ఇంట గెలిచి, రచ్చ గెలవాలంటారు పెద్దలు. సీఎం రేవంత్ మాత్రం సొంత ఇంట్ల (కొడంగల్ నియోజకవర్గం )నే ఓడిపోయారు, ఇంక రచ్చల ఏం గెలుస్తారు? సొంత ఇలాఖాలో ఫార్మా విలేజి ఏర్పాటు చేయించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యమంత్రి కదా..! ఏం చేసినా ఎదురుండదనే అత్యుత్సాహంతో రైతులపై బెదిరింపులకు దిగడం ఆయన కొంపముంచింది. తమ భూములనే తీసుకుంటూ, తమపైనే దౌర్జన్యానికి దిగడంతో అన్నదాతలు కన్నెర్ర జేశారు. ఆందోళనలు, కేసులు, అరెస్టులతో సమస్య తీవ్రస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే.. ప్రభుత్వం తాజాగా ఫార్మా క్లస్టర్ కాదు, ఐటీ కారిడార్లు ఏర్పాటు చేస్తామంటూ కొత్త నాటకమాడుతున్నది. ఏదేమైనా భూములు కోల్పోయేది మాత్రం లగచర్ల రైతులే కదా?
ఫార్మా కంపెనీల విస్తరణను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ సర్కార్ ఫార్మాసిటీ ఏర్పాటుచేసేందుకు పూనుకున్నది. అందుకనుగుణంగా రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో 19 వేల ఎకరాల భూమి సేకరించింది. అక్కడ ఫార్మాసిటీ ఏర్పాటుచేసి ఉంటే, 20 ఏండ్లలో సుమారుగా రూ.70 వేల కోట్ల పెట్టుబడులతో పాటు 5.50 లక్షల మందికి ఉపాధి లభించేది. అప్పటికే సుమారు 400 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కంపెనీల ఏర్పాటుకు దరఖాస్తు కూడా చేసుకున్నారు. అయితే, అధికారమే పరమావధిగా బీఆర్ఎస్ సర్కార్‌పై దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతలు.. ఫార్మాసిటీ ఏర్పాటును వ్యతిరేకించారు. తాము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. చెప్పినట్టే ఫార్మాసిటీని రద్దు చేశారు కూడా.
కేసీఆర్ సర్కార్ ఏర్పాటుచేయాలని తలచిన ఫార్మాసిటీని మొదటినుంచీ వ్యతిరేకించిన కాంగ్రె స్ నేతలు.. తాము అధికారంలోకి వచ్చాక జిల్లాల్లో ఫార్మా విలేజీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం విడ్డూరం. తొలి విడతలో భాగంగా ముచ్చర్ల, వికారాబాద్, సంగారెడ్డిలలో మూడు ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని దుద్యాల మండలం లగచర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామాల్లో 1,358 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. సీఎం అండదండలతో కాంగ్రెస్ నాయకులు ఆయా గ్రామాల్లో రెచ్చిపోవడంతో రైతన్నలు ఎదురుతిరిగారు. పచ్చని పొలాల్లో రసాయన చిచ్చు పెట్టడంతో అన్నదాతలు ఆందోళనకు దిగారు. భూ సేకరణ విషయంలో రేవంత్ సర్కార ఈ ఘటన తలెత్తింది.
ఏదైనా పదవిలో ఉన్నోడికి బరువు, బాధ్యతలే మిటో తెలుస్తాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ సర్కార్ చేసిన ప్రతీ పనికి అడ్డుపడ్డ ‘రేవంత్ ఆండ్ కో’కు ఒక పని తలపెట్టాలంటే ఎంత కష్ట మో ఇప్పుడు తెలిసొచ్చి ఉంటుంది. కేసీఆర్‌కు పేరు వస్తుందనే అక్కసుతో ఫార్మాసిటీని రద్దుచేసిన రేవంత్.. ఇటు ఫార్మా విలేజీ భూ సేకరణ విష యంలో విఫలమయ్యారు. దీంతో ఆయన పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డితో పాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర తదితర కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టుకు అడుగడుగునా అడ్డుపడ్డారు. గ్రీన్ ట్రిబ్యునల్ మొదలుకొని అన్నిరకాల కోర్టుల్లో కేసులు వేశారు. చివరికి మరణించినవారి పేరు మీద కూడా కేసులు వేయడం గమనార్హం. మల్లన్నసాగర్ విషయంలోనూ కాంగ్రెస్ ఇదే రీతిన వ్యవహరించింది. అయితే, ప్రతిపక్ష నేతలు ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ వెనుకడుగేయకుండా ముందుకు సాగారు. ప్రాజెక్టును పూర్తిచేసి బీడు భూముల్లో గోదావరి జలాలను పారించారు. ముంపు బాధితులకు పరిహారంతో పాటు పునరావాసం విషయంలో కేసీఆర్ సర్కార్ చిత్తశుద్ధితో వ్యవహరించడంతో ప్రజల్లో మార్పు మొదలైంది. రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, లక్ష్మాపూర్, పల్లెపహాడ్, వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్ ప్రజలు ప్రాజెక్టుకు మద్దతు పలికారు.
కేసీఆర్ ఆదేశాలతో అప్పటి మంత్రి టి.హరీశ్‌రావు, రాజన్న-సిరిసిల్ల జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సిద్దిపేట కలెక్టర్ కృష్ణభాస్కర్, అధికార యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకొని ప్యాకేజీని పకడ్బందీగా అమలుచేయడంతో ముంపుగ్రా మాల ప్రజల నుంచి అద్భుత స్పందన లభించిం ది. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం ఒక కుటుంబానికి 75 గజాల స్థలం, ఇందిరా ఆవాస యోజన కింద సొంతిళ్లు, ఇళ్లు వద్దనుకుంటే రూ.1.50 లక్షలు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, దాని వల్ల ప్రజలు నష్టపోతారని గ్రహించిన కేసీఆర్ సర్కార్ ప్రతి కుటుంబానికి 250 గజాల ప్లాట్, డబుల్ బెడ్రూం ఇల్లు, ఇల్లు వద్దనుకుంటే రూ.5,04,000, అలాగే రూ.7.50 లక్షల పరిహారం ఇచ్చింది. 18 ఏండ్లు నిండినవారిని ఒక కుటుంబంగా గుర్తించి వారికి కూడా 250 గజా ల ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు అందజేసింది. అంతేకాదు, ఎకరానికి రూ.6.36 లక్షల పరిహారం ఇవ్వాల్సి ఉండగా.. రూ.7.50 లక్షలు ఇచ్చింది. ఒక్క మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి సుమారు 5,300 కుటుంబాలకు పరిహారంతో పాటు పునరావాసం కల్పించారు.
కేసీఆర్ సర్కార్ అందించిన ప్యాకేజీతో గతం లో అధికారులను అడ్డుకున్నవారే ఆ తర్వాత మంగళహారతులిచ్చి, డప్పుచప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. 916 రోజుల పాటు దీక్ష చేసిన వేములఘాట్ ప్రజలు ఆ గ్రామ శివారు నుంచి అధికారులకు స్వాగతం పలికారు. ఇలా భూసేకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టిన కేసీఆర్ సర్కార్ ఆ తర్వాత ప్రాజెక్టును నిర్మించి, జాతికి అంకితం చేసింది. కాంగ్రెస్, టీడీపీ, ఇతర సంఘాలు మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేశాయి. కానీ, అప్పుడు కేసీఆర్ సర్కార్ ముంపు బాధితులను ఒప్పించి ముందుకెళ్లిందే తప్ప, రేవంత్ ప్రభుత్వం లాగా దౌర్జన్యాలకు దిగలేదు.
ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు బాధితులకు మద్దతివ్వ డం సర్వ సాధారణం. గతంలో కాంగ్రెస్ బహిరంగంగానే ఆందోళనలకు మద్దతిచ్చింది. కానీ, నాడు బీఆర్ఎస్ సర్కార్ ఎలాంటి అరాచకాలకు పాల్పడలేదు. ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, తెలంగాణ అభివృద్ధి విషయంలో కావచ్చు.. ప్రతిపక్షాల కుట్రలను ప్రజామోదంతో కేసీఆర్ ఛేదించారు. అంతేతప్ప, అక్రమ కేసులు పెట్టి నిర్బంధించలేదు. ప్రజలు తిరుగుబాటు చేస్తుండటంతో ఏం చేయాలో పాలుపోక డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడుతున్నారు. అక్రమ కేసులు పెట్టినా, అరెస్టులు చేసినా గులాబీ దళం తొణకదు, బెణకదు. అరెస్టులతో బీఆర్ఎస్కు మరింత మైలేజీ పెరుగుతుందే తప్ప డ్యామేజీ ఏ మాత్రం జరగదు. ఈ విషయాన్ని రేవంత్ సర్కార్ గుర్తుంచుకోవాలి.