సువిశాల భారతదేశంలో తెలంగాణ ఒక రాష్ట్రం మాత్రమే. కానీ, దేశాన్ని పాలిస్తున్న ప్రధాని మోదీకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ దారి చూపుతున్నారు. ఇబ్బంది వచ్చినప్పుడల్లా ఆదుకుంటున్నారు. ఇదేదో వ్యంగ్యంగా చెప్తున్న మాట కాదు, ఇప్పటివరకు దేశంలో జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఇబ్బందుల్లో ఉన్న బీజేపీని రేవంతే ఆదుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రెండు ప్రధాన రాష్ర్టాలు కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాల పనితీరు దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రచారానికి ఉపయోగపడుతున్నది. ఇంకా చెప్పాలంటే, తెలంగాణ ఇంకాస్త ఎక్కువగానే ఉపయోగపడుతున్నది.
తెలంగాణలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో పాటు ‘టీఎస్’ను ‘టీజీ’గా మార్చడం, తెలంగాణ తల్లి విగ్రహ మార్పు, తెలంగాణ అస్తిత్వ గుర్తులను చెరిపివేయడం లాంటి చర్యలను దేశవ్యాప్తంగా బీజేపీ బాగానే వాడుకుంటున్నది. ఇప్పటికే ఢిల్లీలోని వీధుల పేర్లను బీజేపీ మార్చేసింది. రాజ్యాంగాన్ని కూడా బీజేపీ మారుస్తుందని కాంగ్రెస్ విమర్శిస్తున్నది. జాతీయ పతాకం.. మూడు రంగుల కాంగ్రెస్ జెండాను పోలి ఉందని, దాన్ని మార్చాలని కాంగ్రెసేతర పక్షాలు గతంలో డిమాండ్ చేశాయి. ఇప్పుడు కూడా మోదీ సర్కార్‌పై ఈగ వాలకుండా ఉండేలా రేవంత్ రెడ్డి చర్యలు కనిపిస్తున్నాయి. తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిలా మార్చిన హస్తం పార్టీ బీజేపీ చేపట్టే మార్పులను ఏమని ప్రశ్నించగలదు?
హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రధానంగా తెలంగాణలోని రేవంత్ పాలన గురించే మోదీ ప్రచారం చేశారు. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్‌లోనే కాదు, చివరికి ఓట్ల లెక్కింపు ప్రారంభంలో సైతం కాంగ్రెస్ గెలుస్తుందనే అనిపించింది. తీరా బీజేపీ ఘన విజయం సాధించింది. మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందని మొదటినుంచీ వినిపించగా.. బీజేపీ కూటమి ఏకపక్షంగా విజయం సాధించింది. ప్రత్యేకించి, కర్ణాటక, తెలంగాణల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాల పాలన మహారాష్ట్రలో కాంగ్రెస్‌ను బాగా ఇబ్బంది పెట్టింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మీడియా సమక్షంలో వెల్లడించారు. ‘మేమేమో కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయని ప్రచారం చేస్తుంటే, మీరేమో ఉచిత బస్సు పథకం అమలు చేయలేకపోతున్నాం, సమీక్షిస్తాం అని చెప్తున్నారు. ఇదేం పద్ధతి’ అని సొంత పార్టీ పాలకులను బహిరంగంగా నిలదీశారు. మోదీ కూడా సరిగ్గా ఇదే పని చేశారు. మహారాష్ట్రలో ప్రతి సమావేశంలోనూ కర్ణాటక, తెలంగాణ సర్కార్ల వైఫల్యాలను ఎత్తిచూపారు. ప్రత్యేకించి, ఆరు గ్యారెంటీలంటూ తెలంగాణలో అధికారంలోకి వచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విస్తృతంగా ప్రచారం చేశారు. ఒక దశలో మహారాష్ట్ర ఎన్నికలు కాస్త తెలంగాణ ఎన్నికలు అనుకునేట్టుగా మారిపోయాయి. ముఖ్యమంత్రి రేవంత్‌తో పాటు మంత్రులు మహారాష్ట్రలో బైఠాయించి ప్రచారం చేశారు.
ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని కోట్ల రూపాయల తెలంగాణ సొమ్మును వెచ్చించి మహారాష్ట్ర పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. అయితే, ఆరు గ్యారెంటీల్లో ఉచిత బస్సు మినహా ఏదీ అమలుకు నోచుకోలేదని, మహిళలకు నెలకు రూ.2500, పింఛన్ 4 వేలకు పెంపు, రైతుబంధు తదితర హామీలు అమలు కాలేదని బీజేపీ ప్రచారం చేసింది. ఆ ప్రచారం బాగానే ప్రభావం చూపింది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం.
ప్రతిపక్షాలకు ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ, అధికార పక్షానికి మాత్రం తాము ఇచ్చిన హామీలను నేరవేర్చడం తప్ప విపక్షంపై విమర్శలు చేసే అవకాశం ఉండదు. విమర్శలు చేసినా దాని ప్రభావం తక్కువే. కేంద్రంలో బీజేపీ పదేండ్ల నుంచి అధికారంలో ఉన్నది. నిజానికి, విపక్షాలు చేసే విమర్శలకు సమాధానం చెప్పాల్సిన స్థానంలో బీజేపీ ఉంది. అంతే తప్ప తాను విమర్శించే పరిస్థితిలో లేదు. కానీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో వైఫల్యాలను, అమలుకు నోచుకోని హామీలను బీజేపీ అన్ని రాష్ర్టాల్లో ప్రచారం చేస్తున్నది. మహాత్మాగాంధీ స్థానంలోనే సర్దార్ పటేల్‌ను నిలిపిన బీజేపీకి కాంగ్రెస్ గుర్తులను చెరిపేసి కొత్త గుర్తులను తెరపైకి తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదు. ఏమై నా ఇబ్బందులు, విమర్శలు వస్తే తెలంగాణలో కాంగ్రెస్ మార్చిన గుర్తులు బీజేపీకి ఉపయోగపడతాయి. కేసీఆర్‌పై తీవ్రమైన వ్యతిరేకతతో కాంగ్రెస్ పేర్ల మార్పు కార్యక్రమాన్ని ముందటేసుకున్నది. అంతేతప్ప ఈ మార్పుల వల్ల తెలంగాణకు ఒరిగేదేమిటో ఎవరికీ తెలియదు.
తనకు ధైర్యం, భవిష్యత్తుపై ఆశ ఉండాలని దేవుడిని అత్యంత బలవంతుడైన రూపంలో మనిషి రూపొందించుకున్నాడు. అందుకే, తనకు లేనటువంటి బంగారు కిరీటాలు, నాలుగు చేతులను దేవుళ్లకు ఉన్నట్టు భావించాడు. శక్తివంతుడైన దేవుడు తనను కాపాడుతాడనేది మనిషి నమ్మకం. అదే విధంగా భరతమాతను, తెలుగుతల్లిని వివిధ రాష్ర్టాలవాళ్లు తమ మాతలను రూపొందించుకున్నారు. కాంగ్రెస్ వాదన, కాంగ్రెస్ అనుకూల కవుల వాదన ప్రకారం సగటు పేద మహిళలా తెలంగాణ మాత విగ్రహం ఉండాలనుకుంటే.. భారతమాత కూడా పేద మాతగానే ఉండాలి కదా? వాస్తవానికి, భారతమాత కిరీటం, బంగారు ఆభరణాలతోనే ఉంది కదా? ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో దేశంలోని 80 శాతం మంది ఇంకా దారిద్య్రరేఖకు దిగువనే ఉన్నారు. 80 కోట్ల కుటుంబాలకు ఇప్పటికీ కేంద్రం సబ్సిడీ బియ్యం ఇస్తున్నది. కాంగ్రెస్ వాదన ప్రకారం ఇప్పుడున్న భరతమాత స్థానంలో నిరుపేద మహిళను భరతమాతగా ఎంపిక చేసుకోవాలేమో!
