సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై సుప్రీంకోర్టు ఆవరణలో, అదీ ఆయన విచారణ జరిపే న్యాయస్థానంలో జరిగిన దాడి అత్యంత గర్హనీయమైనదని చెప్పక తప్పదు. పైగా ఆ దాడి జరిపింది పిన్నలకు మంచిచెడ్డలు చెప్పాల్సిన ఓ వయోవృద్ధుడైన న్యాయవాది కావడంతో వల్ల కూడా ఈ చర్య మరింత హేయమైనదిగా మారింది. ఆయన ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోవడం దారితప్పిన ఆయన మానసిక స్థితిని తెలియజేస్తున్నది.
ధర్మాసనంపై కూర్చున్న ప్రధాన న్యాయమూర్తిపైకి న్యాయవాది పాదరక్ష విసరడమనే చర్య ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. భారతదేశ న్యాయవ్యవస్థ చరిత్రలో ఇలాంటిది ఎన్నడూ కనీవినీ ఎరుగనిది. ఇది మొత్తంగా న్యాయవ్యవస్థపై, రాజ్యాంగంపై జరిగిన దాడిగా భావించాలి. న్యాయమూర్తికి న్యాయస్థానంలోనే రక్షణ లేదనే దుర్మార్గపు సంకేతాన్ని ఈ దాడి వెలువరిస్తున్నది. పాలకపక్షం నుంచి న్యాయవ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతున్న తరుణంలో ఈ దాడి జరగడం ప్రజాస్వామ్యవాదులను తీవ్ర కలవరానికి గురిచేసింది. దేశ సర్వోన్నత న్యాయవ్యవస్థకు ప్రతీకలా నిలిచే ప్రధాన న్యాయమూర్తి మీదనే దాడి జరగడం క్షమార్హమైన విషయం కాదు.
భారత ప్రధాన న్యాయమూర్తి యథాలాపంగా చేసిన ఓ వ్యాఖ్యపై దాడిచేసిన వ్యక్తికి అభ్యంతరం ఉండొచ్చు. దానిపై నిరసన తెలిపేందుకు సవాలక్ష మార్గాలున్నాయి. అలా కాకుండా అభ్యంతరకరమైన రీతిలో దాడికి తెగబడటం గర్హనీయం, అందుకు ‘సెంటిమెంట్’ను సాకుగా తీసుకోవడం హాస్యాస్పదం. బీఆర్ఎస్ నేత కేటీఆర్ చెప్పినట్టు దేశంలో ప్రస్తుత పరిపాలనా యంత్రాంగం నీడలో విస్తరిస్తున్న విద్వేషపూరిత, అసహన వాతావరణానికి ఈ ఘటన అద్దం పడుతున్నది.
ఓ లిఖిత రాజ్యాంగం పర్యవేక్షణలో చట్టబద్ధమైన పాలన అమలయ్యే అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి తలవంపులు తెచ్చే చర్యగా దీన్ని ప్రతిఒక్కరూ ఖండించాలి. ఈ నేపథ్యంలో జస్టిస్ గవాయ్ స్పందన ఆలోచింపజేసేదిగా ఉన్నది. సదరు వ్యక్తిపై కేసును పెట్టబోవడం లేదని స్పష్టం చేయడమే కాకుండా విసిరిన చెప్పును తిరిగి అతడికే పంపించడం ద్వారా సీజేఐ కార్యాలయం స్థితప్రజ్ఞతను, హుందాతనాన్ని చాటుకున్నది.
ఈ దేశంలో న్యాయవ్యవస్థకున్న ప్రాముఖ్యం తెలియనిది కాదు. చట్టబద్ధ పాలన అమలయ్యే తీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ప్రజాస్వామ్యాన్ని కంటికి రెప్పలా కాపలా కాసే న్యాయవ్యవస్థ ఉన్న దేశమిది. ఈ ఘటనపై ఇటు మీడియా చాపల్యంతో రాజకీయపక్షాలు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటే, అటు సోషల్ మీడియాలోనూ తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు, దుష్ప్రచారం జరుగుతున్నాయి. న్యాయవ్యవస్థపై జరిగిన దాడిపై ప్రభుత్వ పెద్దల స్పందన అంతంత మాత్రంగా ఉండటం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని సందేహాస్పదం చేస్తున్నది.
సదరు సీనియర్ న్యాయవాది సభ్యత్వాన్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ రద్దు చేసినప్పటికీ అతడిపై కేసు పెట్టేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరగకపోవడమే ఈ సందేహాలకు బలం చేకూరుస్తున్నది. ప్రధాని మోదీ మొక్కుబడి ఖండనతో సరిపెడితే, కేంద్ర న్యాయశాఖ పూర్తిగా మౌనం వహించడం న్యాయవ్యవస్థపై బీజేపీకి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తున్నది. అసలు న్యాయవ్యవస్థనే తమ మహత్తరమైన ఎజెండాకు ‘అడ్డంకి’గా భావిస్తున్న పాలకవర్గం నుంచి ఇంతకన్నా ఎక్కువ స్పందన ఆశించడం అత్యాశే.