తెలంగాణపై మేధావులు ఒక శ్వేతపత్రం ఇవ్వగలరా? సాధారణంగానైతే శ్వేతపత్రాలు ఇచ్చేది ప్రభుత్వాలు. లేదా ఏదో ఒక అధికారంలో ఉండేవారు. అటువంటి స్థితిలో మేధావులను ఇవ్వమనటం ఆశ్చర్యం కలిగించవచ్చు. అయినప్పటికీ అట్లా కోరటం ఎందుకో చూద్దాము. శ్వేతపత్రం అనేదానిలో ఆ నిర్దిష్ట విషయంపై అందుకు సంబంధించిన సమస్త స్థితిగతులను పొందుపరచాలి. ఆ పనిచేయటంలో ఎటువంటి దాపరికాలు, రాగద్వేషాలు ఉండరాదు. వాస్తవాలను, గణాంకాలను ఎత్తి చూపటం, అవసరమైన విశ్లేషణలు మినహా బహుశా ఎటువంటి వ్యాఖ్యానాలు చేయకూడదు. తెలంగాణ విషయానికి వస్తే, గత పదేండ్ల తమ పరిపాలన గురించి బీఆర్ఎస్ అనేక వివరాలు చెప్పింది, ఇప్పటికీ చెప్తున్నది. మరొకవైపు కాంగ్రెస్ తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ వివరాలను ఖండిస్తూ విమర్శలు చేసింది. ఇప్పుడు అధికారానికి వచ్చిన తర్వాత శ్వేతపత్రాలు విడుదల చేసింది. ఇతర అంశాలపై విమర్శలు కొనసాగిస్తున్నది. ఉభయులు చెప్తున్నవి పరస్పర విరుద్ధంగా ఉన్నందున ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. కనుక ఈ సమస్య తీరటానికి మేధావుల శ్వేతపత్రం అవసరం.
ప్రజలు బీఆర్ఎస్ చెప్తున్నది, ప్రభుత్వం చెప్తున్నది ఏమి నమ్మినా నమ్మకపోయినా అనేక సందేహాలుండటం సహజం. అవి తీరటం ఒక తప్పనిసరి అవసరం. అంతిమంగా ఈ రాష్ట్రం వారిది. ప్రస్తావనలలోకి వస్తున్న విషయాలు ఆషామాషీవి కావు. ప్రజల వర్తమాన జీవితాలకు, భవిష్యత్తుకు సంబంధించిన సీరియస్ విషయాలు. వారి గతకాలపు పోరాటాలకు, వర్తమాన ఆరాటాలకు సంబంధించినవి. అందువల్ల, రెండువైపుల నుంచి వినవస్తున్న మాటలలోని సత్యాసత్యాలేమిటో ప్రజలకు తేటతెల్లం కావాలి. ఈ పనికి మేధావులు తటస్థ వైఖరితో పూనుకోవాలి. ప్రజలకు తమ నిత్య జీవితానుభవాల ద్వారా అనేక విషయాలు సహజరీతిలో తెలిసివచ్చే మాట నిజమే. అదే సమయంలో, వారి సాధారణ దృష్టికి తెలియరానివి, బోధపడనివి కూడా కొన్ని ఉంటాయి. ఉదాహరణకు గణాంక వివరాలు, వాటి విశ్లేషణలు. అందువల్ల వారు తమ వైపు నుంచి శ్వేతపత్రం ఒకటి తయారుచేసి ప్రజల ముందుకుతేవాలి.
ఇందులో ఒక సమస్య ఉండవచ్చు. అధికారంలో ఉన్న లేదా ఉండినవారికి లభ్యమయ్యే వివరాలన్నీ మేధావులకు అందుబాటులో ఉండని మాట నిజం. కానీ ఆ కొరతను ప్రస్తుత సందర్భంలో చాలావరకు అధిగమించవచ్చు. ఎందుకంటే, ఉభయులు కూడా ఈ పదేండ్లలో తమ ప్రకటనలు, నివేదికలు, విమర్శలు శ్వేతపత్రాల రూపంలో అన్ని విషయాలు, గణాంకాలు వెల్లడించినట్లే భావించాలి. ఇవిగాక ఇదే కాలంలో కేంద్రానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు, పలు ఇతర సంస్థలు తమ నివేదికలను, సమాచారాలను వెల్లడిస్తూ వస్తున్నాయి. ఇక్కడ రాష్ట్రంలోనూ కొన్ని ప్రభుత్వేతర సంస్థలు ఆ పనిచేస్తున్నాయి. ఆ విధంగా, పబ్లిక్ డొమైన్ అనే దానిలో లేనిదంటూ బహుశా ఇంకేమీ లేకపోవచ్చు. ఒకవేళ అరకొర ఉన్నా, మేధావుల శ్వేతపత్రం తయారీకి అది పెద్ద కొరత కాబోదు. కనుక వారందుకు సమకట్టాలి. ఈ కార్యానికి నిధులెట్లా అని వారు సంశయించటం సరికాదు. తెలంగాణ అధ్యయనం పేరిట పరిశోధనా సంస్థల నుంచి ఫండింగ్ తెచ్చుకోగలరు వారు. యూనివర్సిటీల నుంచి ఫెలోషిప్లు, స్కాలర్షిప్లు సంపాదించగలరు.
వాస్తవానికి వారిందుకు ఎప్పుడో శ్రీకారం చుట్టవలసింది. ఆ పని మేధావులుగా వారి కర్తవ్యం. ఆ పని చేయకుండా కొందరు ఒక పక్షాన్ని, కొందరు మరో పక్షాన్ని ప్రశంసిస్తూ, లేదా విమర్శిస్తూ పోయారు. ఏ పక్షమూ వహించకుండా రాష్ట్రం కోసం, ప్రజల కోసం, తమ మేధావి బాధ్యతల నిర్వహణ కోసం, జరుగుతున్నవాటిపై గాని, జరగని వాటిపై గాని, జరగవలసిన వాటిపై గాని, అధ్యయనాలు చేసినవారు
ఒక్కరంటే ఒక్కరైనా లేకపోయారు.
ఒక్కరే అన్నిరంగాలను అధ్యయనం చేయటం అసాధ్యం. ఎవరి రంగంపై వారు చేయటం తప్పకుండా సాధ్యమే. అందుకు అవసరమయ్యే కొద్దిపాటి వనరులను వారు వ్యక్తిగతంగా సమకూర్చుకొనగలరు. తమ జీతభత్యాలను, పింఛన్లను, ఇతర ఆదాయాలుంటే వాటిని కొద్దిగా ఖర్చుచేస్తూ. ఉద్యమకాలమంతా ఎన్నెన్నో త్యాగాలు చేసినవారు, ఇప్పుడీ చిన్నపాటి త్యాగం చేయలేరా? దానిని శ్వేతపత్రం కాకుంటే పోనీ అధ్యయన పత్రమనండి.
దురదృష్టవశాత్తు ఏమంటే, మేధావులలో అధికులు తమ విమర్శనా బాధ్యతలనైతే సరిగానే నిర్వహించారు గాని, అధ్యయన బాధ్యతలను పూర్తిగా విస్మరించారు. దానితో ఆ విమర్శలకు అవసరమైన ఆధారాలు ప్రజల ముందు వారు తేలేదు. తేలేదంటే ఆధారాలు లేవని కాదు. కానీ ఉన్నా తీసుకురానట్లయితే ఆ విమర్శలు మామూలు భాషలో చెప్పాలంటే గాలి విమర్శలుగా మిగులుతాయి. లేదా, సాధారణ రాజకీయ ప్రచారాలు, ఉద్దేశపూరిత వ్యాఖ్యలవుతాయి. వాటికి విశ్వసనీయత ఉండదు. మనకు ఇదే ధోరణి కనిపిస్తూ వచ్చింది. అది చివరికి ఒక పార్టీ ఎన్నికల ప్రచార రథాలకు జెండాలూపటం వరకు వెళ్లింది. మేధావులకు రాజకీయ విశ్వాసాలు, సానుభూతులు ఉండరాదని కాదు. కానీ, అంతకన్న ముఖ్యంగా, వారి మౌలికమైన సానుభూతి, మద్దతు ప్రజలతో ఉండాలి.
ఇప్పుడు నిర్దిష్టంగా కొన్ని విషయాలు చూద్దాము. మేధావులు తమ శ్వేతపత్రం లేదా అధ్యయన పత్రం తయారీకి పరిగణనలోకి తీసుకోవలసిన విషయాలేమిటి? తెలంగాణ పరిస్థితి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకముందేమిటి? ఏర్పడినాక బీఆర్ఎస్ పాలనలో ఏమిటి? కాంగ్రెస్ అధికారానికి వచ్చిన తర్వాత ఏమి జరుగుతున్నది? రాగలకాలంలో జరగవలసిందేమిటి? ఎట్లా జరగాలి? అనేది ఒక విధమైన వర్గీకరణ. పరిశీలించవలసిన ప్రధానరంగాలు వ్యవసాయం, పరిశ్రమలు, సర్వీస్రంగం, సంక్షేమం అనుకుంటే అదొక స్థూల వర్గీకరణ. వీటిలోని పలు ఇతర ముఖ్యాంశాలను కూడా గుర్తించి పరిశీలించవలసి ఉంటుంది. అవి నీటి పారుదల, విద్యుత్తు, రైతు సంక్షేమం, వ్యవసాయ ఆర్థికరంగంపై, గ్రామీణ ఆర్థికరంగంపై ఆధారపడే వృత్తులు, పారిశ్రామిక విధానం, పరిశ్రమలకు మౌలిక వసతుల కల్పన, ఐటీ, ఇతర సర్వీస్ రంగాల విధానం, వాటికి మౌలిక వసతులు, పట్టణాభివృద్ధి, రోడ్లు, పరిపాలనాభివృద్ధి, నీతి, అవినీతులు, వ్యాపారాలకు ప్రోత్సాహం, విద్య, వైద్యం, ఉద్యోగ నియామకాలు, ఉపాధి అవకాశాల మెరుగుదలలు, తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవం, కళాసాహిత్యాల ప్రోత్సాహం, బడుగు, బలహీనవర్గాల సంక్షేమం, పేదరికం తగ్గింపు, వివిధ మానవాభివృద్ధి సూచీల మెరుగుదల వివిధరంగాలలో అభివృద్ధి సూచీల మెరుగుదల, మానవ హక్కులూ స్వేచ్ఛల పరిస్థితి, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా సమస్యలకు స్పందనలు, ఉమ్మడి రాష్ట్రంతో గాని, ఇతర రాష్ర్టాలతో గాని, జాతీయ సగటుతో గాని పోల్చినట్లయితే స్వరాష్ట్రం ఏర్పడినప్పటినుంచి ఏ సూచీలలో మెరుగుపడ్డాము, ఎందులో వెనుకపడ్డాము, ఎక్కడ మార్పు లేదు- ఇట్లా అనేకానేక అంశాలను ప్రజల దృష్టినుంచి, వారికి వాస్తవాలు తెలియజెప్పాలనే ఆలోచనతో, నిజాయితీగల మేధావులుగా వారు పరిశీలించి చెప్పటం అవసరం.
వారు ఆ పాత్ర నిర్వహించకపోవటం వల్లనే సమస్య వస్తున్నది. వేర్వేరు విషయాలపై విమర్శలు చేస్తూ వస్తున్నవారు, ఇంతవరకు కనీసం ఒక్క అధ్యయనపత్రమైనా తయారుచేయకపోవటంపై ఏమనుకోవాలి. విమర్శలతో పాటు ఈ పని కూడా చేయవచ్చు గదా? విమర్శలైనా పాక్షికంగా, పక్షపాతంగా ఉంది, జరిగిన మంచిని అణుమాత్రమైనా గుర్తించక, కాంగ్రెస్ పాలనలో ఎన్ని వైఫల్యాలున్నా దేని గురించి కూడా మాట్లాడని వారి గురించి ఏమని చెప్పగలం? చెప్పుకొనేందుకు చాలానే ఉన్నాయి. కొద్ది మాటలు మాత్రం మాట్లాడుకొని తక్కినవన్నీ వారి శ్వేతపత్రానికి లేదా అధ్యయన పత్రానికి వదిలివేద్దాం. వారు ఆ పని చేయటం స్వయంగా తమ వ్యవహార ధోరణిపై కూడా శ్వేతపత్రమవుతుందని గుర్తించాలి.
మొదట మేధావులు ప్రచార రథాలకు జెండాలూపిన అంశాన్ని ఒక నమూనాగా తీసుకుందాము. ఆ రథాలలో వెళ్లినవారు నిరుద్యోగులని తెలిసిందే. వారిది తప్పక తీవ్రమైన సమస్యే. కనుక వారి ఆందోళన, అందుకు మేధావుల మద్దతు సరైనవే. కానీ, తర్వాత ఏమైందన్నది ప్రశ్న. గత డిసెంబర్ ఆరంభంలో అధికారానికి వచ్చిన కాంగ్రెస్, ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలివ్వగలమన్నది. ఇప్పటికి ఏడు నెలలు పూర్తవుతుండగా కొత్త ఉద్యోగం ఒక్కటైనా ఇవ్వలేదు. గత ప్రభుత్వ నోటిఫికేషన్లను తమవిగా చెప్పుకొంటూ ఎటువంటి బెరుకు లేకుండా ప్రతిరోజు అబద్ధాలాడుతున్నది. అది బుకాయింపని స్వయంగా అదే నిరుద్యోగులు పదే పదే ఖండిస్తున్నారు గాని, ఈ మేధావుల బృందానికి మాట్లాడబుద్ధి కావటం లేదు. ఎందువల్లనో తెలియదు. ఇక మిగిలిన అయిదు మాసాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలరని, నెలకు నాలుగు వేల భృతి మాట మొన్నటి బడ్జెట్లోనైనా ఎందుకు లేదని కూడా నిరుద్యోగులు అడుగుతున్నారు. వారు వీధులలోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా మేధావులు మాట్లాడటం లేదు. ఈ మౌనంలో ఏమైనా రహస్యం ఉందేమో వారికే తెలియాలి.
గడువులు పెట్టి మరీ ఇచ్చిన హామీల అమలు పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మన మేధావులకు ఎవరూ చెప్పనక్కరలేదు. ప్రజలను ఎన్నో సమస్యలకు గురిచేస్తున్న ఆ వైఫల్యాలపై తాము ఎందుకు ఈ విధంగా భీష్మించిన మౌనం వహిస్తున్నారో వారే ప్రజలకు చెప్పాలి. పోతే, దశాబ్దాల పాలనలో పౌర హక్కులను పలు విధాలుగా అణచివేసి, అనేక అణచివేత చట్టాలను తెచ్చి, వేలాది నక్సలైట్లను ఎదురుకాల్పుల పేరిట చంపి, జైళ్లలో విచారణలు లేకుండా నిర్బంధించి, అసలు, ఈ దేశంలో పౌర హక్కుల ఉద్యమాల ఆరంభానికే స్వయంగా కారకులైనవారు, ఇక పౌర హక్కులను పునరుద్ధరించగలరంటూ బలపరిచిన మన మేధావులు, గత ఏడు నెలలుగా నక్సలైట్ పార్టీల ప్రకటనలను గమనిస్తూనే ఉంటారు. ఇతరత్రా కూడా హక్కుల పరిరక్షణ ఎంత గొప్పగా సాగుతున్నదో కనీసం కొన్ని సందర్భాలలో తాము కూడా అనుభవిస్తున్నదే. అయినా వారు మాట్లాడరు.
ఇక బీఆర్ఎస్ పాలనలో ‘అంతా సర్వనాశనం, అంతా సర్వనాశనం’ అంటూ విమర్శించి, ఒక్కటంటే ఒక్క మంచినైనా గుర్తించనిరాకరించిన వారి దృష్టికి తీసుకువెళ్లేందుకు వివిధరంగాలలో డజన్ల కొద్దీ విశేషాలు ఉన్నాయి గాని, కొత్తగా ఈ నెల 27వ తేదీ శనివారం నాడు వెలువడిన ఒకే ఒక్క వార్తను ఇక్కడ పేర్కొందాము. అది స్వయంగా ప్రభుత్వమే విడుదల చేసిన తాజా ఆర్థిక-సామాజిక సర్వే. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో వివిధరంగాల అభివృద్ధి గురించి, ఇతర రాష్ర్టాలలో, జాతీయ సగటుతో పోల్చినప్పుడు గల మెరుగైన ఫలితాల గురించి, అందులో చాలా వివరాలున్నాయి. అవన్నీ అధికారపక్షంగాని, మన మేధావి బృందం గాని దాచలేని నూటొక్క నిజాలు. ఇటువంటివి ఇతరత్రా ఇంకా అనేకానేకం ఉన్నాయి. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మేధావులు శ్వేతపత్రమనేది రూపొందించే నిజాయితీని, సాహసాన్ని చూపితే, ఇవన్నీ తెలంగాణ ప్రజల మేలును కోరి వారి దృష్టికి తెచ్చినవారవుతారు.
– టంకశాల అశోక్