ఉద్యమం తీవ్రతరమై కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక తెలంగాణ ఇచ్చుడు తప్ప వేరే మార్గం లేక 2014, ఫిబ్రవరి 18న లోక్‌సభ, 20న రాజ్యసభ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ బిల్లుకు ఆమోదం తెలిపాక, మార్చి 1న ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదించారు. జూన్ 2న రాష్ట్రం అవతరించి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
1956, నవంబర్ 1న ఆంధ్రతో కలిపిన తెలంగాణకు, జూన్ 2న ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు చాలా వ్యత్యాసం ఉన్నది. 1707లో ఢిల్లీ పాదు షా ఔరంగజేబు మరణానంతరం, కొందరు సామంత రాజులుగా ఉన్నవారు స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. ఎందుకంటే, మొఘల్ సామ్రాజ్యంలో బలవంతులైన రాజుల్లో ఔరంగజేబు చివరివాడు. ఆ తర్వాతి పాలకులు బలహీనపడటంతో ఆ విధంగా జరిగింది. అప్పుడు గోల్కొండను పాలిస్తున్న అసఫ్‌జాహీ రాజు 1724లో ఈ ప్రాంతాన్ని ప్రత్యేక రాజ్యంగా ప్రకటించుకున్నాడు. అప్పటినుంచి దాదాపు 224 ఏండ్లు నిజాముల పాలన కింద ఉండి, 1948లో భారతదేశంలో విలీనమైంది తెలంగాణ ప్రాంతం. హైదరాబాద్ రాజధానిగా గల దేశానికి రాజైన కులీ కుతుబ్ గోల్కొండ నుంచి పాలన సాగించినా, 1591లో ఒక కొత్త, సుందర నగరం నిర్మించాలని భావించి హైదరాబాద్‌ను నిర్మించాడు. అప్పటినుంచీ అది ప్రపంచంలోనే అత్యంత సుందర నగరాల్లో ఒకటిగా వెలుగొందుతున్నది.
1956 దాకా సరిపోయిన వనరులతో, తక్కువ జనాభాతో ఉన్న హైదరాబాద్, జిల్లాలు సహా, చాలా శుభ్రమైన బాటలతో, చల్లదనాన్నిచ్చే చెట్లతో ఉండేది. హైదరాబాద్‌ను ‘సరస్సుల నగరం’ అనీ, ‘తోటల నగరం’ అనీ పిలిచేవారు విదేశీయులు. కులీ కుతుబ్ షా కూడా నగరాన్ని నర్మించి ‘అల్లా! నా ఈ నగరం, చేపలు నిండిన సరస్సులాగ కళకళలాడుతూ ఉండాలి’ అని ప్రార్థించాడట. దేవుడు ఆయన ప్రార్థనను పూర్తిగా అర్థం చేసుకోకుండా, చేపల బదులు ఆంధ్ర రాజకీయ నాయకుల రూపంలో తిమింగలాలతో నింపాడు హైదరాబాద్‌ను. ఇంక ఎట్లా తయారైంది ఈ సుందర నగరం?
ఒక దశాబ్దం నుంచి ఇంకొక దశాబ్దానికి ఉద్యోగాలన్నీ ఆంధ్ర వారి వశమయ్యాయి. ఆంధ్ర వ్యాపారస్థుల వలస అప్రతిహతంగా సాగింది. ఆంధ్ర వారి వ్యాపారాలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు విచ్చలవిడిగా విస్తరించాయి. వీటికోసం బడా బాబులు భూములను కబ్జా చేస్తే, ఆంధ్ర సామాన్యులు, ఉద్యోగులు నాలాలను కూడా వదలకుండా ఇండ్లు నిర్మించుకున్నారు. ఎక్కువ ఉద్యోగాల్లో, ఉన్నత పదవుల్లో, ముఖ్యంగా రెవెన్యూ శాఖలో అంతా ఆంధ్రవారే ఉద్యోగులవడంతో అడ్డగోలుగా పర్మిషన్లు, అక్రమ కట్టడాలకు మద్దతు పుష్కలంగా లభించింది. ఇక నగరంలో సరస్సులు కుంచించుకుపోయాయి, తోటలు మాయమయ్యాయి. ఈ పర్మిషన్లు ఎంత అడ్డదిడ్డంగా ఇచ్చారనేది హైదరాబాద్‌లో ఇంటి నెంబర్లను చూస్తే అర్థమవుతుంది. మా చిన్నప్పుడు పబ్లిక్ గార్డెన్‌కు వెళ్తే అక్కడి రోడ్లు, పేవ్మెంటు మీద తలపెట్టుకొని పడుకోవాలనిపించేంత శుభ్రంగా ఉండేవి.
