‘నేరమే అధికారమై ప్రజలను నేరస్థులను చేసి వెంటాడుతుంటే.. నోరుండి ఊరక కూర్చున్న ప్రతివాడూ నేరస్థుడే’ అన్నాడో మహానుభావుడు. నేరమే అధికారం పంచన చేరి పసికూన తెలంగాణ గొంతు నులిమేస్తూ పట్టుబడ్డ ఒకానొక పాపిష్టి ఘటన ఇంకా మన జ్ఞాపకాల్లో సజీవంగా మెదులుతూనే ఉన్నది. ‘మనవాళ్లు బ్రీఫ్డ్ మీ!’ అని బ్యాక్‌గ్రౌండ్‌లో అధికార పీఠం మీది స్వరం గర్వంగా పలుకుతుండగా.. సూట్‌కేసుల నుంచి నోట్ల కట్టలు తీసి సర్దుతున్న నగ్న దృశ్యం మదిల కదలాడుతూనే ఉన్నది. అయినా.. ఇంకా ‘చేపా చేపా ఎందుకు ఎండలేదు? అంటే.. గడ్డిమోపు అడ్డం వచ్చింది’ అనే పాత కథనే విందామా? ఆ గడ్డిపోచను పట్టుకొని కథ మూలాల్లోకి వెళ్తేనే కదా..!
గడ్డిమోపు ఎందుకు అడ్డం వచ్చిందో? చేప ఎండిందో? లేదో? తెలిసేది. చీమల పుట్టలో వేలు పెట్టిన విలన్ ఎవరో తేలేది. ఆనవాళ్లు లేకుండా చేస్తామనే విద్వేషపు ప్రతిన నుంచి జనించిన కరెంటు కొనుగోళ్ల మీద కమిషన్, కేసీఆర్ చుట్టూ కుట్ర కథలు అల్లుతున్న వేళ.. నవ తెలంగాణ విద్యుత్తు ఫలాలు అనుభవించిన నాలాంటి వాడు ఊరక కూర్చుండి పోవటం నేర దృక్పథమే అవుతుంది. అందుకే కేసీఆర్ జమానాల వెలుగులు పంచిన కరెంటు పోళ్ల వరుసను తడుముకుంటూ పాడుబడ్డ తెలంగాణ మూలాల్లోకి వెళ్తున్నా…!
Telangana | ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ పంపుసెట్లకు నెలవారీ ఫిక్స్డ్ కరెంటు బిల్లు పెట్టిండ్రు. త్రీ హెచ్‌పీ (హార్స్ పవర్) పంపులకు రూ.18, ఫైవ్ హెచ్ పీ పంపులకు రూ.25 చొప్పున బిల్లు కట్టాలని చెప్పిండ్రు. ఈ బిల్లు కట్టడానికి రైతులు నానా అవస్థలు పడేవాళ్లు. పుస్తెలు కుదవబెట్టి, దూడపెయ్యలను అమ్మి కరెంటు బకాయిలు కట్టేటోళ్లు. లేకుంటే అదో అరాచకం. కరెంటోళ్లు బావుల మీద పడి మీటర్లు, స్టార్టర్లు గుంజుకుపోయేటోళ్లు.
త్రీ హెచ్‌పీ మోటరు పంపు నిరంతరాయం గా మూడు గంటలు పోస్తే.. నిక్కి నీల్గి అర్ధ ఎ కరా పొలం తడిసేది. కానీ, మోటర్ ఆన్ చేస్తే.. కాల్వకు పారిన నీళ్లు మడికి మళ్లకముందే కరెం టు పోయేది. కాల్వల నీళ్లు కాల్వలనే ఇంకిపోయేవి. అర్ధ గంటకో.. గంటకో కరెంటు మళ్లొచ్చేది. మోటరు స్టార్ట్ చేస్తే మళ్లీ పాత కథే. ఎక రా పొలంలో వరి పెడితే తాలు, బొందు పోనూ 12 క్వింటాళ్ల ధాన్యం ఎల్లితే మహా గగ నం. ఆ రోజుల్లో క్వింటాల్ వడ్ల ధర రూ.100 లోపే. అటువంటి సంక్లిష్ట కాలంలో చంద్రబా బు ముఖ్యమంత్రి అయ్యిండు. ఎకాఎకిన త్రీ హెచ్‌పీ పంపు బిల్లు రూ.36, ఫైవ్ హెచ్‌పీ పంపు బిల్లు రూ.50కి పెంచుతూ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలను అదే ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు. ఆంధ్ర వ్యవసాయం, తెలంగాణ కాపురం రెండూ ఒకటి కాదని, తెలంగాణ రైతాంగానికి మోయలేనంత భారమైపోతుందని చంద్రబాబును నిలదీశారు.
కేసీఆర్ తిరుగుబాటుకు జంకిన చంద్రబాబు విద్యుత్తు చార్జీల పెంపు ప్రతిపాదనలను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. అప్ప టి వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర్రావును కలిసి మాట్లాడాలని కేసీఆర్‌కు సూచించారు. కేసీఆర్ ఆయన్ను కలిశారు. ఒక్కసారి కాదు, పదిసార్లు కలిసి మాట్లాడారు. కలిసిన ప్రతిసారి తన అభ్యంతరాలను విడమర్చి చెప్పారు. ‘తెలంగాణ బతుకు బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి అన్నట్టున్నది. ఇప్పటి కే విపరీతమైన కరెంటు కోతలున్నయి. పంట లు ఎండిపోతున్నయి. జనం వలస పిట్టలై పోతున్నరు. మీ ఆంధ్ర తీరుగ మాకు పారే నీళ్లు లేవు. మాది బావుల మీది కాపురం. కరెం ట్ బిల్లుల పెంపు వరి రైతుకు ఉరితాడు అయి ంది. వద్దు.. ఆ ప్రయత్నం సరికాదు. పెంపు ప్రతిపాదనలు ఆపండి’ అని వడ్డే శోభనాద్రీశ్వర్రావు వద్ద కేసీఆర్ మొరపెట్టుకున్నరు.
ఆ రోజుల్లో తెలంగాణ వ్యవసాయాన్ని గమనిస్తే… ఖరీఫ్ సీజన్లో ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 20 వరకు అంటే దాదాపు 35 రోజులు, రబీలో మార్చి 20వ తారీఖు నుంచి ఏప్రిల్ 20 వరకు దాదాపు 30 రోజులు సాగు పీక్ లో ఉండేది. పంట పొట్టకొచ్చి, గింజ పాలుబోసుకునే కాలమది. ప్రతి నీటిచెమ్మను ఒడిసిపట్టి మొక్కకు పోసే సమయం. రైతుకు నడుం లేప తీరిక ఉండదు. చెమట చుక్క కూడా వృథా పోకుండా చేనుకే అందాలన్నంత ఆరాటపడుతరు రైతన్నలు. సరిగ్గా అదే అదను మీద కరెంటు పోతది. ‘ఇగొస్తది.. అగొస్తది’ అని రైతులు కండ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తుంటరు. కరెంటు రాదు. కానీ, డీబు (ట్రాన్స్ఫార్మర్) కాలిపోయిందనే కబురొస్తది.
అప్పటికే పీకల దాకా అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి ఉంటరు. ఆ అచేతనం నుంచి ఏడుపొస్తది. బతుకు మీద యావగింపు వస్తది. పలుచని కన్నీటి పొర కనురెప్పలను ఆవహిస్తది. ఆ మసక పొరల నుంచి చూస్తే.. ఉరితాళ్లో.. పురుగుల మందుడబ్బాలో కనిపించేయి. లేదంటే.. పొలం గట్టు కొనాకున పిల్ల బాటల్ల ‘కరెంటు చార్జీలు దించాలె, ఏడు గంటల కరెంటు ఇయ్యాలె’ అని పిడికిళ్లు ఎత్తి నినదించే ఎర్రజెండాలొళ్ల గొంతులు వినిపించేవి. అప్పటి కమ్యూనిస్టు కార్యాలయాలు ప్రజా పోరాటాల వాకిళ్లు. మడి తడిసేంత కరెంటే రైతాంగం ఆకాంక్ష. కరెంటు ఇస్తరు.. జెర్ర జెండాలు ఎత్తమని ఒక్క పిలుపిస్తే చాలు వేల మంది బీద బిక్కి, బక్క రైతులు లాఠీలకు, తూటాలకు ఎదురుబోయేది. ఒక్క డీబు కోసం రైతాంగం రోడ్డు మీద ధర్నా చేసి ఒళ్లంతా కుళ్లిపోయేటట్టు పోలీ సు లాఠీదెబ్బ లు తిన్న సంఘటనలు అప్పట్లో లెక్కకు మిం చి ఉండేవి.
వడ్డే శోభనాద్రీశ్వర్రావు ఏం చెప్పిండో.. చంద్రబాబు ఏం విన్నడో గానీ, కేసీఆర్ మాటకు విలువ ఇవ్వకుండా 2000 సంవత్సరంలో కరెంటు చార్జీలు పెంచుతూ ఉత్తర్వులు వచ్చినయి. పెంచిన కరెంటు చార్జీలు దించాలని సీపీఎం, సీపీఐ, న్యూ డెమోక్రసీ, ఇతర వామపక్షాలు ఇచ్చిన పిలుపుతో రైతులు కదిలారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో రైతు ప్రదర్శన జరిగింది. ఎటువంటి హెచ్చరికలు లేకుండా చంద్రబాబు ప్రభుత్వం కాల్పులకు తెగబడ్డది. హైదరాబాద్‌కు నెత్తుటి మరకలు అద్దుతూ రక్తాక్షరాలు రాసింది.
చరిత్రలో జలియన్‌వాలాబాగ్ మారణకాండకు కారకుడైన జనరల్ డయ్యర్ తర్వాత మళ్లీ అంతటి నెత్తు రు చరిత్ర రాసింది చంద్రబాబే. 25 వేల మం ది రైతుల మీద కేసులు పెట్టింది నాటి టీడీపీ ప్రభుత్వం. అప్పుడు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్ ఈ దుశ్చర్యను తీవ్రంగా ఆక్షేపించారు. ఇది మోసమని గర్జించారు. రైతు హంతక ప్రభుత్వంలో తాను కొనసాగలేనని బహిరంగ లేఖ రాశారు. బరి గీసి ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమానికి ముగ్గుపోశారు. గులాబీ జెండాకు రూపం ఇచ్చి రైతుల పక్కన నిలబడ్డారు. ఇదంతా జరుగుతున్న నాడు ప్రస్తుత సీఎం రేవంత్ క్రియాశీలక రాజకీయాల్లోనే లేరు.
ఎట్టకేలకు కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిండు. రాజ్యమైతే తెచ్చిండు గానీ.. అది కరెంటు కోతలతోటి కటిక చీకట్లు కమ్ముకున్న అంధ రాజ్యం. రైతు ఆత్యహత్యల పరంపర సాగుతున్న ఆపదల రాజ్యం. రావ టం.. రావటంతోనే 5000 మెగావాట్ల విద్యు త్తు సంక్షోభాన్ని మూట కట్టి నెత్తి మీద పెట్టుకొని వచ్చింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 46.11 శాతం వాటాలు పంచిండ్రు. దీంట్లే మళ్ల దొం గలు మోపయిండ్రు. ఉమ్మడి రాష్ట్రంల ప్రైవేటు సంస్థల నుంచి 4000 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలు ఒప్పందం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చి కేసీఆర్ సీఎం అయ్యాక లెక్క తీస్తే.. రోజువారీగా 1800 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే వస్తున్నది. ఇందులో లీకేజీ లెక్కలు కూడా తీసుకుంటే సగటున 1600 మెగావాట్లు మాత్రమే లెక్కకు వచ్చేది.
కానీ, డబ్బు మాత్రం నిండా 4000 మెగావాట్లకు కట్టాల్సిందేనట. అదేమంటే పీపీఏ (పవర్ పర్చేజ్ అగ్రిమెంట్) ఒప్పందమే అట్లా ఉన్నదని కరెంటు సంస్థలు వాదిస్తున్నయి. ఇదే అంశాన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 జూన్ 13న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో చాలా నిర్వేదం తో ప్రస్తావించారు. ‘కరెంటు ఇచ్చినా.. ఇవ్వకపోయినా 4000 మెగావాట్లకు మనం డబ్బు లు చెల్లించాలి. ఇంతకన్నా ఘోరం ఉంటుం దా? అధ్యక్షా..! ప్రజాధనం ఇంత అన్యాయం గా, ఇంత దుర్మార్గంగా దుర్వినియోగం అవుతుంటే ఎలా? అది మన ఖర్మా? ఆ పాపం మన నెత్తిమీద పడ్డది. ఇప్పుడు నేను వీళ్ల మీద విమర్శలకు పోయి కొట్లాడి కాలయాపన చేసుకోవాలా? అంత సమయం మనకుందా? అధ్యక్షా..! మన రాష్ర్టాన్ని మనం పునర్నిర్మా ణం చేసుకునే పనిలో తలమునకలైన సమయాన్ని వృథా చేయదలుచుకోలేదు..’ అని చెప్పారు. గత పాలకుల అవినీతిని క్షమించటం వెనుక రాష్ట్ర విద్యుత్తు సంక్షోభాన్ని సాధ్యమైనంత వేగంగా అధిగమించాలనే తప న మినహా.. ఆయనకు కించిత్ అపవాదునైనా ఆపాదించగలమా? కమిషన్లు.. ఎంక్వయిరీలు అంటూ కాలయాపనతో ప్రజలను మోసం చేయపూనుకుంటే ఆయనను ఆపటం మన తరం అయ్యేదా?
