‘ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు’ ఉన్నాయనే నానుడి సీఎం రేవంత్‌కు అతికినట్టు సరిపోతుంది. విపక్ష నేతగా ఆయన నోరుపారేసుకోవడం గురించి అప్పట్లో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. ఆ సంగతి ఏడాది దాటినా చాలామందికి ఎక్కనట్టుగానే ఆయనకూ ఎక్కడం లేదే మో. ఆయన విపక్షాలపై చేస్తున్న అడ్డూ అదుపూ లేని విమర్శలు, విప క్ష నేతలపై ఉపయోగిస్తున్న భాషే అందుకు నిదర్శనం. సభ్య సమాజం తలవంచుకునే స్థాయిలో పెద్దా చిన్నా తేడా లేకుండా చేస్తున్న వ్యాఖ్యలపై ప్రజలకే కాదు, ఆయన సొంత పార్టీ కాంగ్రెస్‌లోనూ అంతర్గతంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు తెలుస్తున్నది. అత్యంత దుర్భరమైన భాష ఉపయోగించిన సీఎంగా రికార్డు సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం హఠాత్తుగా ‘ప్రతిపక్ష సహకారం’ గురించి మాట్లాడటం కొంత వింతగానే తోస్తున్నది. ఇష్టారాజ్యంలో ఈ బేలతనం ఎక్కడినుంచి వచ్చిదూరింది. ఇందుకు ఏదైనా కారణం ఉందా?
ప్రతిపక్షం బాధ్యత ప్రశ్నించడం. అలా ప్రశ్నించినందుకు కేసులు పెడుతూ వేధిస్తున్నారు. ఆ ప్రతిపక్షాన్నే ఇప్పుడు సహకరించమని అడుగుతున్నారా? అంటుకు లేకుండా చేస్తా.. మళ్లీ మొలకెత్తకుండా చూస్తా.. అంటూ అంతెత్తు ఎగిరెగిరి పడుతున్న సీఎంకు అసలు సహకారం అనే పదానికి అర్థం తెలుసా? అని సందేహం కలుగక మానదు. ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై పాలక పక్ష కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నారు. విధ్వంసం సృష్టిస్తున్నారు. బహిరంగ సమావేశాల్లో విపక్ష ఎమ్మెల్యేలపై బాహాటంగా హింసకు దిగుతున్నారు. పోలీసు బలాన్ని ప్రయోగిస్తున్నారు. ఓ వైపు ఇలా నోరు మూయిస్తూనే మరోవైపు సలహాలు ఇమ్మని గడుసుగా అడుగుతున్నారు. తన అసమర్థ, అర్థరహిత పాలనతో విశ్వనగరం హైదరాబాద్ పరువు గంగలో కలిపారు. ఇప్పుడు విపక్షాలు సహకరిస్తే విశ్వనగరంగా తీర్చిదిద్దుతానని వింత వ్యాఖ్యానం చేస్తున్నారు. పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని ఏడాదిలో విధ్వంసం పాలు చేసి ఇప్పుడు ఏదో సాధిస్తానని సీఎం రేవంత్ అనడం విడ్డూరమే.
నోటితో నవ్వుతూ నొసలుతో వెక్కిరించినట్టుగా ఉంది సీఎం ధోర ణి. విపక్షాలను సభల్లో మాట్లాడనివ్వరు. సభలు పెట్టుకోనివ్వరు. ప్ర జా సమస్యలపై ధర్నాలు చెయ్యనివ్వరు. ఇప్పటిదాకా ఒక్క అఖిలపక్ష సమావేశమైనా జరపలేదు. పాలకపక్షం, ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వమని ఇప్పుడే గుర్తుకు వచ్చినట్టుంది. కానీ, ఇవి మనసులోంచి వచ్చిన మాటలు కావు. ఇదంతా ప్రజాస్వామ్యాన్ని భ్రష్ఠు పట్టిస్తున్నారనే విమర్శల నుంచి తప్పించుకునేందుకు చేస్తున్న ప్రయత్నం తప్ప మరోటి కాదు. ఈ మాటలు మనస్ఫూర్తిగా అన్నవే అయితే పీఏసీ చైర్మన్ పదవిని విపక్షానికి కాకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేకు ఎందుకు కట్టబెట్టినట్టు? గత ఏడాది కాలంలో ప్రతిపక్షాల సలహా ఎన్నడూ అడుగలేదు. అడుగకుండా ఇచ్చినా పాటించలేదు. ధర్మ పన్నాలు, నీతిసూక్తు లు వల్లించడం వల్ల ఫలితం ఏమిటి? చిత్తశుద్ధితో కూడిన ఆచరణలో అవి ప్రతిఫలించాలి.