e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 8, 2021
Home News ఉద్యోగం - ఉపాధి

ఉద్యోగం – ఉపాధి

  • కేసీఆర్‌ అభివృద్ధి నమూనా

రాష్ట్ర ప్రభుత్వ కృషి, అకుంఠిత దీక్షతో పాటు, క్షేత్రస్థాయి నుంచి సునిశితంగా సమస్యను అర్థం చేసుకొని, విశ్లేషించి, మానవీయ కోణంలో ఆ సమస్యను పరిష్కరించేలా మార్గనిర్దేశకత్వం చేయగలిగిన సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తున్నది. వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక, సేవారంగాల్లోనూ మన తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది.

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్య నిరుద్యోగం. ఈ సమస్యను ఎదుర్కోవడం ప్రభుత్వాల విధానాల మీదనే ఆ రాష్ట్ర అభివృద్ధి, అంతిమంగా దేశాభివృద్ధి ఆధారపడి ఉంటుంది. నిరుద్యోగ సమస్య ఇప్పటికిప్పుడు ఏర్పడింది కాదు. ఇది జాతీయ, అంతర్జాతీయ సమస్య. దశాబ్దాలుగా అటు దేశంలో, ఇటు రాష్ర్టాల్లో పేరుకుపోయింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం అనతికాలంలోనే అనుబంధ సంస్థలతో పాటు ఐటీ, రియల్‌ ఎస్టేట్‌, ఫార్మా తదితర రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించింది. దానితో పాటుగా వ్యవసాయం, పశుపోషణ, చేపల పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు లభించాయి. వాస్తవం ఇలా ఉంటే.., అభివృద్ధి నిరోధకులు వాస్తవాలను విస్మరించి యువతను రెచ్చగొడుతూ, పక్కదారి పట్టిస్తూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఫలాలు క్షేత్రస్థాయిలో దళిత, బహుజనవర్గాలకు అందజేయడంలో కేసీఆర్‌ విజయవంతం అయ్యారు. అందుకే ప్రజలు టీఆర్‌ఎస్‌కు అండగా నిలుస్తున్నారు.

- Advertisement -

మానవాభివృద్ధి సూచిలో తలసరి ఆదాయం కీలక భూమిక పోషిస్తుంది. కొత్త రాష్ట్రమైనా తలసరి ఆదాయంలో తెలంగాణ అద్భుత విజయాలను సాధించింది. 2014-15లో 1.24 లక్షలుగా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం, 2020-21 నాటికి 2.37 లక్షలకు చేరింది. ప్రస్తుతం దేశ తలసరి ఆదాయం కంటే 5.8 శాతం అధిక వృద్ధిలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. 2014-15లో 11వ స్థానం నుంచి 2020-21 నాటికి 3వ స్థానానికి ఎగబాకింది. అందుకు తెలంగాణ ప్రభుత్వం కల్పించిన ఉద్యోగ, ఉపాధి, అభివృద్ధి పథకాలు నిర్ణయాత్మక పాత్ర పోషించాయి.

రాష్ట్రంలో కేసీఆర్‌ నాయకత్వాన తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ గత ఏడేండ్లుగా చేస్తున్న కృషి ఫలితంగా తెలంగాణ పారిశ్రామికంగా అధ్భుత విజయాలను సాధించింది. దేశంలోనే గొప్ప పారిశ్రామిక విధానంగా పేరు సంపాదించగలిగింది. వినూత్నరీతిలో తెలంగాణ టీఎస్‌-ఐపాస్‌ ద్వారా వేగంగా, సులభంగా, అవినీతికి తావు లేకుండా అనుమతులు మంజూరు చేయడం తోపాటుగా, మౌలిక సదుపాయాలు కల్పిస్తుండటంతో ఇప్పటికే దాదాపు 2.14 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించగలిగింది. 2014-15లో 66,276 కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు 2020-21 నాటికి రెండు రెట్లు దాటి 1.45 లక్షల కోట్లకు పెరగడం, తద్వారా 3 లక్షల మందికి పైగా ఐటీ ఉద్యోగాలు కల్పించడం అసాధారణం. ప్రపంచం అబ్బురపడేలా అతిపెద్ద ఫార్మా కారిడార్‌ ఏర్పాటుకానున్నది. దీనితో మరొక 5 లక్షల మందికి ఉపాధి దొరకనున్నది. దీంతో తెలంగాణలో నిరుద్యోగ శాతం క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. జాతీయ నిరుద్యోగిత రేటు 6.5గా ఉంటే మన రాష్ట్ర నిరుద్యోగిత రేటు 4.5గా నమోదైందని ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియ న్‌ ఎకానమిక్‌ సర్వే ఆన్‌ అన్‌ఎంప్లాయిమెంట్‌ రేట్‌ ఇన్‌ ద స్టేట్స్‌’ నివేదికలో వెల్లడైంది. వీటితో పాటుగా బలహీనవర్గాలకు పారిశ్రామిక రంగంలో చేయుతనిచ్చేలా దళితులకు 24,426 యూనిట్ల ద్వారా 1,081 కోట్లు, ఎస్టీలకు 24,440 యూనిట్ల ద్వారా 1,016 కోట్లు, దివ్యాంగులకు 1,536 యూనిట్ల ద్వారా 83 కోట్ల సబ్సిడీలు అందజేసింది. వీ-హబ్‌ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం; టీ-హబ్‌ ద్వారా స్టార్టప్‌లతో పారిశ్రామికరంగం మరింతగా అభివృద్ధి చెందుతున్నది.

సుస్థిరాభివృద్ధిలో పారిశ్రామికరంగంతో పాటు వ్యవసాయరంగం కీలక భూమిక పోషిస్తుంది. స్వతహాగా వ్యవసాయాధారిత కుటుంబం, ఉద్యమ నేపథ్య అనుభవాల నుంచి వచ్చిన కేసీఆర్‌ ఉపాధి మార్గాలు అన్వేషించడంలో మూలాల్లోకి వెళ్లారు. నూతన ప్రాజెక్టుల నిర్మాణం, నిరంతర విద్యు త్‌, మిషన్‌ కాకతీయ అమలు ద్వారా రాష్ట్రంలో వ్యవసాయరంగానికి పునరుజ్జీవం పోశారు. కులవృత్తులను సైతం ప్రోత్సహించడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి.

రాష్ర్టాభివృద్ధి కొనసాగుతున్న అసాధారణ పాలన మింగుడుపడని విపక్షాలు కేవలం అధికార దాహంతో కువిమర్శలు చేస్తున్నా యి. విమర్శలు నిర్మాణాత్మకంగా, పురోగమనానికి ఉపయోగపడేలా ఉండాలి. కానీ రాజకీయ కువిమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమో యువత ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వం 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసింది. ఇతర ఉద్యోగుల జీతాలు పెంచి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచింది. ఉద్యమస్ఫూర్తితో సకలజనుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నది కేసీఆర్‌ ప్రభుత్వం. సబ్బండవర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా అన్నిరంగాలను సమన్వయపరుస్తూ.. సమ్మిళిత అభివృద్ధి, సుస్థిరాభివృద్ధి భావనలకు ప్రతీకగా నిలిచింది. సంక్షేమ ఫలాల లబ్ధిలో భాగస్వాములైన ప్రజలు ఈ ప్రభుత్వానికి, కేసీఆర్‌కు అండగా ఉండటంలో అతిశయోక్తి లేదు.
(వ్యాసకర్త: వీసీ, కాకతీయ యూనివర్సిటీ)

ప్రొఫెసర్‌ తాటికొండ రమేష్‌
97016 82924

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement