Lateral Entry | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తలపెట్టిన ల్యాటరల్ ఎంట్రీ భర్తీ విధానం పురిట్లోనే సంధికొట్టింది. విపక్షాలు, స్వపక్షాల వ్యతిరేకత నడుమ మోదీ సర్కార్ వెనక్కి తగ్గక తప్పలేదు. కేంద్రంలోని పలు విభాగాల్లో డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ సెక్రెటరీ పోస్టుల భర్తీకి ఇటీవల యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
సాధారణంగా సివిల్ సర్వెంట్లతో భర్తీచేయాల్సిన ఈ పోస్టులను ప్రైవేట్ వ్యక్తులతో భర్తీ చేయ డం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు వీటిలో అమలు చేయకపోవడం వివాదాస్పదమైంది. కొన్ని ప్రత్యేక పదవుల్లో ఐఏఎస్‌లకు బదులుగా ఆయా రంగాల నిపుణులను నియమించాలన్న ఉద్దేశంతోనే ఈ నియామక విధానాన్ని తీసుకువచ్చినట్టు కేంద్రం చెప్తున్నది.
13 పాయింట్ రోస్టర్ పాలసీ ప్రకారం ల్యాటరల్ ఎంట్రీలకు రిజర్వేషన్లు వర్తించవు. ఈ పోస్టుల నియామకంలో రిజర్వేషన్లను తుంగలో తొక్కేందుకు ఒక్కో పోస్టుకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేశారు. అదే మొత్తం పోస్టులకు కలిపి ఒకే నోటిఫికేషన్ ఇస్తే రిజర్వేషన్లు పాటించాల్సి ఉంటుంది.
ఇప్పటికే కీలక విభాగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల భాగస్వామ్యం తగ్గుతున్నదని ఆందోళన చెందుతున్న విపక్షాలు.. మోదీ సర్కార్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. ఎన్డీయే కూటమిలోని లోక్ జనశక్తి (రామ్‌విలాస్) వంటి మిత్రపక్షాలూ ఈ ఎత్తుగడపై అసంతృప్తి వ్యక్తం చేశాయి.
ప్రభుత్వ నియామకాల్లో రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి రాజీ కుదరని ఆ పార్టీ అధినేత, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ తెగేసి చెప్పారు. అటు ప్రతిపక్షాలు, ఇటు స్వపక్షాల నిరసనతో కేంద్రం నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని యూపీఎస్సీని ఆదేశించింది.
నిజానికి ఈ ల్యాటరల్ ఎంట్రీ వివాదం ఇప్పటిది కాదు. 2005లో యూపీఏ-1 హయాంలో ల్యాటరల్ ఎంట్రీని రెండో అడ్మినిస్ట్రేటివ్ రీఫామ్స్ కమిషన్ ప్రతిపాదించింది. కానీ, అది పెద్దగా ముం దుకువెళ్లలేదు. 2017లో తన మూడేండ్ల యాక్షన్ ఎజెండాలో భాగంగా నీతి ఆయోగ్ దీన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది.
2018 నుంచి ఇప్పటివరకు ల్యాటరల్ ఎంట్రీ విధానంలో మొత్తం 63 మందిని నియమించారు. వారిలో 35 మంది ప్రైవేట్ వ్యక్తులు. 57 మంది తమ పదవులకు అతుక్కుపోయారు. గత నెల 24న కేంద్రం ఈ వివరాలను లోక్‌సభకు తెలియజేసింది.
రిజర్వేషన్ల వ్యతిరేకిగా ముద్రవేసుకున్న బీజేపీ పాలనలో ల్యాటరల్ నియామకాలను ముందుకు తేవడంపై సహజంగానే గగ్గోలు బయలుదేరింది. దీంతో యూటర్న్ల పరంపరలో ఇది కూడా చేరిపోయింది. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ‘చార్ సౌ పార్’ అని ఊదరగొట్టగా.. ఆ పార్టీకి కనీసం సాధారణ మెజారిటీ కూడా రాలేదు. 240 దగ్గరే బండి ఆగిపోయింది.
దీంతో సంకీర్ణంలోని భాగస్వామ్య పక్షాలను కాదని ముందుకువెళ్లలేక బీజేపీ ఇబ్బందులు పడుతున్నది. ఒకదాని వెనుక ఒకటిగా పీఛేముడ్లు తప్పడం లేదు. వక్ఫ్ సవరణ, ప్రసార నియంత్రణ బిల్లుల విషయంలో అదే జరిగింది. ముందు ప్రతిపాదించి ఆపై ప్రతిపక్షాలు, మిత్రపక్షాల నుంచి వ్యతిరేకత రావడంతో ఆయా బిల్లులు జేపీసీకి నివేదించి చేతులు కట్టుకోవాల్సి వస్తున్నది.
తన సొంత ఎజెండాపై బీజేపీ నడక ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్టుగా తయారైంది. ఈ నేపథ్యంలో ఏకాభిప్రాయ సాధన అనేది లేకుండా ముందుకువెళ్తే ఇలాంటి భంగపాట్లు తప్పవని బీజేపీ గుర్తిస్తే మంచిది.