమే అవుతుంది. పాలకుడికీ ఇది వర్తిస్తుంది. సామాన్యుడికి తన ప్రతిభను చాటుకునే అవకాశాలు చాలా పరిమితంగా వస్తాయి. కానీ, పాలకుడి విషయంలో అద్భుతాలు ఆవిష్కరించే అవకాశం ఎల్లప్పుడూ అతని చేతుల్లో, చేతల్లోనే ఉంటుంది. అదేం దౌర్భాగ్యమో కానీ, అప్పనంగా వచ్చిన అవకాశాన్ని వెకిలి మాటలతో దుర్వినియోగం చేస్తున్న దృశ్యం మన రాష్ట్రంలో పూటపూటకూ ఆవిష్కృతమవుతున్నది. తన చేతుల్లో ఏదీ లేదనీ, అస్సలేం చేతకావడం లేదనీ, చేవగారిపోయిన ఆ నేత.. తన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు చచ్చు మాటలు, పుచ్చు మాటలు పేలుతున్నాడు.
పదవిని బట్టి స్ట్రేచర్ సారీ స్టేచర్ వస్తుందని వక్రభాష్యాలు చెప్పినవాళ్లకు.. నోరు పారేసుకుంటే కలిగే అనర్థాలు తెలియకపోదు. కానీ, వాచాలురుగా ప్రసిద్ధి చెందిన వారినుంచి ఇలాంటి అవాకులూ-చవాకులూ మినహా అర్థవంతమైన, గంభీరమైన పదాలు దొర్లుతాయనుకోవడం మన అమాయకత్వం. పురాణాలు పరికిస్తే… ఇలా నోటికి పని చెప్పి కూటికి లేకుండాపోయిన పాత్రలెన్నో కనిపిస్తాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అహంకారంతో హూంకరించిన మదగజాలు కూడా మట్టికరిచాయి. త్రేతాయుగంలో వాచాలత్వానికి ప్రతీకగా వానరరాజు వాలి కనిపిస్తాడు. తన సోదరుడైన సుగ్రీవుణ్ని నిందించి, మోసగించి దుష్టుడిగా మిగిలిపోయాడు. రావణుడి కుమారుడు ఇంద్రజిత్దీ అదే వైఖరి. మంచి చెప్పిన విభీషణుణ్ని పినతండ్రి అని కూడా చూడకుండా వ్యర్థ వ్యాఖ్యలు పేలి.. దుష్ట చరిత్రను మూటగట్టుకున్నాడు. అంతటి రావణుడు కూడా సీతమ్మ ముందు పొల్లుమాటలు ఏకరువు పెట్టి నికృష్టుడిగా మిగిలిపోయాడు. యుగయుగానా ఇలాంటి దుష్టబుద్ధులు కొల్లలుగా కనిపిస్తారు. ద్వాపర యుగానికి వస్తే.. శిశుపాలుడిదీ వాచాల గోత్రమే! వసుదేవుడిని తూలనాడి తల తెగిపడేదాకా తెచ్చుకున్నాడు. కంసుడు, నరకుడు, శకుని తదితరులంతా దుష్టులుగా చెలామణి కావడానికి వారి నోరు అదుపులో లేకపోవడమే ప్రధాన కారణం.
ప్రస్తుతానికి వస్తే.. ఎన్నికల ప్రచారంలో మాటలు కోటలు దాటడం సహజం. వైరిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు సర్వ సాధారణం. అబద్ధాలు కుమ్మరించి.. అందలమెక్కిన వాళ్లు, నేటికీ అదే పంథాను అనుసరిస్తుండటం విడ్డూరం. ఇప్పుడున్న కరెంటు కోతలపై పెగలని నోరు.. తెలంగాణ రైతాంగానికి 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చిన నేతపై పాడు కూతులు కూస్తున్నది. అరవై ఏండ్ల అరిగోసను తప్పించి, ప్రత్యేక రాష్ర్టాన్ని సిద్ధింపజేసి, వచ్చిన తెలంగాణను ఒడ్డున నిలిపిన దార్శనికుడిని కీర్తించకపోగా.. వారి కీడు కోరుకోవడం పాడు రాజకీయం కాక మరేమిటి? విద్యార్థుల సభలో అవే తిట్లు, ఉద్యోగుల భేటీలో అంతకన్నా నీచమైన శాపనార్థాలు! వేదిక ఏదైనా అసందర్భ ప్రేలాపనలతో తాను ఎలాంటి వాడినో రుజువు చేసుకునేందుకు ఆయన ఎందుకు అంత తాపత్రయపడుతున్నాడో అందరికీ తెలిసిందే!
పల్లెకు పోతే అన్నదాత నిలదీస్తడు. ‘కేసీఆర్ ఇచ్చిన రైతుబంధు ఎందుకు ఇస్తలేవని’! మహిళలను పలకరిస్తే.. మహాలక్ష్మి బకాయిలు అడుగుతరని జం కు. సొంత ఇలాఖాలో తిరుగుదామంటే.. ‘లగచర్ల లడాయి ఇంకా పచ్చిగానే ఉంది’! పెద్దల ఆశీర్వాదం తీసుకుందామంటే… పెంచుతానన్న పింఛన్ అడుగుతరని గుబులు. పోనీ ఢిల్లీ పెద్దల మన్ననలున్నంత కాలం ఫికర్ లేదు అనుకుందామంటే.. ఆ పరిస్థితీ లేదు! ఎక్కడికి వెళ్తే ఎవరు నిలదీస్తారో అన్న భ యం కొద్దీ ఆయన ఎంచుకున్న విధానం పరనింద. నోటికొచ్చినట్టు తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు! ఇలా ఇష్టారీతిగా నోరు పారేసుకుంటూ ఉంటే.. తనను ఎవరూ ప్రశ్నించే సాహసం చేయరని సదరు పాలకుడి ఉబలాటం కావొచ్చు. ‘దుష్టుడికి బహుదూరంగా ఉండాల’న్న పెద్దల మాటను అనుసరించి.. ప్రతిపక్షాలే కాదు, ప్రజలు కూడా తనను నిలదీయలేరనీ, తనకు దూరంగా ఉంటారని భావిస్తున్నట్టున్నాడు. కానీ, పురాణ కాలం నుంచి దుష్టులకు దక్కిన గౌరవమే.. ప్రజాక్షేత్రంలో ఇతగాడూ పొందడం, దక్కడం ఖాయం. ఆయన అనుకున్నట్టే.. సమాజం దుష్టుడికి దూరంగా ఉంటుంది. కానీ, అవకాశం వచ్చినప్పుడు అదే సమాజం దుష్టుడిని ఆమడ దూరం పెడుతుంది.
– కణ్వస