రైతు రుణమాఫీ పర్వంలో మరో ముందడుగు పడింది. కర్షక సంక్షేమంలో వెనుకకు పోయే ప్రసక్తేలేదని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చాటుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కేంద్రం సహాయ నిరాకరణ ధోరణి, కరోనా కల్లోలం వల్ల వెనుకతట్టు పట్టిన రుణమాఫీని పరుగులు పెట్టించేందుకు నడుం బిగించారు. మరో విడత రుణమాఫీని వెంటనే చేపట్టాలని, నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తికావాలని ఆయన అధికారులను ఆదేశించారు. రూ.36 వేల లోపు రుణాలను ఇదివరకే మాఫీచేసి రూ.17 వేల కోట్ల భారాన్ని ఎత్తుకున్న ప్రభుత్వం ఇప్పుడు 29.61 లక్షల రైతుకుటుంబాలకు లబ్ధి కలిగేలా రూ.లక్ష లోపు రుణాలు రద్దుచేయాలని నిర్ణయించడం విశేషం. ఇందుకు సర్కారు మీద పడే భారం అక్షరాలా రూ.19 వేల కోట్లు. ఎన్ని అడ్డంకులు, సవాళ్లు ఎదురైనా అన్నదాతల సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధిని విస్మరించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేయడం ప్రశంసనీయం.
మన రాష్ట్రంలో కేవలం రైతు సంక్షేమానికి చేపట్టిన పథకాలు విశిష్టమైనవని చెప్పాలి. రైతు లేనిదే రాజ్యం లేదని గట్టిగా నమ్మే సీఎం కేసీఆర్ ముందుగా మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువుల తుప్పు వదిలించారు. అధిక నీటి నిల్వకు వీలు కల్పించారు. ఆ తర్వాత కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో మూలమూలలకు నీటిని పారించారు. 24 గంటల ఉచిత కరెంటుతో బాయిలకాడి కష్టాలకు ముగింపు పలికారు. రైతుబంధుతో సాగుపెట్టుబడి సమకూర్చారు. రైతుబీమాతో కుటుంబాలకు ధీమా ఏర్పరిచారు. విత్తనాలు, ఎరువులు సకాలంలో దండిగా సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు రుణబాధ నుంచి విముక్తి కల్పించారు. తమ ప్రభుత్వానికి రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యమని చెప్పుకొనే సీఎం కేసీఆర్ దానిని ఆచరణలో చూపారు.
రుణవిముక్తి అనేది రాత్రికిరాత్రే కాగితం మీద సంతకం పెడితే అయ్యేది కాదు. దానికి ఎంతో లోతైన ఆలోచన, తగిన ప్రణాళిక అవసరం. ఏదైనా చేస్తే పక్కాగా చేయాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన. రకరకాల సమస్యలతో అడ్డంకులతో కొంత ఆలస్యమైనప్పటికీ సరైన సమయం రాగానే హామీని ఆచరణలో పెట్టారు. అదీ సుదీర్ఘకాలం సాగలాగకుండా 45 రోజుల గడువులో రుణమాఫీ ప్రక్రియ పూర్తిచేయాలని సూచించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. విపక్షాల పనిలేని విమర్శలకు చెంపపెట్టు లాంటి నిర్ణయం ఇది. ఉచిత కరెంటుకు కోతలు పెట్టి రైతన్నకు కంటి మీద కునుకు లేకుండా చేయాలని చూస్తున్న కాంగ్రెస్ కూడా రుణమాఫీపై మాట్లాడటం వింత. రైతు కంట్లో కారం కొట్టి సాగును కార్పొరేట్ల పరం చేయాలని చూసి భంగపడ్డ బీజేపీ కూడా రైతు రుణాల మీద మొసలి కన్నీరు కారుస్తున్నది. ముందుగా ఆ రెండు పార్టీలు తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో చేస్తున్న మాఫీ ఎంతో ఆత్మపరిశీలన చేసుకోవాలి. అందుకే వారికి మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెప్పారు కేసీఆర్. రైతులను కంటికిరెప్పలా కాపాడుకునే సర్కారు మాదని చాటిచెప్పారు.