ఉస్మానియా యూనివర్సిటీ.. ఇదో విజ్ఞాన భాండాగారం. వందేండ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం. ఓ వైపు విద్యనందించే నేలగా చరిత్ర పుటల్లోకి ఎక్కితే, మరోవైపు విద్యార్థి ఉద్యమాలకు పుట్టినిల్లు. నాటి వందేమాతరం ఉద్యమం నుంచి మొన్నటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు ఎన్నో ఉద్యమాలకు ఓయూ వేదికైంది. ఒక్క తెలంగాణే కాదు, యావత్ ప్రపంచంలో ఎక్కడ పీడితవర్గాల పక్షాన పోరాటం జరిగినా, వారికి మద్దతుగా ఓయూ విద్యార్థి సంఘాల గొంతులు నినదిస్తూనే ఉంటాయి. అది గాజా సమస్య అయినా, గల్ఫ్ సమస్య అయినా సరే అణగారిన వర్గాల తరఫున ఇక్కడ ప్రశ్నించే గళాల ధ్వని ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.
2009లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీక్షతో యావత్ రాష్ట్రం కదలగా, హైదరాబాద్ వేదికగా ఉస్మానియా విద్యార్థులు అనిర్వచనీయమైన పోరాటాన్ని సాగించారు. కేసీఆర్‌కు మద్దతుగా తెలంగాణ రాష్ట్రమే ఏకైక అజెండాగా అన్ని సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఇలా చెప్పుకొంటూ పోతే ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఓయూ విద్యార్థుల పాత్ర గురించి ఎంత రాసినా ఒడవని చరిత్రే. ఓ వైపు కేసీఆర్ దీక్ష, మరోవైపు విద్యార్థి అమరవీరుల త్యాగఫలం, విశ్రమించని విద్యార్థుల పోరాటంతో తెలంగాణ సిద్ధించింది. ఇందులో ఓయూ విద్యార్థుల పాత్ర చిరస్మరణీయమైనది. పోరాటాల పునాదులపై ఏర్పడిన ఇలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఓయూ విద్యార్థుల గొంతును నొక్కేందుకు నేటి కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. యూనివర్సిటీలో ధర్నాలు, ఆందోళనలపై నిషేధిస్తూ సర్క్యులర్‌ను తీసుకువచ్చింది. విద్యార్థుల చదువులతో పాటు యూనివర్సిటీ పరిపాలనా కార్యకలాపాలను సాకుగా చూపే ప్రయత్నం చేస్తున్నది. పోరాటాలు, ఆందోళనల వల్ల విద్యా వాతావరణం దెబ్బతింటుందనే అవాస్తవాలను ప్రచారం చేసే పనిలో పడింది.
పొద్దున లేస్తే తమది ప్రజా పాలన, ప్రజాస్వామ్యయుత పాలన, రాజ్యాంగబద్ధమైన పాలన అని చెప్పే రేవంత్ ప్రభుత్వం ఈ తరహా సర్క్యులర్‌ను ఇవ్వడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఓయూలోని ఆర్ట్స్ కాలేజీ వేదికగా నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టిన ఎన్నో సభలకు హాజరైన సంగతి రేవంత్‌కు
గుర్తులేదా? వారి అనుబంధ విద్యార్థి సంఘాల నాయకులు నిరసనలు చేయలేదా? నాడు యూనివర్సిటీలో విద్యా వాతావరణం దెబ్బతిన్నదా? ఆరోజు లేని ఇబ్బందులు, సమస్యలు నేడు ఎలా వచ్చాయి? ఇదే విషయాన్ని ప్రభుత్వంతో పాటు ఓయూ అధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నాం.
ప్రపంచ చరిత్ర చూస్తే.. ఎక్కడ ఉద్యమం జరిగినా అందులో విద్యార్థుల పాత్ర ఉంటుందనేది సుస్పష్టం. అదే దారిలో ఓయూ విద్యార్థులు నడిచారు, నడుస్తూనే ఉంటారు. చర్చా వేదికలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, బహిరంగ సభలతో తెలంగాణ సమాజాన్ని చైతన్యపరుస్తూనే ఉంటారు. అలాంటి విద్యార్థి సంఘాల పోరాటాలను తొక్కివేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం సర్క్యులర్ ఇవ్వటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే సర్క్యులర్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మరో సంగ్రామానికి సిద్ధమవుతాం. ఓయూ విద్యార్థుల పోరాటం ముందు నాటి సమైక్య పాలకులే పారిపోయారు… రేవంత్ రెడ్డి ‘సర్కులర్’ ఎంత?
– చటారి దశరథ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉస్మానియా యూనివర్సిటీ