దేశంలోనే నెంబర్‌వన్ ప్రభుత్వరంగ సంస్థకు నామినేషన్ పద్ధతిలో ఇచ్చామా? టెండర్ పద్ధతిలో ఇచ్చామా? అనేది ఇక్కడ ప్రశ్నే కాదు. ఎట్లా ఇచ్చినా అది చట్టబద్ధమే. దీనిమీద రాద్ధాంతం చేయడం అంత బుద్ధిహీనమైన పని ఇంకోటి ఉండదు. తెలంగాణ రైతాంగ పరిస్థితి, పరిశ్రమల మనుగడ క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు.. సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ అనే శాస్త్రీయ పదాల మీది తర్కం రైతు ఆత్మహత్యలను ఆపగలదా? ఆపదలో ఉన్న పారిశ్రామిక, వ్యవసాయరంగాలను ఆదుకోగలదా?
నాడు తెలంగాణ అంతా పీనుగుల కొంప అన్నట్టే ఉండె. రోజుకు నలుగురైదుగురు రైతుల ఆత్మహత్యలతోటి పల్లెలు తెల్లారేవి. ఒకరో ఇద్దరో రాత్రిపూట మోటరు పెట్టబోయి తేలో, పామో కరిచి మరణించేవాళ్లు. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గా న్ని ఆనుకొని ఉన్న రాయపోలు మండలంలో ఎల్కంటి (ఎల్కల్) అనే ఊరుంటది. తిప్పితిప్పి కొడితే 450 గడపలకు మించని చిన్న పల్లె అది. ఆ ఒక్క ఊరిలోనే అప్పటివరకు (2014లో తెలంగాణ వచ్చేవరకు) 35 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నరు. ఊరి పెద్ద ఎవరు? అని అడిగితే.. 35 మంది రైతులను మింగిన శ్మశానమే పెద్ద అని ఓ పెద్దమనిషి నిర్వేదంతో చెప్పిండు. కండ్ల ముందర ఇంతటి ఆపద పెట్టుకొని రాష్ట్ర పెద్దగా… ముఖ్యమంత్రి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? యుద్ధం లో బ్రిగేడియర్ తరహా నిర్ణయమే అనివార్యం కదా..! కేసీఆర్ అదే చేశారు. నామినేషన్ పద్ధతిలో బీహెచ్ఈఎల్తో భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ ఒప్పందం చేసుకున్నారు.
విద్యుత్తు పవర్ ప్లాంటు నిర్మాణంలో దేశంలోనే ‘ది బెస్ట్’ ప్రభుత్వరంగ సంస్థ అది. అప్పటికే వారి వద్ద సబ్‌క్రిటికల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణానికి అవసరమైన యంత్రాలు సిద్ధంగా ఉన్నా యి. తెలంగాణకు అత్యవసరంగా కరెంటు అవసరం ఉన్నది. ఇంతకుమించిన మోకా ఇం కేం కావాలి. మరో ఆలోచన లేకుండా మణుగూరులో 1,080 మెగావాట్ల సామర్థ్యం గల భద్రాద్రి థర్మల్ పవర్‌ప్లాంటు నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. దేశంలోనే నెంబర్‌వన్ ప్రభుత్వరంగ సంస్థకు నామినేషన్ పద్ధతిలో ఇచ్చామా? టెండర్ పద్ధతిలో ఇచ్చామా? అనేది ఇక్కడ ప్రశ్నే కాదు. ఎట్లా ఇచ్చినా అది చట్టబద్ధమే. దీనిమీద రాద్ధాంతం చేయడం అంత బుద్ధిహీనమైన పని ఇంకోటి ఉండదు. తెలంగాణ రైతాంగ పరిస్థితి, పరిశ్రమల మనుగడ క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు.. సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ అనే శాస్త్రీయ పదాల మీది తర్కం రైతు ఆత్మహత్యలను ఆపగలదా? ఆపదలో ఉన్న పారిశ్రామిక, వ్యవసాయరంగాలను ఆదుకోగలదా?
ఇంటి కరెంటు పుట్టి పావనకు రావటానికి కనీసం రెండేండ్ల సమయం పడుతుంది. ఈ రెండేండ్ల కాలం గట్టెక్కేదారి లెంకుతున్న క్రమంలో పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ దొరికిం ది. అప్పటికే అక్కడినుంచి తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాలు కరెంటు కొనుక్కొని పోతున్న యి. కేసీఆర్ మనకో 2000 మెగావాట్లు బేరం జేసిండు. ముందుగాల 1000 మెగావాట్లు, అటెన్క మరో 1000 మెగావాట్ల కరెంటు ఇయ్యాలని ఒప్పందం కుదిరింది. ఇక్కడ ఇంకోమాట చెప్పాలి. తమిళనాడు రాష్ట్రం యూనిట్‌కు రూ.4.94 ధర పెట్టి కొన్నది. కర్ణాటక రాష్ట్రం యూనిట్‌కు రూ.4.33 ధరకు తీసుకున్నది.
కానీ, కేసీఆర్ ఎటువంటి భేషజాలకు పోకుండా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిని బతిలాడో, బామాలో రూ.3.90కే యూనిట్ కరెంటు కొనుక్కొచ్చిండు. దీంతో వ్యవసాయ, పారిశ్రామిక, ఉత్పాదక రంగాలు విద్యుత్తు సం క్షోభం నుంచి బయటపడ్డయి. మెల్లమెల్లగా 24 గంటల కరెంటు పల్లె చుట్టూ అలుముకున్నది. బోరుబాయి మోటరు నుంచి నీళ్లు దుని కి కాల్వ మడికి మళ్లింది. బీడు భూమి పచ్చబడ్డది. రైతు తెప్పరిల్లిండు.. అప్పులు తీరినయి.. ఆత్మహత్యలు ఆగినయి.. రైతన్న మొఖం జరంత తెల్లబడ్డది. నాబి సల్లగుంటే నవాబుకు జవాబు చెప్పవచ్చనే సామెత ఉండనే ఉంది కదా..! పుర్రెను ఏ పురుగు తొలిసిందో.. మనసుకు ఏం బుద్ధి పుట్టిందో పంటకు నీళ్లు పెట్టిన నీరటిని అనుమానించినం. పోతున్న ఆపదను పిలిచి పీటేసినం.
గాలివాటు మీదొచ్చిన పాలకులు పరిపాల న గాలికి వదిలి ప్రతిజ్ఞలు చేస్తున్నరు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని స్మరిస్తున్నరు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామంటే తెలంగాణ అస్తిత్వాన్ని హత్య చేయపూనుకోవడమే. కేసీఆర్ ఆనవాలు లేనిదెక్కడ? వేరు తెలంగా ణ కేసీఆర్. ఇంట్ల 24 గంటలు కరెంటు ఉండి, అది పంచిన వెలుగుజిలుగుల ఆనవా లు కేసీఆర్. కాళేశ్వరం నీళ్లతో తడిసి మురిసిన భూ తల్లి సిరులు ప్రసవిస్తే.. ఆ ధాన్యరాశుల ఆనవాలు కేసీఆర్. పాలన గాలికొదిలేసి ఆనవాళ్లు లేకుండా చేస్తామని కుట్రలు చేయటమంటే పచ్చబడ్డ తెలంగాణ నెత్తురు తోడే దుష్టకార్యమే. తెలంగాణలో వ్యవసాయక, పారిశ్రామిక విప్లవాన్ని తెచ్చిన కరెంటుకు అవినీతి ఆపాదించడం, విస్తృత ప్రచారంలోకి తేవడం రాజకీయ క్షుద్ర పన్నాగం. కమిషన్ విచారణ లేకుండానే నివేదిక ఇచ్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అసెంబ్లీలో చర్చకు రాకముందే లీకులు బయటికి వస్తున్నాయి. మబ్బుల చాటున దాక్కున్న మారీచుడు వెలుగుల మీద చేస్తున్న ఈ కూట యుద్ధాన్ని తెలంగాణ జన మే తిప్పికొట్టాలె. 24 గంటల కరెంటు, కాళేశ్వరం నీళ్లు లేని నాడు బలపడ్డ శ్మశానాలే తెలంగాణకు ఆనవాళ్లుగా మిగులుతాయి. రైత న్నా తస్మాత్ జాగ్రత్త.
– వర్ధెల్లి వెంకటేశ్వర్లు