సరిహద్దుల్లో చైనా మళ్లీ హల్చల్ చేస్తున్నది. ఆక్రమిత అక్సాయ్‌చిన్ ప్రాంతంలో భారీ సొరంగాలు నిర్మిస్తున్నట్టు వెలువడుతున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. 1962 యుద్ధంలో చైనా భారత్ నుంచి ఆక్రమించుకున్న అక్సాయ్‌చిన్ రెండు దేశాల మధ్య తెగని సమస్యగా మిగిలిపోయింది. ఆ భూభాగంలో చైనా సైనిక కార్యకలాపాలు ఇటీవల పెచ్చరిల్లినట్టు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తున్నది. ముఖ్యంగా సొరంగాలు తవ్వడం, వేదికలు కట్టడం అనుమానాలకు తావిస్తున్నది. అక్సాయ్‌చిన్, అరుణాచల్‌ప్రదేశ్ తమ భూభాగంలో భాగమని సూచిస్తూ చైనా గత సోమవారం ‘ప్రామాణిక రేఖాపటం’ విడుదల చేసిన నేపథ్యంలో ఈ వార్తలు వెలువడటం ఉద్రిక్తతలను మరింతగా పెంచుతున్నది. చైనా ఒక పథకం ప్రకారం ఆక్రమిత ప్రాంతాలను అధికారికంగా కలిపేసుకునేందుకు ప్రయత్నిస్తుందనేది బహిరంగ సత్యమే. 2023 ఏప్రిల్‌లో 11 ప్రదేశాలు, 2021లో 15 ప్రదేశాలు, 2017లో 6 ప్రదేశాలకు పేర్లు తగిలించి చైనా మ్యాపులు తయారుచేసింది. భారతదేశ భద్రతకు చైనా కార్యకలాపాలు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తున్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నది. చైనాను ఏదోరకంగా నిలువరించాలని, అంతకంటే ముందుగా ప్రధాని మోదీ ఈ అంశంపై నోరువిప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రధాని మోదీ అధికారంలోకి రాకముందు చైనా గురించి చాలా మాట్లాడారు. అప్పటి యూపీఏ సర్కారు చైనా పట్ల మెతకగా వ్యవహరిస్తున్నదని, తానైతే డ్రాగన్ ముఖంలో ముఖం పెట్టి కండ్లెర్ర చేసి చూస్తానని డంబాలు కొట్టారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అలాంటిది ఏదీ చేసిన దాఖలాలు కనిపించడం లేదు. చైనా యథేచ్ఛగా సరిహద్దు వెంబడి ఆక్రమిత ప్రాంతాల్లో గ్రామాలు నిర్మిస్తూ, సైనిక స్థావరాలు విస్తరిస్తూ పోతుంటే మోదీ ప్రభుత్వం మొక్కుబడి ప్రకటనలకు పరిమితం కావడం గమనార్హం. తాను అధికారంలో ఉండగా ఒక్క అంగుళం భూమి కూడా చైనాకు దక్కనీయనని ఇదివరకు ప్రధాని అన్న మాటలు ఉత్తుత్తి డాంబికాలేనని చైనా విస్తరణ ప్రణాళికలు చాటిచెప్తున్నాయి. ఇటీవలి కాలంలో చైనా దూకుడుగా ముందుకు వస్తున్నది. అప్పడప్పుడు హింసాత్మక ఘర్షణలకూ దిగుతున్నది. తన సైనిక సన్నద్ధతను పరీక్షించుకునేందుకే ఈ తరహా బలపరీక్షలకు పాల్పడుతున్నదని అమెరికా పసిఫిక్ సైనిక కమాండర్ గత నెల హెచ్చరించడం గమనార్హం.
మ్యాపుల వివాదంపై చైనా చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉంది. ఆ మ్యాపుల విడుదల అనేది రొటీన్ వ్యవహారమేనని, భారత్ అతిగా స్పందించకుండా ఉండాలని హితవు పలికింది. వాస్తవికంగా ఆలోచించి ప్రశాంతంగా ఉండాలని ఉచిత సలహా ఇచ్చింది. మూడేండ్ల కిందట జరిగిన గల్వాన్ ఘర్షణల్లో 20 మందికి పైగా భారత సైనికులు, అనేకమంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కనీసం ఒక్కసారంటే ఒక్కసారి ఉన్నతస్థాయి ద్వైపాక్షిక చర్చలు జరగలేదు. సెప్టెంబర్ 9-10 తేదీల్లో జరిగే జీ-20 శిఖరాగ్ర సభకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వస్తారనుకుంటే ఆయన కూడా రావడం లేదు. దీనితో ద్వైపాక్షిక చర్చలకు ఆస్కారం లేకుండా పోయింది.