1960 నుంచి 2014 దాకా గొప్పవారి కాలనీల్లో తప్ప సామాన్యుల ఇండ్ల చుట్టూ అటువంటి శుభ్రత చూడలేదు. ఈ వలస పాలకుల విచ్చలవిడి విధ్వంస పాలనలో ప్రజలు కూడా నియమ నిబంధనలు లేకుండా అరాచకంగా తయారయ్యారు. మా చిన్నప్పుడు కింగ్ కోఠిలోని నిజాం భవనం ముందు నుంచి కార్లు, గుర్రపు బండ్లు, రిక్షాలు ఏవి వెళ్లినా, మెల్లిగా చప్పుడు చేయకుండా ప్రయాణించేవి. అలాంటిది వాహనాలు నడిపేవారు కూడా చట్టాలు పాటించడం గాని, మార్గదర్శకాలను గౌరవించడం గాని అక్కర్లేదన్నట్టు తయారయ్యారు. ‘ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి, ప్రజాప్రతినిధి పరిచయం ఉంటే, మమ్మల్ని చట్టాలు ఏమీ చెయ్యవు’ అన్న ధీమాతో ప్రవర్తించే విధంగా తెలంగాణలో కూడా చిందరవందర జీవితాలయ్యాయి. ఇప్పుడు కొందరు ఆంధ్ర విద్యార్థులు అమెరికాలో శిక్షలను ఎదుర్కొంటున్నారు ఇక్కడిలాగే ప్రవర్తించి.
ఈ తెలంగాణను 14 ఏండ్లు ఉద్యమం చేసి సాధించిన కేసీఆర్ కేవలం తొమ్మిదేండ్లలో తెచ్చిన మార్పు ‘న భూతో న భవిష్యతి’ అన్నట్టు ఉండింది. మనుషులకు ప్రాథమిక అవసరాలు తిండి, బట్ట, గూడు. ఇవి ఆయన ఎలా సాధించారో ఓసారి చూద్దాం! తిండి అంటే.. భోజనం, తాగునీరు. భోజనానికి అత్యవసరం వ్యవసాయం. ఆంధ్ర పాలకులు దీన్ని తెలంగాణ ప్రాంతంలో నిర్వీర్యం చేశారు. ఇక్కడి చెరువులను నిర్లక్ష్యం చేసి కృష్ణా, గోదావరి జలాలు ఆంధ్రకు పారేటట్టు చేశారు. వారు కలవకముందు డిజైన్ చేసిన ప్రాజెక్టులు, మొదలుపెట్టిన ప్రాజెక్టులను దశాబ్దాల తరబడి కట్టకుండా పడావు పెట్టారు. హడావుడిగా వేసిన శిలాఫలకాలు ఎన్ని ఉన్నాయంటే వాటితో ఒక కోట చుట్టూ గోడ నిర్మించవచ్చు.
ఎన్నికల ముందు హడావుడిగా హెలికాప్టర్లో వెళ్లి, దేవాదులకు శంకుస్థాపన చేయడం, కుదరదని తెలిసీ, మహారాష్ట్రలో బాబ్లీ దగ్గర నిరసన తెలిపి అరెస్టు చేయించుకున్న చంద్రబాబే కాదు, అటువంటి నాటకాలు వలస నాయకులందరూ ఆడారు. ఇంతకంటే ఘనుడు చాలా విజయవంతంగా రికార్డు టైమ్‌లో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును నిర్మించి రాయలసీమకు నీళ్లు పట్టుకుపోయిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఆ ప్రాజెక్టుకు మంగళహారతులిచ్చి నీళ్లు దానం చేసిన ఘనత తెలంగాణ ద్రోహులు డీకే అరుణ లాంటివాళ్లకు చెందుతుంది. తెలంగాణ ప్రాజెక్టుకు మాత్రం జలయజ్ఞం పేరు మీద ముందు కాలువలు తవ్వేసి తన ప్రాంతం కాంట్రాక్టర్లకు డబ్బులిచ్చేశాడు వైఎస్ఆర్. ఆ కాలువలను చూసి అమాయక తెలంగాణ ప్రజలు చాలామంది ఆయన అభిమానులైపోయారు. తీరా చూస్తే తెలంగాణకు చుక్క నీరు రాకుండా జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకున్న ఘనుడు వైఎస్ఆర్. తిరుపతి మొదటి రెండు కొండల మీద విస్తారంగా శిలువ పాతడమే కాదు, తన ఇడుపులపాయకు 8 లైన్ల రోడ్లు వేసుకున్నాడు.
ఆఖరికి నారపల్లిలో ఉన్న డీర్ పార్కులోంచి నాలుగు వందల జింకలను ఇడుపుల పాయకు పట్టుకుపోయాడు. నిష్పాక్షికంగా ఆలోచిస్తే చంద్రబాబు కంటే వైఎస్ఆర్ మంచి రాజకీయ నాయకుడు. కనీసం తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదాకా చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం చెత్తలాగానే ఉండింది. బాబుకు తన ఊరికంటే తన సంపద ఉన్న హైదరాబాద్ మీదే మోజు ఎక్కువ! ఈ కారణం పైకి చెప్పుకోలేడు, ఎందుకంటే అదంతా అక్రమంగా దోచుకున్న తెలంగాణ సంపద. అందుకే, ఇప్పుడు ఆంధ్రకు ముఖ్యమంత్రిగా ఉన్నా, అమరావతి నీట మునిగినా, పోలవరం కాఫర్ డాం కూలిపోయినా పట్టించుకోకుండా, హైదరాబాద్ నుంచి అమరావతికి 2 గంటల్లో చేరుకునే గ్రీన్‌ఫీల్డ్ హైవే వేయిస్తున్నాడు విజనరీ చంద్రబాబు. వేల కోట్లు వెచ్చించి నిర్మించే ఆ రహదారి ఆంధ్ర ప్రజలకు ఏ రకంగా లాభం చేకూరుస్తుంది?
-కనకదుర్గ దంటు ,89772 43484