బడి బయటే బాల్యం బండబారిపోతున్నది. ఆట పాటల్లో, చదువు సంధ్యల్లో మునిగితేలాల్సిన పిల్లలు ఏదో ఒక కారణంతో పలకాబలపానికి దూరమైపోతున్నారు. బడికి వెళ్లాల్సిన బాల్యానికి 6 నుంచి 17 సంవత్సరాల వయసును కొలమానంగా తీసుకుంటారు. ఈ వయోపరిధిలోని పిల్లలు బడిలో ప్రాథమిక లేదా హైస్కూల్ విద్యలో నమోదై ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ వయసు పిల్లలు చదువులు మానేయడం అంతకంతకూ పెరుగుతున్నది. ఓవైపు నమోదు తగ్గిపోతున్నది. మరోవైపు మధ్యలో చదువు మానేసేవారి సంఖ్యా పెరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా 2025లో ఇలాంటి పిల్లల సంఖ్య 27.2 కోట్లు దాటింది. యునెస్కో విశ్వ విద్యా పర్యవేక్షణ (జెమ్) బృందం తాజా నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. బడికి వెళ్లలేని/వెళ్లని చిన్నారుల సంఖ్య గతేడాది అంచనాలతో పోలిస్తే స్వల్పంగా (3.1%) పెరగడం గమనార్హం. మొత్తంగా చూస్తే బడివయసు పిల్లల్లో చదువుకోనివారు ప్రాథమిక దశ పిల్లలు 11 శాతం (7.8 కోట్లు), దిగువ సెకండరీ దశ పిల్లలు 15 శాతం (6.4 కోట్లు), ఎగువ సెకండరీ దశ పిల్లలు 31 శాతం (13 కోట్లు) ఉన్నారు.
రాజకీయ అస్థిరతలు, పేదరికం, వసతుల లేమి ఇందుకు ప్రధాన కారణాలని చెప్పక తప్పదు. ఘర్షణాత్మక ప్రాంతాల్లో బడికి వెళ్లలేని పిల్లల సంఖ్య రికార్డులకు ఎక్కిన దానికన్నా తక్కువే ఉంటుందని నివేదిక సూచించింది. ఉదాహరణకు గాజా వంటి నిత్య సంక్షుభిత ప్రాంతాల్లో లెక్కలు తీయడమూ అనేక ఇబ్బందులతో కూడుకుని ఉంటుందనేది తెలిసిందే. పిల్లలు చదువుకోలేకపోవడానికి లింగవివక్ష కూడా కారణమవుతున్నది. అఫ్గానిస్థాన్లో తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్న తర్వాత బాలికలు బడికి వెళ్లవద్దని నిషేధం విధించడంతో ఎందరో చదువుకు దూరమయ్యారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) సుస్థిర అభివృద్ధి లక్ష్యం 4 (ఎస్డీజీ-4) అనే చొరవను చేపట్టింది. ఇందులో ప్రభుత్వాలు తమతమ జాతీయ లక్ష్యాలు సాధిస్తే 2030 నాటికి చదువుకోలేని పిల్లల సంఖ్య 16.5 కోట్లకు తగ్గుతుందని అంచనా వేశారు. అయితే ఈ ఏడాది ఈ లక్ష్య సాధనలో 4 శాతం వెనుకబడిపోవడంతో 7.5 కోట్ల లోటు ఏర్పడటం ఆందోళన కలిగిస్తున్నది.
ఎస్డీజీ-4లో ఇండియా మిశ్రమ ఫలితాలు సాధించడం గమనార్హం. భారత్ స్కోర్ కొంత మెరుగుపడినప్పటికీ కొన్ని అంశాల్లో ఇంకా వెనుకబడి ఉన్నది. ప్రైమరీ స్కూళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంలో, ప్రీ-ప్రైమరీ టీచర్ల అర్హతల్లో ముందంజ సాధించినప్పటికీ తొలినాళ్ల శిశువిద్యలో, చూచి చదవడం వంటి విషయాల్లో సమస్యలున్నాయి. లక్ష్యాల సాధనకు మరింత ఉధృతంగా చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెప్తున్నది. కంప్యూటర్ యుగం నుంచి కృత్రిమమేధలోకి ఎగబాకుతున్న ప్రపంచంలో ఇంకా చదువుకు దూరమైన చిన్నారులు ఉండటం ఏ మాత్రం సమర్థనీయం కాదు. అత్యాధునిక ఆయుధాలతో అతి సూక్ష్మ లక్ష్యాలను సైతం ఛేదించగలుగుతున్న నేటి రోజుల్లో చిన్నారుల భవితవ్యంపై ప్రభావం చూపే విద్యా లక్ష్యాలను చేరుకోకపోవడం క్షంతవ్యం కాదు. చిన్నారులందరికీ ఎలాంటి వివక్షలు లేకుండా చదువు అందుబాటులోకి తేవడం రేపటి భవితకు భరోసా అని చెప్పక తప్పదు.