ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్షాలకు విసిరే సవాళ్లు మాములుగా ఉండవు. తాజాగా ఆయన ఒకేసారి 114 మంది అభ్యర్థులను ప్రకటించి వారికి కంటిమీద కునుకు లేకుండా చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న కాంగ్రెస్ , బీజేపీలకు ఈ పరిణామం , ఈ ఎత్తుగడ దిమ్మతిరిగిపోయేలా చేసింది.అయినప్పటికీ అవి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ, ప్రగల్భాలు పలుకుతున్నాయి. వాటి సంగతి కాస్త పక్కనబెడితే సీపీఐ, సీపీఎంలకు మాత్రం గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. పైకి విమర్శలు గుప్పించినా లోలోపల మింగలేని, కక్కలేని స్థితిలో ఉన్నాయి.
నిజానికి ఒకప్పుడు వామపక్షాలు ప్రాతినిధ్యం వహించిన సీట్లలో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. సిట్టింగ్‌లను కాదని కేసీఆర్ ఆ సీట్లను వామపక్షాలకు కేటాయించలేరు. ఇందుకు ఆయన లెక్కలు ఆయనకున్నాయి. కీలకమైన ఈ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గం అతి ముఖ్యమైనదే. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక, అప్పటి సర్వే ఆధారంగా బీ ఫారాలు ఇచ్చేముందు ముందస్తు జాబితాలో ఏమైనా మార్పుచేర్పులు జరిగే అవకాశాలు లేకపోలేదు. ఈ వ్యవహారాన్ని పక్కనబెట్టి రాష్ట్రం లో, దేశంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గడానికి కారణాలు విశ్లేషిద్దాం. ఒకప్పుడు గొప్ప వెలుగు వెలిగిన కమ్యూనిస్టు పార్టీలు ప్రస్తుతం ఇంత బలహీనంగా మారడానికి కారణం వాటి స్వయంకృతాపరాధమేనని చెప్పవచ్చు.
సైద్ధాంతిక నిబద్ధత, ప్రజాసంక్షేమానికై ఆరా టం, ప్రజాసమస్యలపై పోరాటం కామ్రేడ్ల ప్రధాన లక్షణాలు. వారి ప్రతిష్ఠ మసకబారడానికి దారితీసిన పరిస్థితులను, వైఫల్యాలను సునిశితంగా, నిజాయితీగా ఏకరువు పెడితే రాస్తే రామాయణం, వింటే మరో భారతమవుతుంది. అంత లోతుల్లోకి వెళ్లకుండా, స్థూలం గా పరికిస్తే, మారుతున్న కాలానికి అనుగుణం గా కామ్రేడ్లు మారకపోవడం, పోరాట వ్యూ హాలు రూపొందించుకోకపోవడం, సైద్ధాంతిక నిబద్ధత పేరుతో ఫక్తు ఛాందసవాదంలోకి.. ఇంకా చెప్పాలంటే పిడివాదంలోకి జారిపోవడమే. తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్న చందంగా వారి వ్యవహారశైలి ఉన్నది. కొందరితో అధిక స్నేహం చేస్తూ, మరి కొందరిని అనవసరంగా ద్వేషిస్తూ కాలయాపన చేయడమే వారి ప్రభ తగ్గడానికి కారణం. విలువల మీద కాకుండా అవసరాల మీద ఆధారపడి మైత్రీబంధం నెరపుతూ, సీట్లకోసం ఆరాటపడుతూ, ఎన్నికల పొత్తులు కుదుర్చుకుంటూ ఫక్తు రాజకీయ పార్టీల్లాగా, తోకపార్టీల్లా (రాష్ట్రంలో టీడీ పీ, కాంగ్రెస్‌లకు, దేశంలో కాంగ్రెస్‌కు) మారిపోవడమే వారి పలుకుబడి తగ్గడానికి దారితీసింది.
ఉద్యమాల పార్టీలు, సైద్ధాంతిక పార్టీలు కాస్తా ఊసరవెల్లి పార్టీల మాదిరిగా మారిపోయాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిజం ప్రభావం తగ్గుతూ, క్యాపిటలిజం ప్రభావం పెరుగుతూ పోతున్నది. ఆర్థిక సరళీకరణ కారణంగా ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు నామమాత్రం అయిపోయాయి. అనేక ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థల్లో యూనియన్లే లేవు. పార్టీల్లో కొత్త సభ్యులు చేరకపోగా, ఉన్న సభ్యులు వయసుమీరి పిడివాదం ముదిరి కొత్త యోచనలు చేయడంలో, కొత్త ఉద్యమాల నిర్మాణంలో పూర్తిగా విఫలమయ్యారు.
దీంతో వారి బలం, బలగం గణనీయంగా తగ్గిపోయింది. ఒకప్పుడు పశ్చిమబెంగాల్, త్రి పురల్లో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న సీపీ ఎం అక్కడ ప్రస్తుతం నామ్ కే వాస్త్ గా మారిం ది. కేరళలో మాత్రమే లెఫ్ట్‌ఫ్రంట్ కూటమి మనుగడ సాగిస్తున్నది.
ప్రజలకు వామపక్షాలు దూరం కావడానికి పైన వివరించినవే కాకుండా అనేక కారణాలున్నా ఒకటి మన రాష్ట్రంలో జరిగిన తెలంగాణ ఉద్యమం కూడా ఒక కారణమే.
దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతానికి అన్యా యం జరుగుతున్నదని సాక్ష్యాధారాలతో తేటతెల్లమైనప్పటికీ దాన్ని వామపక్షాలు పెద్దగా పట్టించుకోలేదు. కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం ప్రారంభమైనా, ఊపందుకున్నా దాంట్లో పాలు పంచుకోలేదు. సీపీఐ ఆలస్యంగానైనా అనుకూలంగా స్పందించినప్పటికీ , సీపీఎం మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది. తెలంగాణ ఏర్పాటుకు సమ్మతిస్తూ దేశంలో 32 పార్టీల్లో 28 పార్టీలు లేఖలు ఇవ్వగా సీపీఎం మాత్రం అనుకూలంగా లేఖ ఇవ్వలేదు. దీంతో కోట్లమంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఖాతరు చేయని పార్టీగా ఆ పార్టీ నిలిచిపోయింది.అందుకే 2014లో గెలిచిన సీటును కూడా 2018 నాటి కి ఆ పార్టీ కోల్పోయింది. భాషాప్రయుక్త రాష్ర్టాలను విడదీయవద్దనే ఏకైక కారణాన్ని చూపు తూ తెలంగాణ ఏర్పాటును సీపీఎం అడ్డుకున్న ది. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నది.
తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే బలమైన ఆకాంక్ష ఏనాటినుంచో ఉన్నది. ఈ ప్రాంతానికి జరిగిన అనేక అన్యాయాలు, చూసి న అణచివేత, పొందిన వివక్ష వారిలో ఈ ప్రగా ఢ వాంఛను దశాబ్దాలుగా సజీవంగా ఉంచింది. దీన్ని ఎంతమాత్రం గుర్తించకుండా ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదన్నట్టు వ్యవహరించిన పార్టీలన్నీ అడ్రస్ లేకుండా పో యాయి. తెలంగాణ ప్రజల నిజమైన, నిఖార్సయిన పార్టీగా అప్ప టి టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) నిలబడింది. అట్టడుగునుం చి ఉద్యమాన్ని నిర్మించిన కేసీఆర్ పార్టీని అత్యున్నత శిఖరాలకు చేర్చారు. బలపడేందుకు అద్భుతమైన అవకాశాలున్నప్పటికీ వినియోగించుకోలేక తెలంగాణలో వామపక్షాలు చతికిలపడ్డా యి. అవకాశవాదంతో తెలంగాణను వ్యతిరేకిం చిన మరికొన్ని పార్టీలు ఉనికిని కోల్పోయాయి. దీనికి కేసీఆర్‌ను నిందిస్తే లాభమేంటి?
దేశంలో, రాష్ట్రంలో (పీడీఎఫ్ పేరుతో) ఒకప్పుడు ఎంతో శక్తిమంతమైన పార్టీగా ఉన్న సీపీ ఐ (భారత కమ్యూనిస్టు పార్టీ) అనంతరం ఎన్ని చీలికలు, పేలికలైందో తెలిసిందే. ఎగిరే ఎర్రజెండా వెలుగులో ఎత్తుకు ఎదగాల్సిన ఆ చిన్నాచితకా పార్టీలు అదే ఎర్రజెండా నీడలో ఒదిగి, ఒదిగి ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తున్నామనే భ్రమలో కులోన్మాదాన్ని, ధనోన్మాదాన్ని, వర్గోన్మాదాన్ని వామపక్షాలు ఉపేక్షించాయి. ప్రజల న్యాయమైన డిమాండ్లను విస్మరించాయి. వైరుధ్యాలను పక్కనబెట్టి చీలికలైన పార్టీలన్నీ ఒక్కటై పోరా టం చేయకపోవడం వామపక్షాల వైఫల్యమే కదా! ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే విశాల ఐకమత్య నినాదం వారికి వర్తించదా?. ప్రజల సమస్యలను గుర్తించకపోవడం, గుర్తించినా పట్టించుకోకపోవడం, వాటి పరిష్కారానికై పోరాడకపోవడం వాటి లోపమే.
విద్య, వైద్య, పారిశ్రామికరంగాల్లో అనేక మార్పులు వచ్చాయి. నిజానికి గతం కన్నా ప్రజలు ప్రస్తుతం కొత్తకొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారు. సమస్యలు ఎక్కడుంటే కమ్యూనిస్టులు అక్కడ ఉండాలి. కానీ అందుకు భిన్నంగా పాత చింతకాయ పచ్చడిలా పాత పోరాట పంథాను, సైద్ధాంతిక ఛాందసవాదాన్ని వామపక్షాలు వీడలేదు. అందుకే వారి ఉనికి నామమాత్రమైంది. తప్పులు సరిదిద్దుకోకుండా, వైఖరి మార్చుకోకుండా ఉన్నంతకాలం వారి పరిస్థితి ఇలాగే ఉండక తప్పదు.
అంతేకాక చిన్నచిన్న అభిప్రాయ భేదాల వల్ల, అహంభావాల వల్ల విడిపోయి సొంత కుంపట్లు వెలిగించుకొన్న వామపక్ష పార్టీలు ఎప్పటికి ఏకమవ్వ లేవు. ప్రజలకు వెలుగురేఖలు పంచలేవు.
-కే సతీశ్‌చంద్ర
99082 12563