భారతదేశం ఆర్థికశక్తిగా ఎదగడం గురించి ఇటీవలి కాలంలో మాటలు ఎక్కువగా వినబడుతున్నాయి. జీ-20 సమావేశం నేపథ్యంలో ఈ ప్రచారం మరింత ఊపందుకుంటున్నది. అంచెలంచెలుగా పైపైకి ఎగబాకుతున్న జీడీపీ ఇందుకు దోహదం చేస్తున్నదని సర్కారు సమర్థకులు అంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితి వేరేగా ఉన్నది. పోటీ పడే మాట నిజమే. అందులో ఎటువంటి సందేహం లేదు. చైనా తర్వాతి స్థానం మనదే అనే మాట గురించే ఇక్కడ ఆలోచించాలి. రెండుదేశాల మధ్య ఉన్న అంతరం అంత చిన్నదేమీ కాదు. అనేక తాజా అధ్యయనాలు ఈ సంగతిని ఘోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తర్వాతి స్థానం అనేది చర్చనీయమవుతున్నది. ప్రస్తుత లెక్కల ప్రకారం కొవిడ్ కల్లోలం ముగిసిన మూడేండ్ల తర్వాత (2022) లెక్కతేల్చిన జీడీపీలో భారత్ కన్నా చైనా ఆరు రెట్ల ఆధిక్యంలో ఉన్నది. బెర్న్‌స్టీన్ సంస్థ తాజా నివేదిక ప్రకారం, స్థూల వాణిజ్య, ఆర్థిక కొలమానాల ప్రకారం చైనా కన్నా భారత్ సగటున 16.5 ఏండ్లు వెనుకబడి ఉన్నది. పేటెంట్లు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, నామ మాత్ర జీడీపీ, ఎగుమతుల వంటివి వాటిల్లో ఉన్నాయి. ఇక విడివిడిగా చూస్తే పేటెంట్లలో డ్రాగన్ కన్నా భారత్ 21 ఏండ్లు, ఎఫ్‌డీఐల్లో 20 ఏండ్లు, విదేశీమారక నిల్వల్లో 19 ఏండ్లు వెనుకబడి ఉండటం గమనార్హం. అంటే చైనా స్థాయి అందుకోవాలంటే చేయాల్సింది ఎంతో ఉన్నదని అర్థం.
దశాబ్ద కాలం కిందట ప్రపంచ జీడీపీలో 11వ స్థానం నుంచి భారత్ గతేడాది ఐదో స్థానంలోకి వచ్చింది. 2025 నాటికి నాలుగో స్థానానికి, 2027 నాటికి మూడో స్థానానికి చేరుకుంటుందని మోదీ సర్కారు ఊదరగొడుతున్నది. చైనా వృద్ధిలో వస్తున్న మందగింపు కొంత భారత్‌కు అనుకూలంగా ఉన్నది. భౌగోళిక-రాజకీయ కారణాల వల్ల చైనా వీడుతున్న అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేందుకు భారత్ ప్రయత్నిస్తున్నది. కానీ, ఈ విషయంలో మన కన్నా వియెత్నాం ముందుండటం విశేషం. భారత్‌లో యువశ్రామిక శక్తి అంతకంతకూ పెరుగుతున్నది. మన దేశంలో ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండటం కూడా సానుకూలాంశమే. కానీ, తలసరి ఉత్పాదకతలో చైనా మెరుగ్గా ఉన్నది. జీడీపీ వృద్ధి సాధించడం ఒక్కటే ఆర్థికవ్యవస్థకు ముఖ్య లక్ష్యం కాదు. ఉపాధి కల్పన కూడా ముఖ్యమైనదే. పెరిగిన జనాభాకు తగిన ఉపాధి కల్పించడంలో భారత్ చైనా కన్నా వెనుకబడి ఉన్నది. అలాగే సంపద పెంపులోనూ, పంపిణీలోనూ చైనా పైపైకి దూసుకుపోతున్నది. చైనా స్వదేశీ పెట్టుబడులు భారీగా సేకరించుకునేందుకు ఇది దోహదం చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో చైనా తర్వాత స్థానంలోకి భారత్ రావడం అనేది పెద్ద అసాధ్యమైన విషయం ఏమీ కాకపోవచ్చు. కానీ అంతరం ఎంత అనేదే అసలు ప్రశ్న.
2047 నాటికి, అంటే, స్వాతంత్య్రం వచ్చి వందేండ్లు పూర్తయ్యేనాటికి ఇండియా వర్ధమాన దేశం అనే ముద్రను వదిలించుకొని అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు గమనార్హం. ఇలాంటి నినాదాలు గతంలో ఆయన చాలా ఇచ్చారు. స్విస్ బ్యాంకుల్లోని నల్లధనం రూ.15 లక్షలు ప్రతి ఒక్కరి ఖాతాలో వేయడం కావచ్చు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడం కావచ్చు. ఇదీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇచ్చిన అలాంటి ఆడంబర నినాదం మాత్రమేనా అనేది ప్రశ్న. వెనకటికి ఒకడు నేను పరుగు పందెంలో 3వ స్థానంలో నిలిచానని ఘనంగా చెప్పుకొన్నాడట. పాల్గొన్నది ఎందరూ అంటే ముగ్గురేనని చెప్పాడట. ఆర్థికాభివృద్ధిలో మోదీ సర్కారు డాంబికాలూ ఇలాగే ఉన్నాయి.