తెలంగాణ, ఆంధ్రకు 1956 దాకా ఉన్న ముఖ్యమంత్రులను పక్కకుతోసి అనూహ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవరెడ్డి తెలంగాణ పట్ల ఏనాడూ కనికరం చూపలేదు. విలీనపత్రం మీద సంతకం చేసిన సిరా తడి ఆరకముందే ఒప్పందాల ఉల్లంఘనలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన సంజీవరెడ్డి తెలంగాణ శాసనసభ్యుల్లో ఒకరిని ఉపముఖ్యమంత్రిగా నియమించాల్సిఉంది. ముందురోజు దాకా తను ఆంధ్ర రాష్ర్టానికి ఉపముఖ్యమంత్రిగా అధికారాన్ని అనుభవించి కూడా ఆ పదవి పరిపాలనకు ఏమీ అవసరం లేదని, అది ఆరో వేలు లాంటిదంటూ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించాడు.
1956 నుంచి 1960 దాకా ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి తన అధికారాన్ని సాగునీరు లేకుండా తెలంగాణను ఎండబెట్టడానికి బాగా ఉపయోగించుకున్నాడు. గోదావరి మీద ఉన్న ఇచ్చంపల్లి, దేవునూరు, పెన్‌గంగ, ప్రాణహిత ప్రాజెక్టులను ఆయన నిలిపివేశాడు. పోచంపాడు పథకాన్ని కుదించి 6 జిల్లాలకు బదులు రెండు జిల్లాలకే సాగునీరు అందేటట్టు డిజైన్ చేశాడు. కుదించిన ప్రాజెక్టు కూడా పూర్తిచేయకుండా తాత్సారం చేశాడు. దాంతో 1959 నుంచి 1969 దాకా ప్రాజెక్టు వ్యయం మూడు రెట్లు పెరిగింది. అంతేకాక కృష్ణా నదీ పరీవాహక ప్రాంత ప్రాజెక్టుల పట్ల కూడా వివక్ష చూపించాడు. విలీనం కంటే ముందే నల్లగొండలో నిర్మించాలనుకున్న ప్రాజెక్టును శంకుస్థాపన చేసిన విజయపురి దగ్గర కాకుండా కిందికి దింపి నందికొండ వద్ద నాగార్జునసాగర్ పేరుతో నిర్మించాడు.
ముందు అనుకున్నట్టు ఆ ప్రాజెక్టును ఏలేశ్వరం వద్ద నిర్మించి ఉంటే దశాబ్దాల తరబడి నల్లగొండ వాసులు ఫ్లోరైడ్కి బలయ్యేవారు కాదు. సుమారు 10 లక్షల ఎకరాలు నల్లగొండలో సాగయ్యేవి. అంతేకాదు, ఆ నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా కూడా తెలంగాణలో లక్ష ఎకరాల సాగు సంగతి వదిలేసి, ఆంధ్రలో లక్షల ఎకరాలకు ఆయకట్టును స్థిరీకరించారు. ఈ మార్పునకు ఆంధ్ర నాయకులకు శకుని సలహాలు ఇచ్చింది కె.ఎల్.రావు అనే ఇంజినీరు. ఆయన నెహ్రూ క్యాబినెట్లో నీటిపారుదల శాఖ మంత్రి. ఈ రకంగా గోదావరి, కృష్ణా ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి, వివక్షకు గురికావడం మూలంగా మహబూబ్‌నగర్ నుంచి వలసల పర్వం మొదలైంది.
ఈ అన్యాయాలు వ్యవసాయానికి సాగునీటిలోనే కాక, తాగునీరు, ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ జరిగింది. స్థానికత, ముల్కీ నిబంధనలను ఉల్లంఘించి యథేచ్ఛగా సచివాలయం, ఇతర ప్రభు త్వ ఉద్యోగాల్లో, ముఖ్యంగా ఉన్నత స్థాయి ఉద్యోగాలన్నిటిలోనూ ఆంధ్రులను నింపారు. తెలంగాణ వారి సీనియారిటీనీ లెక్క చెయ్యలేదు. వారితో పాటు అంతకుముందు నుంచీ ఉద్యోగా ల్లో ఉండి, నిజాం ప్రభుత్వంలో మంచి జీతాలు తీసుకున్నవారికి కూడా జీతాలు తగ్గించి, కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ఆంధ్రులతో వేతనాలు సమం చేశాడు. వారి నిరసనలన్నీ రోదనలే అయ్యాయి.
తెలంగాణ శాసనసభ్యుల ప్రశ్నలు, నిరసనలు అధిక మెజారిటీ ఉన్న ఆంధ్ర, సీమ సభ్యుల అరుపులతో అణచివేయబడ్డాయి. ఏ ప్రాంత ఆదాయం ఆ ప్రాంతానికే వెచ్చించాలనే ఒప్పందమే మర్చిపోయారు ఆంధ్ర నాయకులు.
నీలం సంజీవరెడ్డి పాలనలో ఇక్కడి ప్రజలకే కాదు, ఆంధ్ర ప్రజానీకానికి కూడా ఏమీ ఒరగలేదు ఆయన వల్ల. 1950 నుంచీ 1982 దాకా వివిధ స్థాయుల్లో అధికారంలో ఉండి కూడా కనీసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్థాపనకు వారికి సహాయం చేయలేదు. సంజీవరెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆంధ్ర ప్రజలు మురిసిపోయి విజయవాడ నుంచి ఏలూరు రోడ్డు వెళ్లే కూడలిలో అభిమానంగా ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1970లో ఆంధ్ర ఇంజినీర్లు ప్రతిపాదించిన స్టీల్ ప్లాంట్ ప్రారంభానికి నోచుకోలేదు. నీలం సంజీవరెడ్డి 1982లో భారత రాష్ట్రపతి పదవీ బాధ్యతల నుంచి దిగిపోయే ముందు అదే ఏడాది ఫిబ్రవరిలో ఇతరులు ఆ ప్లాంట్‌ను ప్రారంభించారు. సంజీవరెడ్డి సాయం చేయగలిగినప్పటికీ, ఏమీ చేయలేదన్న కోపంతో ఆంధ్ర ప్రజలు ఆయన విగ్రహాన్ని తవ్వి తీసి రైస్ కాలువలో విసిరేశారు. దాదాపు 45 ఏండ్లు అధికారంలో ఉన్నా ఆయన వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదు.
రెండో ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య (1960-1962), మళ్లీ ఒక ఏడాదికి పైగా సంజీవరెడ్డి (1962-1964) ముఖ్యమంత్రులుగా ఉన్నారు. 1964 నుంచి 1971 దాకా కాసు బ్రహ్మానందరెడ్డి, ఆ తర్వాత పి.వి.నరసింహారావు 1971-1973 దాకా అధికారంలో ఉన్నారు. ఆయన తర్వాత జలగం వెంగళరావు 1973-1978 దాకా నాలుగేండ్లు ముఖ్యమంత్రిగా పాలన చేశాడు. తర్వాత మర్రి చెన్నారెడ్డి 1978 నుంచి 1980 దాకా, టంగుటూరి అంజయ్య 1980 నుంచి 1982 దాకా ముఖ్యమంత్రులుగా ఉన్నారు. భవనం వెంకట్రామిరెడ్డి అతి తక్కువ కాలం 1982 ఫిబ్రవరి నుంచి ఆ ఏడాది సెప్టెంబర్ దాకా ఉన్నారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కూడా 1982 సెప్టెంబర్ నుంచి 1983 జనవరి దాకా ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1983 జనవరిలో ప్రభంజనం సృష్టించి ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు ఒక్క నెల తప్ప, 1989 సెప్టెంబర్ దాకా తెలుగుదేశం తరఫున ఎన్నికై ముఖ్యమంత్రిగా ఉన్నారు.
1989 నుంచీ మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చెన్నారెడ్డి (1989-90), ఎన్.జనార్దన్‌రెడ్డి (1990-92), కోట్ల విజయభాస్కర్‌రెడ్డి (1992-94), మళ్లీ గెలిచిన రామారావు (1994-95), ఆయనను వెన్నుపోటు పొడిచి గద్దె దించిన అల్లుడు నారా చంద్రబాబు నాయడు (1995-2004), వైఎస్ఆర్ (2004-09), రోశయ్య (2009-10), నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి (2010-14) దాకా ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలను గమనించాలి. ఒకటి, ఉపముఖ్యమంత్రి పదవి తెలంగాణవారికి రాకుండా శ్రద్ధ తీసుకుని, ఉమ్మడి రాష్ర్టానికి రాయలసీమ నాయకులు 27 ఏండ్ల 10 నెలలు, ఆంధ్ర నాయకులు 23 ఏండ్ల 6 నెలలు ముఖ్యమంత్రులుగా పనిచేసి, తెలంగాణను పీల్చి పిప్పి చేశారు. ఇక్కడి చెరువుల్లో పూడిక తీయకుండా తాంబాళాలుగా మార్చి నదీజలాలు యథేచ్ఛగా ఆంధ్ర ప్రాంతానికి తరలించుకుపోయారు. ఉద్యోగాల్లో వేల సంఖ్యలో ఆంధ్ర, రాయలసీమ వారిని నింపి లక్షల మందిని తెలంగాణకు తరలించారు. ఇక మిగులు నిధుల దోపిడీ యథేచ్ఛగా అందరు ఆంధ్ర ముఖ్యమంత్రులూ చేశారు. ఆంధ్ర నుంచి తెలంగాణకి వచ్చి ఉమ్మడి ఏపీకి సీఎంలుగా చేసినవారి ఆస్తుల లెక్కలు 1956 నవంబర్లోనూ, 2014 జూన్‌లోనూ పరిశీలిస్తే, దోపిడీ ఎంత జరిగిందో తెలుస్తుంది.
ఇక రెండో విషయం, తెలంగాణ నుంచి ముగ్గురు మాత్రమే ముఖ్యమంత్రులయ్యారు. ప్రాంతాలకు సమన్యాయం జరగకుండా వలస పాలకులు చాలా జాగ్రత్తపడ్డారు. చెన్నారెడ్డి రెండువిడతల ముఖ్యమంత్రి కాలాన్ని కూడా కలిపి తెలంగాణకు చెందిన ముగ్గురు కేవలం 6 ఏండ్ల 3 నెలలు ముఖ్యమంత్రులుగా ఉన్నారు, కాదు ఆంధ్ర నాయకులు ఉండనిచ్చారు. ఏదో ఒక గొడవ చేసి ముగ్గురిని వారి టర్మ్‌లో మూడో వంతు కాకుండానే పదవి నుంచి దింపేశారు. భారతదేశాన్నే పూర్తి కాలం అఖండంగా పాలన చేసిన పి.వి.నరసింహారావు కూడా వారి చతురతకు బలయ్యారు. చెన్నారెడ్డిని దింపడానికి వైఎస్ఆర్ కష్టపడ్డాడు. తమ రాయలసీమ రౌడీలను, గూండాలను రప్పించి పాతబస్తీలో వందలాది మందిని ఊచకోత కోయించి, మత కలహాలు సృష్టించి, చెన్నారెడ్డిని గద్దె దింపేట్టు చేశాడు. చిత్రం ఏమిటంటే.. 1950 నుంచీ ఈ ఆంధ్ర నాయకులు తమ బాగు, అధికారం కోసం బతికారే తప్ప, అటు ఆంధ్ర ప్రజలకు గాని, ఇటు ఆక్రమించిన తెలంగాణ ప్రాంతానికి గాని ఏమీ మేలు చేయలేదు. వారు మాత్రం కుబేరులయ్యారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ 57 ఏండ్ల 7 నెలల 1 రోజు పాటు ఆంధ్ర పాలకుల వివక్ష, దోపిడీకి గురై, వారి ఆధిపత్య ధోరణిని భరించాల్సి వచ్చింది. వారు చేసిన ద్రోహపు పనులన్నీ చెప్పడానికి ఒక వ్యాసం చాలదు. పెద్ద గ్రంథమే అవుతుంది. మచ్చుకి కొన్ని చూద్దాం.
1. అధికారం: విలీనం జరిగిన వెంటనే ఉపముఖ్యమంత్రి పదవి తెలంగాణకు ఇవ్వకుండా అధికారం మొత్తం తమ చేతిలో ఉండేటట్టు జాగ్రత్తపడ్డారు వలస పాలకులు. మొదటి రోజు నుంచి జరిగిన ఈ వివక్ష, దోపిడీపై శాసనసభలో తెలంగాణ సభ్యులు చాలాసార్లు ప్రశ్నించారు. చొక్కారావు వంటి వారు సాగునీరు, నదీజలాల గురించి అనేకసార్లు ప్రశ్నించారు. కానీ, తెలంగాణ అభివృద్ధి కోసం 105 మంది స్థానిక సభ్యులు అడిగినప్పుడల్లా వారి మాటను 140 మంది పరాయి ప్రాంత వలసవాదులు చెల్లనిచ్చేవారు కాదు. ఈ పశుబలం పోవాలంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటమే తప్ప, ఇంకేం పరిష్కారం ఉంటుంది?
2. నీళ్లు: పటేల్, పట్వారీ వ్యవస్థను నిర్మూలించి ఆంధ్ర నాయకులు తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదు. పల్లెల్లో ఉన్న 45 వేల చెరువుల పట్ల శ్రద్ధ తీసుకునేవారు లేకపోయారు. వీటిని పూడికతీయక తాంబాళాల లాగ తయారు చేసి పై నుంచి నీరంతా ఆంధ్రకే పారించుకున్నారు వలస పాలకులు. అక్కడ ఉద్యోగాలు చేసే ఎంఆర్వో, వీఆర్వోలలో కూడా 90 శాతం ఆంధ్రవారే. అందుకే పల్లె, పట్టణ జీవితం ఛిద్రమైంది. హడావుడి నాటకాలే తప్ప, ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు మంత్రులు, ముఖ్యమంత్రులు. నీటిపారుదల శాఖకు తెలంగాణవారు మంత్రులుగా ఉన్నప్పటికీ, నిర్ణయాలన్నీ ముఖ్యమంత్రుల చేతుల్లోనే, హోంమంత్రి తెలంగాణ వాడున్నా టోపీవాడి నెత్తి మీద; లాఠీ ముఖ్యమంత్రి చేతుల్లో. ఇక ప్రత్యేక రాష్ట్రం తప్ప ఈ సమస్యకు పరిష్కారమేదీ?
3. నిధులు: 1956 నవంబర్ 2 నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రకు నీళ్లే కాదు, నిధులు కూడా యథేచ్ఛగా పారాయి. వీటి లెక్కలు వచ్చే వ్యాసంలో! ఏ ప్రాంత నిధులు ఆ ప్రాంతానికే అన్న నోళ్లే ‘మాకాయుష్షు, మాకారోగ్యం, మాకు ధనం, మీకు రణం’ అన్నట్టు ప్రవర్తిస్తే.. ప్రత్యేక రాష్ట్రం కాకుండా పరిష్కారమేదీ?
4. నియామకాలు: విలీనమైనప్పుడు ఆంధ్ర నాయకులు ఉద్యోగ నియామకాలకు ఒప్పుకొన్న నిష్పత్తిని ఎప్పుడూ పాటించలేదు. అంతేకాదు, క్లాస్ 1, 2, 3 ఉద్యోగాలలో 98 శాతం ఆంధ్రవాళ్లకి, క్లాస్ 4 ఉద్యోగాలన్నీ తెలంగాణ వారికే! అంత వివక్ష చూపించిన ఆంధ్ర నాయకుల పాపాలు పండి రాష్ట్రం విడిపోయింది. 1956 నవంబర్ 1 నుంచీ 1968 దాకా లెక్కలేనన్ని అన్యాయాలు, అవినీతి, వివక్ష, అక్రమాలు చూసిన తెలంగాణ ప్రజలకు సహనం నశించింది. 1968 నుంచి 1969 దాకా దాదాపు 10 నెలలు అప్రతిహతంగా సాగిన తొలి ఉద్యమం సుదీర్ఘ ప్రజా శాసనోల్లంఘన ఉద్యమంగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. వివరాలు వచ్చే వ్యాసంలో..
-కనకదుర్గ దంటు