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు ఇంకా నాలుగేండ్లు మిగిలి ఉన్నాయి. మహిళలందరినీ కోటీశ్వరులను చేస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు పదే పదే చెప్తున్నారు. ఇప్పుడు మామూలుగా ఉన్న తెలంగాణ తల్లి కొత్త విగ్రహం స్థానంలో నాలుగేండ్ల తర్వాత కోటీశ్వరురాలైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెస్తారా?
ఏటా జీడీపీ లెక్కలు వస్తాయి. ఆ లెక్కలను బట్టి తెలంగాణ తల్లి రూపానికి మార్పులు చేస్తారేమో? కొందరు కవులకు కోటి రూపాయలు, హైదరాబాద్‌లో 300 గజాల భూమి నజరానాగా ప్రకటించారు. అయితే, ‘ఒకవైపు సాంస్కృతిక విధ్వంసానికి పాల్పడుతూ మరోవైపు నజరానాలా?’ అని ప్రముఖ కవి నందిని సిధారెడ్డి ఆ పురస్కారాన్ని తిరస్కరించారు. మరో కవి సుద్దాల అశోక్ తేజ మాత్రం కొత్త విగ్రహంలో తన తల్లి రూపం కనిపించిందని మురిసిపోయారు. ఈ నేపథ్యంలో ‘తెలంగాణ ఉద్యమంలో అశోక్ తేజ ఎక్కడ?’ అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో చంద్రబాబు నివాసంలో సుద్దాల చాలాసార్లు కనిపించారు. టీడీపీ ప్రచారానికి పాటలు రాశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ‘తలుపులు మూసి రాష్ర్టాన్ని విభజిస్తారా?’ అని టీడీపీ కోసం ఆయన పాటలు రాశారు. పాటలు రాయడం ఆయన వృత్తి. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వ చర్య తెలంగాణ కవుల మధ్య చిచ్చుపెట్టినట్టు అయింది. నజరానాల వల్ల ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం కన్నా వ్యతిరేక ప్రభావమే ఎక్కువ కలుగుతుంది.
అక్బర్ రోడ్ వంటి పేర్ల మార్పుతో బీజేపీ ఏ ప్రయోజనమైతే ఆశించిందో అది ఆ పార్టీకి దక్కింది. పేర్ల మార్పుపై కాంగ్రెస్ ఎంత వ్యతిరేకిస్తే బీజేపీకి అంత లాభం అది ఫలితాల్లో కనిపించింది కూడా. కానీ, తెలంగాణలో కాంగ్రెస్ చేస్తున్న ఈ పేర్ల మార్పుతో రేవంత్ రెడ్డి ఇగో సంతృప్తి పడవచ్చు. అంతిమంగా కాంగ్రెస్‌కే నష్టదాయకం. పైగా ఈ అంశం దేశవ్యాప్తంగా అన్ని చిహ్నాల మార్పునకు బీజేపీకి ఉపయోగపడుతుంది.
కాంగ్రెస్ వాదన, కాంగ్రెస్ అనుకూల కవుల వాదన ప్రకారం సగటు పేద మహిళలా తెలంగాణ మాత విగ్రహం ఉండాలనుకుంటే.. భరతమాత కూడా పేద మాతగానే ఉండాలి కదా? వాస్తవానికి, భారతమాత కిరీటం, బంగారు ఆభరణాలతోనే ఉంది కదా? ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో దేశంలోని 80 శాతం మంది ఇంకా దారిద్య్రరేఖకు దిగువనే ఉన్నారు. 80 కోట్ల కుటుంబాలకు ఇప్పటికీ కేంద్రం సబ్సిడీ బియ్యం ఇస్తున్నది. కాంగ్రెస్ వాదన ప్రకారం ఇప్పుడున్న భరతమాత స్థానంలో నిరుపేద మహిళను భరతమాతగా ఎంపిక చేసుకోవాలేమో!